బాలుడి సమాచారం... భారీ నేరం

Boy Informed Robbery Case in Hyderabad Old City - Sakshi

11 కిలోల వెండి దొంగతనం నిందితుల అరెస్టు  

ఓ బాలుడు ఇచ్చిన సమాచారంతో బందిపోటు ముఠా భారీ దొంగతనానికి పాల్పడింది. పాతబస్తీకి చెందిన జ్యువెలరీ దుకాణం యజమాని నుంచి 11కిలోల వెండిని దోచుకెళ్లింది. 

సాక్షి, సిటీబ్యూరో: పాతబస్తీకి చెందిన జ్యువెలరీ దుకాణం యజమాని నుంచి 11 కేజీల వెండిని దోచుకెళ్లిన బందిపోటు ముఠాను దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు పట్టుకున్నారు. గతంలో ఆ దుకాణంలో పని చేసిన, దాని యజమాని సమీప బంధువు అయిన బాలుడు ఇచ్చిన సమాచారంతో పాత నేరగాళ్లు ఈ పని చేసినట్లు నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ సోమవారం వెల్లడించారు. నిందితులను నుంచి సొత్తును రికవరీ చేశామన్నారు. అదనపు డీసీపీ ఎస్‌.చైతన్యకుమార్‌తో కలిసి తన కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. శాలిబండకు చెందిన అజర్‌ ఫతేదర్వాజా చౌరస్తా ప్రాంతంలో జ్యువెలరీ దుకాణం నిర్వహిస్తున్నాడు. ఇతడి సమీప బంధువైన ఓ బాలుడు గతంలో ఈ దుకాణంలో పని చేశాడు. అప్పట్లో దుకాణానికి ఆలస్యంగా వచ్చినా, సరిగ్గా పని చేయనందుకు దండించాడు. కొన్ని సందర్భాల్లో ఈ బాలుడి తండ్రికి అజర్‌ మిగిలిన బంధువుల ముందు అకారణంగా అవమానించే వాడు. దీంతో సదరు మైనర్‌ మాజీ యజమానిపై కక్షకట్టాడు. ప్రతీకారం తీర్చుకునేందుకు అనువైన సమయం, అవకాశం కోసం ఎదురుచూశాడు. ఇదిలా ఉండగా ఖాజీపురాకు చెందిన మహ్మద్‌ నిజాముద్దీన్‌ గతంలో ట్రావెల్‌ బిజినెస్‌తో పాటు చికెన్‌ సెంటర్‌ నిర్వహించాడు. దాదాపు ఎనిమిది నెలలుగా ఖాళీగా ఉండటంతో అప్పులు పెరిగిపోయాయి. దీంతో వీటి నుంచి బయటపడేందుకు ఏదైనా నేరం చేయాలని భావించాడు.

ఈ విషయాన్ని తన స్నేహితులైన సదరు మైనర్‌తో పాటు ఖాజిపుర వాసి మహ్మద్‌ ఆసిఫ్‌తో చెప్పాడు. అప్పటికే అజర్‌పై కక్షతీర్చుకునేందుకు అవకాశం కోసం ఎదురుచూస్తున్న  బాలుడు వెంటనే స్పందించాడు. అజర్‌ ప్రతి రోజు రాత్రి  దుకాణం మూసిన తర్వాత ఆభరణాలను బ్యాగ్‌లో పెట్టుకుని ఇంటికి తీసుకుçవస్తాడని తెలిపాడు. దీంతో అతడిని దోచుకోవాలని పథకం పన్నిన నిజాముద్దీన్‌ తన స్నేహితులైన ఫలక్‌నుమా వాసులు షేక్‌ ఖాలిద్, మహ్మద్‌ జావేద్‌ఖాన్, మిశ్రీగంజ్‌కు చెందిన మహ్మద్‌ ముఖరం అహ్మద్‌లతో చర్చించాడు. వారందరూ ఈ నేరంలో సహకరించడానికి అంగీకరించడంతో నిజాముద్దీన్‌ బందిపోటు దొంగతనానికి స్కెచ్‌ వేశాడు. అజర్‌ కదలికలపై సమాచారం అందించే బాధ్యతలను మైనర్‌ నిర్వహించాడు. మిగిలిన ఆరుగురూ మూడు బృందాలుగా విడిపోయారు. అజర్‌ దుకాణం నుంచి ఇంటికి వెళ్లేందుకు మొత్తం మూడు మార్గాలు ఉన్నాయి. రెక్కీ ద్వారా  ఈ విషయం గుర్తించిన నిజాముద్దీన్‌ ఒక్కో బృందాన్ని ఒక్కో మార్గంలో కాపుకాసేలా చేశాడు. ఇందుకుగాను తన రెండు బైక్‌లతో పాటు ఖాలిద్‌కు చెందిన మరో దానిని వినియోగించారు.

