హిమగిరి బార్‌ నిర్వాహకులపై కేసు

Case File Against Himagiri Bar And Restaurant Anantapur - Sakshi

తాడిపత్రిలోతక్కువ ధరకు చీప్‌ మద్యం విక్రయాలు

‘సాక్షి’ కథనంతో మేల్కొన్న అబ్కారీ అధికారులు

సర్దుబాటు చేసుకున్న యజమానులు

తూతూమంత్రంగా కేసు నమోదు

అనంతపురం, తాడిపత్రి: మద్యం అమ్మకాలకు సంబంధించి సరైన రికార్డులు లేకపోవడంతో తాడిపత్రిలోని హిమగిరి బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ నిర్వాహకులపై ఎక్సైజ్‌ శాఖ అధికారులు కేసు నమోదు చేశారు. ‘మద్యం చీప్‌’ శీర్షికన సాక్షిలో ప్రచురితమైన కథనానికి ఎక్సైజ్‌ సూపరిండెంట్‌ నారాయణస్వామి, స్థానిక ఎక్సైజ్‌ సీఐ దశరథరామిరెడ్డి సిబ్బందితో కలిసి హిమగిరి బార్‌ అండ్‌ రెస్టారెంట్‌లను మంగళవారం తనిఖీ చేశారు. ఇక్కడ ఎక్కువ శాతం చీప్‌ లిక్కర్‌ విక్రయిస్తున్నట్లు తేలినట్లు తెలిసింది. 6బీ, 7బీ రికార్డులు సక్రమంగా నిర్వహించకపోవడంతో కేసు నమోదు చేసినట్లు తెలిసింది. 

ముందే జాగ్రత్త పడ్డ నిర్వాహకులు?
సాక్షిలో వచ్చిన కథనంతో ముందే జాగ్రత్త పడ్డ నిర్వాహకులు ఉదయమే రెస్టారెంట్లో ఉన్న నకిలీ మద్యాన్ని తరలించినట్లు తెలిసింది. భారీగా నకిలీ మద్యం నిల్వ ఉండడంతో ఎక్సైజ్‌ అధికారులు వచ్చి ఎక్కడ తనిఖీ చేస్తారో అని ముందు జాగ్రత్తగా ‘తగ్గింపు ధరకే మద్యం విక్రయాలు’ అని బార్‌ వద్ద ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని తొలగించడమే కాకుండా బార్‌లో ఉన్న నకిలీ మద్యాన్ని మరోచోటుకు తరలించేసినట్లు సమాచారం. ఇన్నేళ్లుగా హిమగిరి బార్‌ అండ్‌ రెస్టారెంట్లో ఇష్టారాజ్యంగా మద్యం విక్రయాలు నిర్వహిస్తున్నా స్థానిక ఎక్సైజ్‌ అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడం గమనార్హం. సాక్షిలో ప్రచురితమైన కథనానికి స్పందించిన అధికారులు తనిఖీలు నిర్వహించి కేసు నమోదు చేయడం విశేషం.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top