బెజవాడలో బెట్టింగ్‌ ముఠా అరెస్టు

Arrested betting gang in Bezawada - Sakshi

పోలీసుల అదుపులో నలుగురు

బెట్టింగ్‌ సామగ్రితోపాటు రూ.16.02 లక్షలు స్వాధీనం  

సాక్షి, అమరావతి బ్యూరో: పదుల సంఖ్యలో సబ్‌ బుకీలు, పంటర్లను పెట్టుకుని యథేచ్ఛగా బెట్టింగ్‌ కార్యకలాపాలు నిర్వహిస్తున్న ముఠా గుట్టును విజయవాడ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు రట్టు చేశారు. వారి వద్ద నుంచి బెట్టింగ్‌ నిర్వహణకు ఉపయోగించే సామగ్రితోపాటు రూ. 16.02 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. బుధవారం పోలీసు కమిషనరేట్‌లోని సమావేశ మందిరంలో నగర సీపీ ద్వారకా తిరుమలరావు విలేకరుల సమావేశంలో బెట్టింగ్‌ ముఠా వివరాలు వెల్లడించారు. విజయవాడ మాచవరం పరిధిలోని మారుతీనగర్‌ మసీదు వీధిలో నివాసం ఉండే పైలా ప్రసాద్‌ వడ్డీ వ్యాపారం చేస్తుంటాడు. సులువైన మార్గంలో డబ్బు సంపాదించాలన్న ఉద్దేశంతో 9 మంది పంటర్లతో క్రికెట్‌ బెట్టింగ్‌కు శ్రీకారం చుట్టాడు.

పశ్చిమగోదావరి జిల్లా కైకారం గ్రామానికి చెందిన ప్రధాన బుకీ కళ్యాణ్‌ చక్రవర్తితో కలిసి బెట్టింగ్‌ కార్యకలాపాలు నిర్వహించేవాడు. ఈ ముఠా సభ్యులు ఆంధ్రప్రదేశ్‌తోపాటు హైదరాబాద్‌లోని ఇతర బెట్టింగ్‌ ముఠాలతో సంబంధాలు పెట్టుకుని యథేచ్ఛగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ప్రసాద్‌ను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో కళ్యాణ చక్రవర్తి గురించి చెప్పడంతో అతన్ని కూడా అదుపులోకి తీసుకుని విచారించారు.

వీరితోపాటు విజయవాడలోని మొగల్రాజపురానికి చెందిన మోహన్‌కృష్ణ, కృష్ణలంకకు చెందిన ఉండి శరత్‌చంద్రను అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ. 16.02 లక్షల నగదుతోపాటు 19 సెల్‌ఫోన్లు, ఒక లైన్‌బాక్స్, రెండు ల్యాప్‌టాప్‌లు, ఒక టీవీని స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన వారు పరారీలో ఉన్నారు. టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు కేసును మాచవరం పోలీసులకు అప్పగించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top