ఈ నెల 17 అర్థరాత్రి పథకం అమలు చేయాలని నిర్ణయించుకున్న నిజాముద్దీన్‌ తన అనుచరులను రంగంలోకి దింపాడు. ఒక్కో బృందం ఒక్కో మార్గంలో కాపుకాసింది. ఆసిఫ్, ఖాలిద్‌లతో కూడిన టీమ్‌ మాత్రం శాలిబండలోని జగన్నాథస్వామి దేవాలయం వద్ద వాహనంపై వేచి ఉంది. నగల బ్యాగ్‌తో అజర్‌ దుకాణంలో పని చేసే మరో బాలుడితో కలిసి అదే మార్గంలో వస్తున్నట్లు సమాచారం అందింది. ఆ ప్రాంతానికి వచ్చిన బాధితుడిని బైక్‌పై ఫాలో అయిన ఈ ఇద్దరు దుండగులు ఓ ప్రాంతంలో అడ్డగించారు. వాహనం నడుపుతున్న ఆసిఫ్‌ వెంటనే అజర్‌పై దాడి చేయగా, వెనుక కూర్చున్న ఖాలిద్‌ తన వద్ద ఉన్న కారం పొడి చల్లాడు. ఈ హడావుడిలో నగల బ్యాగ్‌ను చేజిక్కించుకున్న ఆ ఇద్దరూ అక్కడి నుంచి ఉడాయించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు శాలిబండ ఠాణాలో కేసు నమోదైంది. దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎస్‌.మధుమోహన్‌రెడ్డి నేతృత్వంలో ఎస్సైలు ఎన్‌.శ్రీశైలం, కేఎన్‌ ప్రసాద్‌ వర్మ, వి.నరేందర్, మహ్మద్‌ తర్ఖుద్దీన్‌లతో కూడిన బృందం రంగంలోకి దిగింది. నేరం జరిగిన ప్రాంతంతో పాటు ఆ చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ఫీడ్‌ను అధ్యయనం చేశారు. ఫలితంగా దుండగులు వాడిన వాహనాల వివరాలతో పాటు వారి ఆనవాళ్లు గుర్తించింది. వీరి కోసం వేటాడిన పోలీసులు సోమవారం మైనర్‌ సహా ఆరుగురినీ అదుపులోకి తీసుకున్నారు. అజర్‌ నుంచి లాక్కుపోయిన బ్యాగ్‌లో ఉన్న 11 కేజీల వెండిని విక్రయించేందుకు ఖాజిపురకు చెందిన మహ్మద్‌ సల్మాన్, సయ్యద్‌ జిలానీలకు ఇచ్చినట్లు వెల్లడించారు. దీంతో వీరినీ పట్టుకున్న టాస్క్‌ఫోర్స్‌ బందిపోట్లు ఎత్తుకుపోయిన సొత్తు, నేరం చేయడానికి వినియోగించిన వాహనాలు రికవరీ చేశారు.  

ఐదుగురికీ నేరచరిత్ర...
ఈ బందిపోటు గ్యాంగ్‌ లీడర్‌ నిజాముద్దీన్‌తో పాటు అతడికి సహకరించిన నలుగురు ప్రధాన అనుచరులకూ నేర చరిత్ర ఉంది. నిజాంను హుస్సేనిఆలం పోలీసులు కల్తీ నూనె విక్రయం కేసులో అరెస్టు చేసి జైలుకు పంపారు. ఆసిఫ్‌పై ఇదే ఠాణాలో దోపిడీ కేసు నమోదై ఉంది. షేక్‌ ఖాలిద్‌ను వాహనచోరీ కేసులో అఫ్జల్‌గంజ్‌ పోలీసులు కటకటాల్లోకి పంపారు. కాలాపత్తర్‌ ప్రాంతంలో నివసించే ఘరానా నకిలీ కరెన్సీ నోట్ల మార్పిడి నేరగాడు బాంబ్‌ గౌస్‌కు ప్రధాన అనుచరుడు, స్నేహితుడు. ఈ నేపథ్యంలో గతంలో నకిలీ కరెన్సీ కేసులో అతడితో కలిసి అరెస్టు అయ్యాడు. ఫలక్‌నుమ ఠాణాలో రౌడీషీటర్‌గా ఉన్న జావేద్‌ ఖాన్‌పై మొత్తం 11 కేసులు ఉన్నాయి. మరో నిందితుడైన అంజాద్‌ బహదూర్‌పుర పరిధిలో జరిగిన వసీం పహిల్వాన్‌ హత్య కేసు, కాలాపత్తర్‌లో నమోదైన బెదిరింపు కేసుల్లో జైలుకు వెళ్లి వచ్చాడు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top