వదంతులపై నజర్‌   

Alarmed by the Police Administration - Sakshi

అప్రమత్తమైన పోలీస్‌ యంత్రాంగం

ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్న పుకార్లు

పలు చోట్ల మతిస్థిమితం లేని  వ్యక్తులపై దాడులు

వదంతులు నమ్మొద్దంటున్న పోలీసులు

సంగారెడ్డి క్రైం : రాష్ట్రవ్యాప్తంగా సామాజిక మాధ్యమాల ద్వారా వ్యాపిస్తున్న వదంతులు పోలీసులను హడలెత్తిస్తున్నాయి. దొంగల సంచారం పెరిగిదని, పొరుగు రాష్ట్రాల హంతక ముఠాలు సంచరిస్తున్నాయని జరుగుతున్న ప్రచారం ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. వదంతుల్లో నిజమెంతో, అబద్ధమెంతో తెలియని అయోమయంలో ప్రజలు పడిపోతున్నారు. అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తులపై అక్కడక్కడా దాడులు జరుగుతున్నాయి. 

పుకార్లతో ఆందోళన..

ఇతర రాష్ట్రాల నుంచి పార్థి గ్యాంగ్, బిహార్, చైన్నై నుంచి పిల్లలను ఎత్తుకుపోయే ముఠాలుగా వచ్చాయని వినిపిస్తున్న పుకార్లతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఆ గ్యాంగ్‌ల వద్ద కత్తులు, బ్లేడ్లు ఉన్నాయని, వాటితో దొరికిన వారిపై దాడి చేసి గొంతు కోసి, తల పగులగొట్టి మెదడు తింటున్నారంటూ సామాజిక మాధ్యమాల్లో వస్తున్న సందేశాలను చూసి ప్రజలు జంకుతున్నారు.

ఈ క్రమంలో పట్టణాలు, గ్రామాల్లో రాత్రయిందంటే చాలు ఇంట్లో నుంచి బయటకు రావడానికి జంకుతున్నారు. పార్థి గ్యాంగ్‌ ఆడవారి వేషధారణలో ఇళ్లలో చొరబడి నగలు, డబ్బు దోచుకొని ఇంట్లో వారిని బెదిరించి, చివరికి చంపి వెళ్లిపోతున్నారని వాట్సాప్, ఫేస్‌బుక్‌లలో  వచ్చే వదంతులతో ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

ఎక్కడో జరిగిన ఫొటోలతో హల్‌చల్‌..

ఎన్నో ఏళ్ల కింద ఇతర రాష్ట్రాల్లో జరిగిన ఘటనల ఫొటోలను సేకరించిన కొంత మంది ఆకతాయిలు ప్రజలను భయాందోళకు గురి చేయాలని, వాట్సాప్, ఫేస్‌బుక్‌లో వాటిని పోస్టు చేసి తోచిన కథనాలు రాసి ప్రచారం చేశారు. అవి రాష్ట్రవ్యాప్తంగా సర్క్యులేట్‌ అయి మొత్తం పరిస్థితిని అతలాకుతలం చేస్తున్నాయి.

వీటిపై రాష్ట్ర, జిల్లా పోలీస్‌ యంత్రాంగం చాలా సీరియస్‌గా తీసుకున్నాయి. ప్రజలను భయపెట్టి ఆందోళనకు గురి చేసే సందేశాలకు సోషల్‌ మీడియంలో ప్రచారం కల్పిస్తే  కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. అక్కడక్కడ సోషల్‌ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నవారిని గుర్తిస్తూ కటకటాల పాలు చేసిన ఘటనలు కూడా ఉన్నాయి. 

మాల్‌చెర్వు తండా, శివ్వంపేట మండలంలో కలకలం..

అక్కన్నపేట మండలంలోని మాల్‌చెర్వు తండాలో ఇటీవల కలకలం రేగింది.  కత్తులు, బ్లేడ్లతో సంచరిస్తున్న ఓ వ్యక్తిని తండావాసులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. కొంత మంది గుర్తు తెలియని వ్యక్తులు పిల్లల చుట్టూ అనుమానాస్పదంగా తిరుగుతూ కనిపించగా ప్రజలు అరవడంతో కొంత మంది పారిపోయారని, అందులో ఒకరిని పట్టుకొని పోలీసులకు అప్పగించారని ప్రచారం జరిగింది.

ఇక శివ్వంపేట మండలంలో చిన్నగొట్టిముక్కుల గ్రామ సమీపంలో మతిస్థిమితం లేని వ్యక్తిని కిడ్నాపర్‌గా భావించి పట్టుకొని పోలీసులకు అప్పగించారు. అక్కన్నపేటలో పోలీసుల అదుపులో ఉన్న మతిస్థిమితం లేని వ్యక్తిని పోలీసులు అనాథాశ్రమంలో ఉంచారు.  

వదంతులపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్న పోలీసులు

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ ప్రాంతంలో సీపీ జోయల్‌ డేవిస్‌ ఆధ్వర్యంలో పుకార్లు నమ్మవద్దని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. మేమున్నామని భరోసా కల్పించారు.  ఈ వదంతులన్నీ ఆకతాయిల పని అని, ఎవరిపైనైనా అనుమానం వస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు. సంగారెడ్డి జిల్లాలో ఇటీవల జిల్లా వ్యాప్తంగా పోలీస్‌ యంత్రాంగం వందతులపై ప్రజలకు అవగాహన కల్పించారు.

 మెదక్‌ జిల్లాలో ఎస్పీ చందన దీప్తి ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్‌ స్టేషన్ల పరిధిలోని ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.  మూడు జిల్లాల పరిధిలో వదంతులపై ప్రజల్లో ధైర్యం నింపేందుకు పోలీస్‌ యంత్రాంగం కళాబృందాలతో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది.

 వదంతులు నమ్మొద్దు

ప్రజలను కొంత మంది ఆకతాయిలు భయాభ్రాంతులకు గురి చేస్తున్నారు. వాట్సాప్, ఫేస్‌ బుక్కుల్లో నిరాధార సందేశాలు పెట్టే వారి భరతం పడతాం. ఐటీ చట్టం ప్రకారం వదంతులు వ్యాప్తి చేసే వారిపై కేసులు నమోదు చేసి రిమాండ్‌కు పంపిస్తాం.  

వాట్సాప్‌లు, ఫేస్‌ బుక్కుల నుంచి ఎవరు ఎవరికి సందేశం పంపుతున్నారనే విషయాన్ని మేం సులువుగా గుర్తిస్తాం. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు. ఎవరైనా అనుమానితులు కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలి. లేకపోతే 100 నంబర్‌కు సమాచారం ఇవ్వాలి. జిల్లా వ్యాప్తంగా ఈ విషయంపై పోలీసులు  అప్రమత్తంగా ఉన్నారు. 

    – చందనాదీప్తి, మెదక్‌ జిల్లా ఎస్పీ.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top