దూకుడు పెంచిన ఏసీబీ

ACB Raids On Tahsildar Offices In AP - Sakshi

సాక్షి, విజయవాడ: సీఎం ఆదేశాలతో ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి ప్రక్షాళనకు ఏసీబీ నడుంబిగించింది. అవినీతిపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో లంచావతారాల భరతం పట్టేందుకు ఏసీబీ కొరడా ఝుళిపిస్తోంది. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా చిత్తూరు, పశ్చిమ, తూర్పుగోదావరి, అనంతపురం, ప్రకాశం, శ్రీకాకుళం, విజయనగరం, నెల్లూరు జిల్లాల్లో తహసీల్దార్‌ కార్యాలయాల్లో ఏసీబీ మెరుపు దాడులు నిర్వహించింది. బృందాలుగా విడిపోయి ఏకకాలంలో సోదాలు చేపట్టింది. 14400 స్పందన టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదులు రావడంతో ఏసీబీ అధికారులు స్పందించారు. తహసీల్దార్‌ కార్యాలయాల్లో బీరువాలు, సిబ్బంది బ్యాగులను ఏసీబీ అధికారులు తనిఖీ చేస్తున్నారు. రికార్డులు పరిశీలించి సిబ్బందిని ఆరా తీస్తున్నారు. కార్యాలయాలకు  పనులపై వచ్చిన ప్రజలను విచారించి వారి నుంచి వివరాలు సేకరిస్తున్నారు.

చిత్తూరు: జిల్లాలోని తహసీల్దార్‌ కార్యాలయాలపై ఏసీబీ దాడులు నిర్వహించింది. రేణిగుంట, వడమాలపేట, పుత్తూరు తహసీల్దార్‌ కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. వివిధ సమస్యల మీద వచ్చిన ఫిర్యాదులు ఎంత వరుకు పరిష్కారం అయ్యాయి. పెండింగ్‌ ఉన్న ఫిర్యాదులు, పరిష్కారం చేయకపోవడానికి కారణాలపై ఏసీబీ అధికారులు వివరాలు సేకరిస్తున్నారు.

పశ్చిమ గోదావరి: జిల్లాలోని చింతలపూడి తహసీల్దార్‌ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. కార్యాలయంలో పలు దస్ర్తాలను అధికారులు తనిఖీ చేస్తున్నారు.


కృష్ణా:  జిల్లాలోని అవనిగడ్డ తహసీల్దార్‌ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. రికార్డులను పరిశీలించడంతో పాటు, అధికారులు, సిబ్బంది బ్యాగులను కూడా తనిఖీ చేస్తున్నారు. కార్యాలయాలకు పనుల మీద వచ్చిన ప్రజల నుంచి వివరాలు సేకరిస్తున్నారు.

తూర్పుగోదావరి: జిల్లాలోని పెద్దాపురం తహసీల్దార్‌ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. తహసీల్దార్‌ కార్యాలయంలో అధికారులు,సిబ్బందిని విచారిస్తున్నారు. రికార్డులను పరిశీలించడంతో
పాటు, తహసీల్ధార్‌ కార్యాలయానికి వచ్చిన ప్రజల నుంచి కూడా వివరాలు సేకరిస్తున్నారు.

అనంతపురం జిల్లా: రాష్ట్రవ్యాప్తంగా దాడుల్లో భాగంగా ఏసీబీ అధికారులు జిల్లాలోని ముదిగుబ్బ తహసీల్దార్‌ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. కార్యాలయంలో రికార్డులను ఏసీబీ అధికారులు పరిశీలిస్తున్నారు. ఎచ్చెర్ల తహసీల్ధార్‌ కార్యాలయంలో ఏసీబీ సోదాలు నిర్వహిస్తున్నారు. కార్యాలయంలోని రికార్డులను పరిశీలిస్తున్నారు.

ప్రకాశం జిల్లా: పొన్నలూరు తహసీల్దార్‌ కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న దాడుల్లో భాగంగా కార్యాలయంలో ఏసీబీ అధికారులు అపర్ణ, వెంకటేశ్వర్లు, రాఘవరావు, ప్రసాద్ రికార్డులను పరిశీలించారు. పాసు పుస్తకాలు  జారీ అవకతవకలు జరిగాయన్న ఫిర్యాదుతో ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. 

శ్రీకాకుళం: జిల్లాలోని కొత్తూరు మండలం తహసీల్దార్‌ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. తహసీల్ధార్‌ కార్యాలయంపై వచ్చిన అవినీతి ఆరోపణలపై రికార్డులను పరిశీలించారు. 

విజయనగరం జిల్లా: జిల్లాలో వేపాడ తహసీల్ధార్‌ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. కార్యాలయంలోని అధికారులు,సిబ్బందిని ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. రికార్డులు పరిశీలించి ఆరా
తీస్తున్నారు.ప్రస్తుతం సోదాలు కొనసాగుతున్నాయి.

నెల్లూరుజిల్లా: సూళ్లూరుపేట తహసీల్ధార్‌ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించాయి. అవినీతిపై ఆరోపణలపై అధికారులను, సిబ్బందిని ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. రికార్డులు పరిశీలించడంతో పాటు కార్యాలయాలకు వచ్చిన ప్రజల నుంచి వివరాలు సేకరిస్తున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top