వివాహితపై కత్తితో దాడి

Attack with a knife on married women in the name of love - Sakshi

వేధింపులపై పోలీసులకు ఫిర్యాదు చేసిందనే కక్షతోనే..

ఎర్రగడ్డ ప్రాంతంలో ఉన్మాది ఘాతుకం 

గాంధీలో చికిత్స పొందుతున్న మహిళ

హైదరాబాద్‌: వివాహితను ప్రేమ పేరుతో వేధించిన ఓ ఉన్మాది నడిరోడ్డులో ఆమెపై కత్తితో దాడికి తెగబడ్డాడు. వేధింపులపై గతంలో పోలీసులకు ఫిర్యాదు చేసిందనే కక్షతో అతగాడు కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఎస్‌ఆర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో సోమవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. సనత్‌నగర్‌ స్వామి థియేటర్‌ సమీపంలోని సుభాష్‌నగర్‌కు చెందిన స్రవంతి అలియాస్‌ సంతు(24), హిమాయత్‌నగర్‌కు చెందిన ఆటోడ్రైవర్‌ యాదగిరి నాలుగేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు.

వివాహానికి ముందు నుంచి ఈమెకు తమ పక్కింట్లో ఉండే రవికుమార్‌తో పరిచయం ఉంది. వివాహానంతరం కూడా రవి పలుమార్లు హిమాయత్‌నగర్‌ వెళ్లి స్రవంతిని కలిసేవాడు. దీంతో ఆమె భర్త యాదగిరి.. రవి కుటుంబీకుల వద్ద అభ్యంతరం తెలిపాడు. అయినా రవి ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో రెండుసార్లు ఎస్‌ఆర్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేయని పోలీసులు రవిని ఠాణాకు పిలిపించి మందలించి పంపారు. 

మరింత రెచ్చిపోయి.. 
తనపై పోలీసులకు ఫిర్యాదు చేసిందనే కక్షతో రవి మరింత రెచ్చిపోయి స్రవంతిని వేధించడం మొదలెట్టాడు. సోమవారం మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో స్రవంతి ఎర్రగడ్డ రాగా ఆమెను వెంబడిస్తూ వచ్చాడు. ఇది గమనించిన స్రవంతి స్నేహితురాలు సునీతకు ఫోన్‌ చేసి రవి వెంబడిస్తున్నాడని, వచ్చి తనను తీసుకువెళ్లాలని కోరింది. దీంతో సునీత తన ద్విచక్ర వాహనంపై ఎర్రగడ్డకు వచ్చింది. ఇద్దరూ రైతుబజార్‌ ఎదురుగా ఉండగా.. అక్కడికి వచ్చిన రవి ఆమెను తన వాహనంపై కూర్చోవాలంటూ ఒత్తిడి చేశాడు. దీంతో ఇరువురి మధ్య ఘర్షణ జరిగింది. దీంతో రవి అక్కడే ఉన్న కొబ్బరి బొండాలు నరికే కత్తితో స్రవంతిపై దాడి చేశాడు. మెడ, తల, చేతిపై విచక్షణారహితంగా నరికాడు. స్థానికులు రవిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

తీవ్ర గాయాలపాలైన స్రవంతిని తొలుత సమీపంలోని సెయింట్‌ థెరిసా ఆస్పత్రికి, అక్కడ నుంచి గాంధీ ఆస్పత్రికి తరలించారు. స్రవంతికి ప్రాణాపాయం లేదని గాంధీ వైద్యులు తెలిపారు. ఆమె తలపై ఒకటి, మెడపై రెండు, ఎడమ చేతిపై నాలుగు కత్తి వేట్లు ఉన్నాయని, చేతిపై బలంగా తలగడంతో చేయి వేలాడుతోందని చెప్పారు. మొత్తం 30 కుట్లు వేసిన వైద్యులు తలపై గాయానికి సంబంధించి న్యూరో సర్జన్ల అ«భిప్రాయం తీసుకోవాలని నిర్ణయించారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top