ఏసీబీ వలలో ఇరిగేషన్‌ ఇంజినీర్లు

ACB Officers Attack On Irrigation Officers Warangal - Sakshi

వరంగల్‌ క్రైం: రూ. 1.5లక్షలు లంచం తీసుకుంటూ ఇరిగేషన్‌ ఇంజినీర్‌ అధికారులు రెడ్‌ హ్యాండెడ్‌గా ఏసీబీ అధికారులకు పట్టుబడిన ఘటన నగరంలో మంగళవారం చోటుచేసుకుంది.  వివరాల్లోకి వెళ్తే...మిషన్‌ కాకతీయ పనుల్లో వర్ధన్నపేట మండలం కొనారెడ్డి చెరువు మరమ్మతు పనులను టెండర్‌ ద్వారా సాధించుకున్న కాంట్రాక్టర్‌ గంకిడి శ్రీనివాస్‌రెడ్డి నుంచి ఎస్టిమేట్‌ కోసం వరంగల్‌ ఇరిగేషన్‌ ఎస్‌ఈ కార్యాలయంలో పనిచేసే టెక్నికల్‌ డీఈ వాంసని రఘుపతి, ఏఈ గాడిపెల్లి గౌరిలక్ష్మీలు డబ్బులు డిమాండ్‌ చేశారు. ఈ క్రమంలో మంగళవారం కాంట్రాక్టర్‌ నుంచి డబ్బులు తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు. ఈ సందర్భంగా వరంగల్‌ రేంజ్‌ డీఎస్పీ కె.భద్రయ్య అధికారులు పట్టుబడిన వివరాలను వెల్లడించారు.

వర్ధన్నపేట మండలంలోని కోనారెడ్డి చెరువు పనులకు అవసరమైన డిటేల్‌ ఎస్టిమేట్‌ కోసం ఎస్‌ఈ కార్యాలయంలో పనిచేసే టెక్నికల్‌ డీఈ–1 వాంసని రఘుపతి డబ్బులు డిమాండ్‌ చేసినట్లు తెలిపారు. రూ.2.25 కోట్ల చెరువు పనిని టెండర్‌ ప్రక్రియ ద్వారా దక్కించుకుంటే  ఆ డబ్బులలో నుంచి  1 శాతం(రూ.2.25లక్షలు) డబ్బులు ఇస్తానే...ఎస్టిమేట్‌ ఇస్తామని డిమాండ్‌ చేసినట్లు తెలిపారు. కాంట్రాక్టర్‌ గంకిడి శ్రీనివాస్‌రెడ్డి పలు మార్లు కార్యాలయం చుట్టూ తిరిగినా ఎస్టిమేట్‌ ఇవ్వలేదని దీంతో ఆయన ఏసీబీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.  టెక్నికల్‌ డీఈ రఘుపతితో కాం ట్రాక్టర్‌ మాట్లాడి రూ.1.5 లక్షలకు బేరం కుదుర్చుకున్నారు. దీంతో సదరు కాంట్రాక్టర్‌ మంగళవారం మధ్యాహ్నం  ఫోన్‌లో డీఈ రఘుపతితో మాట్లాడగా ఏఈ గాడపెల్లి గౌరిలక్ష్మీకి డబ్బులు ఇవ్వాలని చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు. కాం ట్రాక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి కార్యాలయంకు వెళ్లి నేరుగా  ఏఈ గౌరిలక్ష్మీ డబ్బులు తీసుకుంటుండగా రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు డీఎస్పీ భద్రయ్య తెలిపారు.
 
కోర్టులో హాజరుపరుస్తాం...
ఏసీబీకి చిక్కిన డీఈ రఘుపతి, ఏఈ గౌరిలక్ష్మీలను అరెస్టు చేసి వారి నుంచి రూ.1.5 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వీరిని  హైదరబాద్‌లోని ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని డీఎస్పీ భద్రయ్య తెలిపారు. దీంతో పాటు డీఈ రఘపతికి సంబంధించిన దేశాయిపేట, గిర్మాజీపేటలో ఉన్న ఇండ్లలో కూడా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆదా యంకు మంచి ఆస్తులు ఉన్నట్లు వెలువడితే మరో కేసు కూడా నమోదు అవుతుందని తెలిపారు. ఈ దాడులలో ఇన్‌స్పెక్టర్లు వాసల సతీష్, వెంకట్, సిబ్బంది పాల్గొన్నారు.

ఇంజినీరింగ్‌ శాఖలపై నిఘా
వరంగల్‌ ఏసీబీ అధికారులకు వచ్చిన ఫిర్యాదుతో స్పందించిన అధికారులు రంగంలోకి దిగి  ఇంజినీరింగ్‌ శాఖలపై పెద్ద ఎత్తున నిఘా ఉంచారు. అవినీతికి ఆస్కారం ఉన్న ఇంజనీరింగ్‌ శాఖలో ఇటీవల  ఇద్దరు అధికారులు ఏసీబీకి చిక్కిన విషయం తెలిసిందే. ఆర్‌ అండ్‌ బీ ఏఈ కోటేశ్వర్‌రావును పట్టుకున్న మూడు నెలల్లోనే మరో ఇద్దరు ఇంజినీరింగ్‌ అధికారులు పట్టుబడటం ఇంజినీరింగ్‌ శాఖల్లో కలకలం రేపుతోంది. కాంట్రాక్టు పనులకు బిల్లులు చేయటానికి అధికారులు పెద్ద మొత్తంలో పర్సంటేజీలు డిమాండ్‌ చేయడం, సకాలంలో బిల్లులు రాకపోవడం, కాళ్లకు ఉన్న చెప్పులు అరిగేలా తిరుగుతున్న  అధికారులు కనికరం చూపకపోవడంతో కాంట్రాక్టర్లు ఏసీబీ అధికారులను అశ్రయిస్తున్నారు. మిషన్‌ కాకతీయ పనులతో పాటు మిషన్‌ భగీరథ« పనులు చేస్తున్న ఇంజినీరింగ్‌ అధికారులపై ఏసీబీ దృష్టి సారించినట్లు సమాచారం. దీంతో పాటు పంచాయతీరాజ్‌ కార్యాలయంలో కొంత మంది అధికారులు బహిరంగంగా డబ్బులు డిమాండ్‌ చేసిన విషయం ఏసీబీ అధికారుల దృష్టికి వెళ్లినట్లు తెలిసింది. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top