కిలాడీ బామ్మ | Sakshi
Sakshi News home page

కిలాడీ బామ్మ

Published Mon, Apr 29 2019 12:43 PM

71 Years old Elderly Woman Arrested in Robbery Case - Sakshi

గుంటూరు, తెనాలిరూరల్‌: ఆ బామ్మ వయసు 71 ఏళ్లు. ఆలయంలో ఉంటే అందరూ హరే రామ హరే కృష్ణ అంటూ భజనలు చేస్తుందనుకుంటారు. జాగ్రత్త దొంగలుంటారు అని హెచ్చరిస్తుంటే ఎంతటి పెద్దరికమని ముచ్చట పడతారు. అలా అని ఆ బామ్మను దగ్గరకు రానిచ్చారో.. ఒంటి మీద నగలుపోయి ఘొల్లుమంటారు. వామ్మో బామ్మ.. అంటూ గగ్గోలు పెడతారు.. ఇలా ప్రజలను బురిడీ కొట్టించి నగలు కొట్టేస్తున్న కిలాడీ బామ్మను పోలీసులు అరెస్ట్‌ చేశారు. వృద్ధ మహిళలే లక్ష్యంగా నేరాలకు పాల్పడుతున్న ఆమె నుంచి రూ. 2.10 లక్షల విలువైన ఆభరణాలను స్వాధీన పరుచుకున్నారు. తెనాలి టూ టౌన్‌ సర్కిల్‌ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో సీఐ ఆర్‌ఎస్‌  కిషోర్‌కుమార్‌ ఈ కిలాడి బామ్మగురించి వివరించారు.  సత్తెనపల్లి పట్టణంలోని రంగా కాలనీకి చెందిన జవంగుల సరోజిని(71) తెనాలిలో నివసిస్తున్న తన కొడుకు వద్దకు వచ్చి పోతుండేది.

మార్చిలో వచ్చిన ఆమెకు అదే నెల 13వ తేదీన పట్టణ నందులపేటలోని వినాయకుడి గుడి ధ్వజ స్తంభ ప్రతిష్ట జరుగుతుందని తెలిసింది. 13వ తేదీ ఉదయం గుడికి వెళ్లి ప్రతిష్టా మహోత్సవంలో పాల్గొంది. కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చారు. వీరిలో వృద్ధ మహిళలను లక్ష్యంగా చేసుకుంది. రద్దీగా ఉండడంతో ‘చోరులతో జాగ్రత్తగా ఉండాల’ంటూ మహిళలతో మాటలు కలిపింది. చీర కొంగులు కప్పుకోవాలంటూ తానే స్వయంగా కప్పింది. ఈ క్రమంలో పట్టణ మోదుకూరి వారి వీధికి చెందిన కొత్తపల్లి అన్నపూర్ణ(65), నందులపేటకే చెందిన పొందూరి సుగుణకుమారి(63)ల మెడలలోని బంగారు నానుతాడులను అపహరించింది. దీనిపై బాధితులు పోలీసులను ఆశ్రయించగా టూ టౌన్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

కెమెరాల్లో కనపడకుండా నేరాలు..
సరోజిని నేరాలకు పాల్పడిన తీరు గురించి తెలుసుక్ను పోలీసులు నివ్వెరపోయారు. ఆలయంలో సీసీ కెమెరాలు ఉన్నా, వాటిలో పడకుండా జాగ్రత్తలు తీసుకుని మరీ గొలుసులు అపహరించింది. బాధితులు ఫిర్యాదుతో ఆలయంలోని సీసీ కెమెరాల ఫుటేజ్‌లను పరిశీలించిన పోలీసులకు ఎవరూ ఫుటేజ్‌లలో కనబడలేదు. సీసీ కెమెరాలను గుర్తించి, వాటిలో పడకుండా జాగత్తపడింది. ఎటువంటి ఆధారం లేకుండా పోయిందనుకుని పోలీసుల దర్యాప్తు వేగం తగ్గించారు. అంతలోనే, ధ్వజ స్తంభ మహోత్సవాన్ని స్థానికులు సెల్‌ఫోన్లు, కెమెరాలతో వీడియో తీశారని తెలుసుకున్నారు. వాటిని తెప్పించి పరిశీలించి నిందితురాలిగా అనుమానం ఉన్న వృద్ధురాలి ఫోటో తీయించగలిగారు. ఈమెపైనే బాధితులూ అనుమానం వ్యక్తం చేశారు. ఇక నిందితురాలు ఈమేనని నిర్ధారించుకున్న పోలీసులు నిఘా ఏర్పాటు చేశారు. తెనాలి రజకచెరువు వద్ద శనివారం ఆమెను గుర్తించి అదుపులోకి తీసుకుని విచారించగా, నేరం ఒప్పుకుందని, ఆమె వద్ద నుంచి మొత్తం 72 గ్రాముల రెండు బంగారు నానుతాడులను స్వాధీనం చేసుకున్నామని సీఐ తెలిపారు. నిందితురాలు గతంలో విజయవాడలోని ఆలయాల్లో చోరీలకు పాల్పడినట్టు తెలిసింది. సమావేశంలో ఎస్‌ఐ గన్నవరపు అంజయ్య, సిబ్బంది ఉన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement