పెన్సిల్‌ లెడ్‌ కంట్లో ఉండిపోయింది..!

9 Year Old Child Poked With Pencil In The Eye Loses Vision - Sakshi

ముంబై : బడి పిల్లల మధ్య మొదలైన గలాట ఓ విద్యార్థి కంటి చూపు పోయేందుకు కారణమైంది. ఓ విద్యార్థి కంట్లో పెన్సిల్‌తో గుచ్చడంతో అతని కుడి కన్ను పూర్తిగా గుడ్డిదైపోయింది. ఈ ఘటన ఘట్కోపర్‌లో గతేడాది జూలై 21న జరిగింది. అయితే, చికిత్స చేస్తే తమ కుమారుడి (9) కన్ను బాగవుతుందని ఆశించిన ఆ కుటుంబానికి నిరాశే ఎదురైంది. ఇప్పటివరకు రెండు లక్షల రూపాయలు ఖర్చయ్యాయని, అయినా ఫలితం లేకుండా పోయిందని విద్యార్థి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

ఘటనకు కారణమైన విద్యార్థి కుటుంబం నుంచి నష్టపరిహారం ఇప్పించడని పోలీసులను ఆశ్రయించారు. పెన్సిల్‌తో పెద్ద ప్రమాదమేమీ లేదని చెప్పి స్కూల్‌ యాజమాన్యం నమ్మబలికిందని... ఇప్పుడు తమకేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. నష్టపరిహారం ఇప్పించకపోగా.. రూ.3 వేలు ఫీజు కట్టలేదని తమ పిల్లాడి మార్కుల మెమోను నిలుపుదల చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే మూడు సర్జరీలు చేయించామని తమ ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారిందని వాపోయారు. పెన్సిల్‌ లెడ్‌ చిన్నారి కంటిలోనే ఉండిపోవడంతో చూపు తిరిగిరావడం అసాధ్యమని వైద్యులు అంటున్నారని తెలిపారు.

కాగా, ఈ ఆరోపణల్ని స్కూల్‌ యాజమాన్యం తోసిపుచ్చింది. పిల్లాడి కంట్లో దాడి చేసిందెవరో ఖచ్చితంగా తెలియదన్నారు. ఘటన జరిగినప్పుడు అక్కడ టీచర్లెవరూ లేదని ప్రిన్సిపల్‌ చెప్తున్నారు. ఇక బాధితుని తల్లిదండ్రులు డిమాండ్‌ చేస్తున్నట్టుగా తాము ఎవరినుంచీ నష్టపరిహారం ఇప్పించలేమని స్పష్టం చేశారు. కావాలంటే.. స్థానికంగా ఉండే నాయకుల సహకారంతో పిల్లాడి కంటి చికిత్సకు అవసరమైన సాయం అందించేలా కృషి చేస్తామని అన్నారు. గతేడాది కాలంగా బాధిత విద్యార్థి ఫీజు తనే చెల్లిస్తున్నానని వెల్లడించారు. బాధితుని తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదు అందిందని, దర్యాప్తు చేసి నిజానిజాలు కనగొంటామని పంత్‌నగర్‌ సీనియర్‌ ఇన్స్‌పెక్టర్‌ రోహిణీ కాలే తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top