రూ.7లక్షలకే కేజీ బిస్కెట్‌ బంగారం అంటూ టోకరా

Cheating Cases Are More In The Name Of Gold Biscuits In A Less Price - Sakshi

తక్కువ ధరకు బంగారం ఆశచూపి నిలువునా ముంచిన వైనం

మోసపోయాక లబోదిబోమంటున్న బాధితులు

కర్ణాటక కేంద్రంగా నడుస్తున్న వ్యవహారం

సాక్షి, గద్వాల: ఓ అజ్ఞాత వ్యక్తి నుంచి ఫోన్‌ కాల్‌.. 24కార్యెట్స్‌ బంగారు బిస్కెట్‌ కేజీ రూ.7లక్షలకే అది కూడా మీకు కాబట్టి ఈ ధరకు ఇస్తాం.. వేరే వాళ్లకైతే అస్సలు ఇవ్వదల్చుకోలేదంటారు. బయటి మార్కెట్‌లో మెలిమి బంగారం కేజీ ధర రూ.37లక్షల 64 వేలు.. కావాలంటే తెలుసుకో.. ఈ సదవకాశం మళ్లీ దొరకదు అంటూనే ఫోన్‌ కట్‌. ఇవతల హాల్లో.. హాల్లో అంటూ అయోమయంలో సదరు వ్యక్తి తిరిగి అదే నంబర్‌కు ఫోన్‌ చేయడంతోనే అసలు సిసలు ట్విస్టులతో మోదలై.. చివరికి మాయగాళ్ల ఉచ్చులో పడి నిండా మోసపోతున్నారు. నడిగడ్డలో ఇటీవల ఓ వ్యక్తి ఫిర్యాదుతో మాయగాళ్ల బాగోతం వెలుగులోకి వచ్చింది.

వలపన్ని దోచేస్తున్నారు..
నడిగడ్డ జిల్లా ప్రజలను టార్గెట్‌ చేసుకుని కర్ణాటకకు చెందిన ముఠా సభ్యులు మోసాలకు పాల్పడుతున్నారు. ధరూర్‌ మండలం గుడ్డెందొడ్డికి చెందిన ఓ వ్యక్తి ఇటీవల పోలీసులను ఆశ్రయించడంతో మరోసారి ఇలాంటి సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. తక్కువ ధరకు బంగారం ఇస్తామంటూ ఆశ చూపి, మేం చెప్పిన స్థలానికి రావాలని చెప్పి నమ్మించి మోసగిస్తున్నారు. ఇలాంటి సంఘటనలు జిల్లాల్లో ఇప్పటికే చాలా చోటుచేసుకున్నాయి. అయితే, కర్ణాటక రాష్ట్రంలోని సరిహద్దు గ్రామాలు జిల్లాను ఆనుకొని ఉండడంతో మాయగాళ్లు ఇలా మోసగించి అలా రాష్ట్రం దాటిపోతున్నారు. దీంతో మోసం జరిగిన ప్రాంతం ఇక్కడి రాçష్ట్రంలో కాదు కేసును ఎలా ముందుకు తీసుకువెళ్తామంటూ పోలీసులు సంశయిస్తున్నారు. ఇదే అదునుగా మాయగాళ్లు రెచ్చిపోతున్నారు.  

వరుస ఘటనలతో బెంబేలు

  • 2019 సెప్టెంబర్‌ నెలలో ధరూర్‌ మండలం గుడ్డెందొడ్డికి చెందిన ఓ వ్యక్తికి కర్నాటకు చెందిన ముఠా సభ్యులు కేజీ బంగారం తక్కువ ధరకే ఇస్తమని చేప్పడంతో ఇది నిజమని నమ్మి రూ.15 లక్షలు మోసపోయాడు. 
  • 2019 మార్చి నెలలో గద్వాల పట్టణానికి చెందిన ఓ ఐస్‌క్రీమ్‌ పార్లర్‌ నడుపుతున్న వ్యాపారికి కర్ణాటకకు చెందిన ముఠా సభ్యులు కేజీ బంగారం రూ.7లక్షలకే ఇస్తానని చెప్పారు. ఇది నిజమని నమ్మి కర్ణాటకకు రూ. 7లక్షల నగదుతో వెళ్లి మోసపోయాడు. చివరికి పట్టణ పోలీసులను ఆశ్రయించాడు.
  • 2018 ఫిబ్రవరిలో ఏపికి చెందిన కొంత మంది ముఠా సభ్యులు గద్వాలకు చెందిన ఓ బంగారు వ్యాపారితో తక్కువ ధరకే బంగారం అమ్ముతామని చెప్పి సదరు వ్యక్తితో రూ.7లక్షలు తీసుకుని ఉడాయించారు. దంతో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

గోల్డ్‌ బిస్కెట్లే అస్త్రంగా..
కొందరి అత్యాశను తమ అస్త్రంగా మార్చుకుంటున్నారు ముఠాసభ్యులు. బంగారం తక్కువ ధరకు ఇస్తామంటే ప్రజలు ఈజీగా నమ్ముతారని ముఠా సభ్యుల ప్రణళికలు వేసి ఆమేరకు పక్కా ప్రణాళిక రూపొందించుకొని ఆ మేరకు మొదట నమ్మకం కలిగేలా ఒక బిస్కెట్‌ను అసలు బంగారు బిస్కెట్‌ను అందిస్తున్నారు.  ఎవరికీ అనుమానం రాకుండా డబ్బులు తీసుకుని బంగారం కొనేందుకు వచ్చిన వ్యక్తిని వెన్నుపోటు పొడవడం ముఠా సభ్యులకు వెన్నతో పెట్టిన విద్యగా ఉంది. 

ముఠాను నడిపించేది ఎవరు?
గత కొన్నెళ్లుగా నడిగడ్డలో ప్రజలు పలు మోసాలకు గురవుతున్నారు. అయితే మోసానికి పాల్పడే ముందే ఇక్కడి ప్రజల తీరు తెన్నులు, ఆర్ధిక అంశాలు, ఒకవేళ ఆ వ్యక్తితో ప్రస్తావిస్తే బయటికి చెబుతుడా అనే తదితర అంశాలను పూర్తిగా నమ్మిన తర్వాతే ఇక్కడి కేటుగాళ్ల అక్కడి ముఠా సభ్యులకు చెరవేస్తారని తెలుస్తుంది.  దీనికితోడు  కేసు నమోదు చేసుకోవాల్సిన పరిస్ధితి ఉన్నా, నేరం జరిగిన ప్రాంతామే ప్రామాణికం కావడంతో పోలీసులకు కేసు ఛేదనలో అనేక అటుపోట్లు ఉంటాయనేది బాధితుని మనోవేదన. 

చర్యలు తీసుకుంటాం
మోసం జరిగితే వెంటనే పోలీసుల దృష్టికి తీసుకురావాలి. అలాగే, తక్కువ ధరకే బంగారం ఇస్తామని చెప్పడం బాధితులు గ్రహించాలి. ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన ఆవసరం లేదు. ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేసుకుని బాధితులకు న్యాయం చేస్తాం. ఏ రాష్ట్రంలో ఉన్నా నిందితులను పట్టుకుని చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. అక్కడి ముఠా సభ్యులకు ఇక్కడి వ్యక్తులతో సంబంధాలు ఉన్నట్లు తెలిసిన వారిపై కూడా కేసు నమోదు చేస్తాం. ఇలాంటి వ్యవహరంలో ఎవరు ఉన్నా ఉపేక్షించేది లేదు. 
 – షాకీర్‌ హుస్సేన్, డీఎస్పీ, గద్వాల 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top