ఈర్లదిన్నెలో విద్యార్థి కిడ్నాప్‌ కలకలం

Attempt to Kidnap on School Student in Kurnool - Sakshi

కర్నూలు ,గూడూరు రూరల్‌: సి.బెళగల్‌ మండలంలో విద్యార్థుల కిడ్నాప్‌లు కలకలం రేపుతున్నాయి. ఆదివారం ఒక విద్యార్థిని కిడ్నాప్‌ చేసి దుండగులు ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించగా బాలుడు తప్పించుకుని తల్లిదండ్రుల చెంతకు చేరాడు. ఈర్లదిన్నెకు చెందిన ఆనంద్‌ ముడుమాల హైస్కూల్‌లో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. ఆదివారం సాయంత్రం 4 గంటల సమయంలో ముడుమాలలోని స్నేహితుడి వద్ద పుస్తకం తెచ్చుకుంటానని చెప్పి ఇంటి నుంచి ఆనంద్‌ బయలుదేరాడు. మార్గమధ్యలో కాలకృత్యాలు తీర్చుకునేందుకు చెన్నయ్య బావి వద్దకు వెళ్లి రోడ్డుపైకి వచ్చిన ఆనంద్‌కు ముసుగు ధరించి బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు మత్తు మందు గుడ్డను ముఖానికి అదిమిపెట్టగా స్పృహ కోల్పొయాడు. ఆనంద్‌ను బైక్‌పై ఇద్దరి మధ్యన వేసుకుని ముడుమాల నుంచి పోలకల్‌ మీదుగా వెలుతుండగా మార్గమధ్యలో బైక్‌ అదుపు తప్పడంతో ముగ్గురు కిందపడ్డారు.స్పృహలోకి వచ్చిన ఆనంద్‌ దుండగుల నుంచి తప్పించుకుని పంట పొలాల మీదుగా పరుగులు తీస్తూ గ్రామానికి చేరుకున్నాడు. కిడ్నాప్‌ విషయాన్ని తండ్రి నాగరాజుకు తెలపడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

పుకార్లను నమ్మొద్దు  
పోలకల్, ముడుమాల గ్రామాలకు చెందిన విద్యార్థులు కిడ్నాప్‌నకు గురైనట్లు వస్తున్న పుకార్లను ప్రజలు నమ్మొద్దని కోడుమూరు సీఐ పార్థసారథిరెడ్డి సూచించారు. రెండు రోజుల నుంచి విద్యార్థులను కిడ్నాప్‌ చేసేందుకు గుర్తు తెలియని వ్యక్తులు ప్రయత్నిస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని, అయితే సీసీ కెమెరాల్లో గాని, విద్యార్థులు, తల్లిదండ్రులను విచారించగా ఎలాంటి ఆధారాలు దొరకలేదన్నారు. మండలంలో ఎలాంటి కిడ్నాప్‌లు జరగలేదని, ప్రజలు పుకార్లను నమ్మవద్దని, ఎవరైనా తప్పుడు పుకార్లను సృష్టిస్తే చర్యలు తీసుకుంటామని, గ్రామాల్లో నిత్యం పోలీసు సిబ్బంది పర్యటిస్తుందని సీఐ తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top