సివిల్‌ ఇంజినీర్‌ మృతదేహం వెలికితీత | Civil Engineer Dead Body postmortem In PSR Nellore | Sakshi
Sakshi News home page

సివిల్‌ ఇంజినీర్‌ మృతదేహం వెలికితీత

Aug 31 2018 1:04 PM | Updated on Aug 31 2018 1:04 PM

Civil Engineer Dead Body postmortem In PSR Nellore - Sakshi

మృతదేహం కోసం తవ్విస్తున్న పోలీసులు, అధికారులు

నెల్లూరు, పెళ్లకూరు/నాయుడుపేటటౌన్‌: మండలంలోని పాలచ్చూరు గ్రామం మామిడి కాలువ సమీపంలోని పారిశ్రామిక కారిడార్‌ భూముల్లో దారుణహత్యకు గురైన గుంటూరుకు చెందిన సివిల్‌ ఇంజినీర్‌ తన్నీరు సురేష్‌గోపి (25) మృతదేహాన్ని గురువారం వెలికితీశారు. ఈ కార్యక్రమం తహసీల్దార్‌ నాగరాజలక్ష్మి, నాయుడుపేట సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ మల్లికార్జున్‌రావుల ఆధ్వర్యంలో జరిగింది. గోపిని హత్య చేసి గోనె సంచిలో కట్టి సెజ్‌ పరిధిలో పనులు జరుగుతున్న కాలువలో పడేసి మట్టి వేసినట్లుగా అధికారులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. మృతదేహం బాగా కుళ్లిపోయింది. ఇయర్‌ ఫోన్స్‌ ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. ఘటనా స్థలంలోనే మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ వెంకటరత్నమ్మ, పెళ్లకూరు, నాయుడుపేట ఎస్సైలు మహ్మద్‌హనీఫ్, వేణు, ఆర్‌ఐ చిదానందం, వీఆర్వో చెంచుబాబు, గ్రామపెద్దలు మునికృష్ణయ్య, వీఆర్‌ఏలు వంశీ, సురేష్‌ పాల్గొన్నారు.

వారి పైనే అనుమానం
సురేష్‌గోపి హత్య కేసు మిస్టరీగా మారింది. ఈనెల 21వ తేదీ అర్ధరాత్రి వరకు డ్యూటీ చేసిన జార్ఖండ్‌ రాష్ట్రానికి చెందిన ఇద్దరు టిప్పర్‌ డ్రైవర్లు పరారీలో ఉన్నారని, వారిని పట్టుకుంటేనే పూర్తి వివరాలు తెలుస్తాయని సీఐ మల్లికార్జునరావు చెబుతున్నారు. కాగా అనుమానితులైన ఇద్దరు డ్రైవర్లు, ఆరోజు డ్యూటీలో లేని మరో ఇద్దరు అదే రాష్ట్రానికి చెందిన డ్రైవర్లు కాంట్రాక్టర్, సూపర్‌వైజర్లకు చెప్పకుండా వెళ్లిపోవడంతో హత్యతో వారికి  సంబంధం ఉంటుందేమో అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గుంటూరు నుంచి 21 తేదీ వచ్చిన గోపి అదేరోజు రాత్రి 11 గంటల ప్రాంతంలో అతని తల్లి ధనలక్ష్మీతో మాట్లాడాడు. అలాగే పాలచ్చూరు సెజ్‌ భూముల వద్ద పనిచేస్తున్న సంస్థ సూపర్‌వైజర్‌ తేజతో అర్ధరాత్రి 1.30 గంటల ప్రాంతంలో మాట్లాడినట్లు విచారణలో తెలియవచ్చింది. కాగా హత్య వెనుక సూపర్‌వైజర్‌ ప్రమేయం కూడా ఉంటుందని బాధిత కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. గోపి నాయుడుపేటకు వచ్చిన తర్వాత ఎవరితో మాట్లాడాడు, అతను పనిచేస్తున్న సెజ్‌ భూముల వద్ద ఉన్న సెక్యూరిటీ మొదలుకొని సైట్‌ ఇంజినీర్, టిప్పర్, ఇతర వాహనాల డ్రైవర్లతో పోలీసులు మాట్లాడి విచారించారు. 

కుటుంబాన్ని పోషించేందుకు..
నాయుడుపేటటౌన్‌: కుటుంబానికి అండగా ఉండేందుకు సురేష్‌గోపి కాంట్రాక్టర్‌ వద్ద విధుల్లో చేరాడు. అయితే అతని మృతితో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. గుంటూరులోని కేవీపీ కాలనీకు చెందిన తన్నీరు శ్రీనివాసరావు, ధనలక్ష్మీలకు ఇద్దరు సంతానం. కొడుకు గోపిని బీటెక్‌ వరకు చదివించారు. కుమార్తె గాయత్రిదేవికి వివాహం చేశారు. గోపిని ఎంటెక్‌ చదివించాలనుకున్నారు. అయితే శ్రీనివాసరావుకు ఒక్కసారిగా ఆరోగ్య సమస్యల రావడంతో మంచం పడ్డాడు. దీంతో కుటుంబాన్ని పోషించేందుకు గోపి గుంటూరులో యార్ల తిరుపతిరావు అనే కంట్రాక్టర్‌ వద్ద రూ.8 వేలు జీతానికి సివిల్‌ కాంట్రాక్టర్‌గా ఈనెల 4 తేదీన పనిలో చేరాడు. గోపి ఆచూకీ కోసం వారంరోజులుగా  వెతుకులాడుతున్న గుంటూరుకు అతని మేనమామ శ్రీనివాసులు, బాబాయిలు తన్నీరు ఏడుకొండలు, చుండూరు కృష్ణకిషోర్, మరో మేనమామ నగలపాటి వెంకటరమణలు మృతదేహాన్ని చూసి బోరున విలపించారు. తమ బిడ్డను కిరాతకంగా హత్య చేసి అనవాళ్లు తెలియకుండా పూడ్చిపెట్టారని నిందితులను గుర్తించి వారికి కఠినంగా శిక్షించాలని పోలీసులను వేడుకున్నారు. పోస్ట్‌మార్టం అనంతరం వారు మృతదేహాన్ని గుంటూరుకు తీసుకెళ్లారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement