సహాయ దర్శకుడి హత్య

Assistant film director murdered over watching TV - Sakshi

మరో సహాయ దర్శకుడు అరెస్ట్‌

తమిళసినిమా: టీవీ సౌండ్‌ను తగ్గించే విషయంలో జరిగిన వాగ్వాదం ఒక సినీ సహాయదర్శకుడి హత్యకు దారితీసింది. ఈ ఘటనకు సంబంధించి మరో సహాయ దర్శకుడు అరెస్ట్‌ అయ్యాడు. ఈ సంఘటన చెన్నైలో చోటుచేసుకుంది. దిండుగల్‌ జిల్లా, సిలుక్కువార్‌పట్టికి చెందిన అఖిల్‌ కన్నన్‌ చెన్నైలో సినిమా సహాయదర్శకుడిగా పని చేస్తున్నాడు. ఇతనికి భార్య శాంతి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. చెన్నై, వలసరవాక్కం, కైక్కాన్‌ కుప్పం ఉవాసీ వీధిలో ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. అతనితో పాటు కార్తికేయన్‌ అనే మరో సహాయదర్శకుడు(32) మరో ఆరుగురు అదే ఇంట్లో కలిసి ఉంటున్నారు. గురువారం రాత్రి అఖిల్‌ కన్నన్‌ నిద్ర పోతుండగా, కార్తికేయన్‌ టీవీ చూస్తున్నాడు. టీవీ సౌండ్‌ ఎక్కువగా ఉండడంతో నిద్రపట్టని అఖిల్‌ కన్నన్‌ సౌండ్‌ తగ్గించమని కార్తికేయన్‌కు చెప్పాడు. అయినా అతను తగ్గించకపోవడంతో ఇరువురి మధ్య వాగ్వాదం ముదిరి ఘర్షణపడ్డారు.

ఆ సమయంలో కార్తికేయన్‌ అఖిల్‌ కన్నన్‌ను కిందకి నెట్టడంతో అతని తలకు గాయమైంది. దీంతో అఖిల్‌ను కార్తికేయన్‌ ఇతర మిత్రులతో కలిసి సమీపంలోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు అఖిల్‌కు ప్రథమ చికిత్స నిర్వహించి తలకు స్కాన్‌ తీయాలని చెప్పారు. కార్తికేయన్, మిత్ర బృందం వద్ద అందుకు డబ్బులేకపోవడంలో అఖిల్‌కన్నన్‌ను ఇంటికి తీసుకొచ్చేశారు. శుక్రవారం ఉదయం లేసి చూస్తే అఖిల్‌కన్నన్‌ శవమై ఉన్నాడు. దీంతో భయపడిపోయిన కార్తికేయన్‌ వెంటనే స్థానిక కేకే.నగర్‌ పోలీస్‌స్టేషన్‌లో సరండర్‌ అయ్యాడు. కేకే.నగర్‌ పోలీసులు వలసరవాక్కం పోలీసులకు సమాచారం అందించడంతో వారు సంఘటన స్థలానికి వెళ్లి అఖిల్‌ కన్నన్‌ మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి పోస్ట్‌మార్టం నిమిత్తం పంపి కేసు విచారణ జరుపుతున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top