గుత్తి కేంద్రంగా మట్కా | The bouquet center is Mutca | Sakshi
Sakshi News home page

గుత్తి కేంద్రంగా మట్కా

Nov 3 2017 1:29 AM | Updated on Nov 3 2017 1:29 AM

The bouquet center is Mutca - Sakshi

ఒకప్పుడు గుత్తి పేరు వింటే వెంటనే అందరికీ గుర్తుకు వచ్చేది మట్కా! కొన్ని సంవత్సరాల పాటు ఇక్కడ మట్కా పెద్ద ఎత్తున జరిగేది. లాడ్జీలు, చిన్నపాటి గదులు ఎటు చూసినా.. మట్కా బీటర్లు, జూదం ఆడేందుకు వచ్చిన వారితో కిటకిటలాడేవి. అయితే పోలీసుల చర్యలతో ఇది కాస్త కనుమరుగైంది. ఇటీవల కొంత కాలంగా గుత్తిలో మట్కా నిర్వాహకులు మళ్లీ చెలరేగారు. సిండికేట్‌గా ఏర్పడి పొరుగున ఉన్న కర్పూలు జిల్లాలోనూ తమ కార్యకలాపాలను విస్తరించారు. ఈ విష యం గురువారం పోలీసులు జరిపిన మెరుపుదాడిలో బహిర్గతం కావడంతో పలువురిలో ఆందోళన చోటు చేసుకుంది. మళ్లీ అసాంఘిక కార్యకలాపాలకు గుత్తి కేంద్రం కాబోతుందా అనే భయం వ్యక్తమవుతోంది.
– గుత్తి

గుట్టు చప్పుడు కాకుండా మట్కా నిర్వహిస్తున్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. పట్టుబడిన వారిని రమణారావు, వెంకటేష్, నరేష్‌గా గుర్తించారు. వీరి నుంచి రెండు సెల్‌ఫోన్లు, రూ. 90,150, మట్కా పట్టీలు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల వివరాలను విలేకరుల సమావేశంలో ఎస్‌ఐ వలీబాషుతో కలిసి సీఐ ప్రభాకర్‌ గౌడ వెల్లడించారు. కర్నూలు జిల్లా డోన్‌కు చెందిన కటిక రమణారావు, గుత్తి ఆర్‌ఎస్‌ నివాసి వెంకటేష్, గుంతకల్లుకు చెందిన నరేష్‌ గ్రూపుగా ఏర్పడి డోన్‌లో పెద్ద ఎత్తున మట్కా కంపెనీ నిర్వహిస్తున్నారు. పోలీసుల నిఘా నుంచి తప్పించుకునేందుకు తమ స్థావరాన్ని అప్పుడప్పుడూ మార్చేవారు.

గుత్తి ఆర్‌ఎస్‌లోని తన ఇంటినే మట్కా స్థావరంగా వెంకటేష్‌ మార్చుకుని పోలీసుల కళ్లుగప్పి పెద్ద ఎత్తున మట్కా నిర్వహిస్తూ వస్తున్నాడు. రోజూ రూ. లక్షల్లో టర్నోవర్‌తో కూలీలు, నిరుపేదలను మట్కాకు బానిసలుగా చేస్తూ వచ్చాడు. నిరంతరం బీటర్ల రాకపోకలు, కొత్త వ్యక్తుల సంచారం ఎక్కువ కావడంతో  చుట్టుపక్కల వారు ఇబ్బంది పడుతూ వచ్చారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సైతం నిఘా పెంచారు. ఈ క్రమంలో రమణారావు, నరేష్‌ గురువారం వెంకటేష్‌ ఇంటికి డబ్బు, పట్టీలతో వచ్చారు. అప్పటికే కాపుకాచిన పోలీసులు.. వెంకటేష్‌ ఇంటిపై మెరుపుదాడి చేశారు. నిందితులను అదుపులోకి తీసుకుని వారి నుంచి నగదు, సెల్‌ఫోన్‌లు, మట్కాపట్టీలు స్వాధీనం చేసుకున్నారు. మట్కా మూలాలను పసిగట్టి నిందితులను అరెస్ట్‌ చేయడంలో చాకచక్యంగా వ్యవహరించిన ఐడీ పార్టీ కానిస్టేబుళ్లు రవి, ఆదిశేఖర్, రామకృష్ణ, సురేష్, సివిల్‌ కానిస్టేబుళ్లు నరేష్, కుళ్లాయప్పను ఈ సందర్భంగా సీఐ ప్రభాకర్‌ గౌడ ప్రత్యేకంగా అభినందించారు. తన సర్కిల్‌ లిమిట్స్‌లో మట్కా మూలాలు లేకుండా చర్యలు తీసుకుంటానని ఈ సందర్భంగా సీఐ పేర్కొన్నారు. మట్కా, జూదాలు నిర్వహిస్తున్న వారిపై సమాచారం అందివ్వాలని పిలుపునిచ్చారు. సమాచారం ఇచ్చిన వారిని గోప్యంగా ఉంచి, నిందితులపై చర్యలు తీసుకుంటామన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement