కుక్క మృతికి కారణమైన ఆస్పత్రిపై ఫిర్యాదు

Complaint on Hospital While Pet Dog Died With Doctors Negligence - Sakshi

బంజారాహిల్స్‌: ఆస్పత్రి నిర్లక్ష్యంతో తన పెంపు డు కుక్క చనిపోయిందని తప్పుడు ప్రకటనలతో తమను మోసం చేసిన ఆస్పత్రి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలంటూ కోరుతూ ఓ సినీ గేయరచయిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. మణికొండ సెక్రటేరియెట్‌ కాలనీకి చెందిన గౌరీవందన సినిమాల్లో పాటలు రాస్తుంటారు. కొద్దిరోజులుగా ఆమె ఓ వీధికుక్కను పెంచుకుంటోంది. ఆ శునకానికి ముద్దుగా షైనీ అని పేరు పెట్టుకుంది. గత నెల 21న తన పెంపుడు కుక్క చొంగ కారుస్తుండటంతో వెబ్‌సైట్‌లో 24/7 వైద్యసేవలు అందుబాటులో ఉంటాయని ప్రకటన చూసిన ఆమె కుక్కను చికిత్స నిమిత్తం బంజారాహిల్స్‌రోడ్‌ నెం. 12, ఎమ్మెల్యే కాలనీలోని డాక్టర్‌ డాగ్‌ క్లినిక్‌కు తీసుకెళ్లింది.

అదే రోజు రాత్రి డాక్టర్‌ కుక్కను పరీక్షించి మూడు ఇంజక్షన్లు చేశాడు. మరుసటి రోజు కుక్క ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో ఆమె మరోసారి ఆస్పత్రికి రాగా అక్కడ అందుబాటులో వైద్యులు లేరు.  సిబ్బంది కూడా అందుబాటులో లేకపోవడంతో ఆస్పత్రి నిర్వాహకులను నిలదీసింది. అయినా వారినుంచి స్పందన కనిపించలేదు. ఆ మరుసటి రోజే కుక్క చనిపోయింది. మెరుగైన వైద్యం అందించి ఉంటే తన కుక్క బతికి ఉండేదని ఇందుకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ క్లినిక్‌ నిర్వాహకులపై శుక్రవారం బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయాన్ని ఇంతటితో వదిలి పెట్టేది లేదని ఎనిమల్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్, స్టేట్‌ ఎనిమల్‌ వెల్ఫేర్‌ బోర్డు, వెటర్నరీ కౌన్సిల్‌ ఆఫ్‌ తెలంగాణలో కూడా ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపింది. బంజారాహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top