మృత్యువులోనూ వీడని స్నేహం

3 Friends Killed By A Bolt Of Lightning In Mudigonda - Sakshi

పిడుగుపాటుతో ముగ్గురు యువకుల మృతి

ముదిగొండలో విజయదశమి రోజు విషాదం

మృతదేహాలను సందర్శించిన భట్టి, కమల్‌రాజు 

ముగ్గురు స్నేహితులు కలిసిమెలిసి తిరుగుతుంటారు. నూతన వస్త్రాలు ధరించి పండగ రోజు కూడా కలుసుకున్నారు. మరికొందరితో కలిసి కాలనీ సమీపంలో క్రికెట్‌ ఆడారు. అనంతరం కొందరు ఇంటికి వెళ్లారు. నలుగురు మాత్రం సమీపంలోని ఓ వేప చెట్టు కింద ముచ్చటించుకున్నారు. అప్పటికే ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం వస్తోంది. అందులో ఒకరు కొద్ది దూరంలో మూత్ర విసర్జనకు వెళ్లాడు. ఒక్కసారిగా భారీ శబ్దంతో పిడుగుపడింది. దీంతో ముగ్గురు యువకులు అక్కడికక్కడే విగతజీవులుగా మారారు. మూత్ర విసర్జనకు వెళ్లిన యువకుడు స్పృహ తప్పి పడిపోయాడు. ఈ విషాదకర∙సంఘటన ముదిగొండలో మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది.  

సాక్షి, ముదిగొండ: ముదిగొండ ఎస్సీ కాలనీకి చెందిన బలంతు ప్రవీణ్‌(20), ఇరుకు శ్రీను(20), గుద్దేటి నవీన్‌(19) ముగ్గురు ప్రాణ స్నేహితులు. సూర్యాపేటలో బీఎస్సీ ఎంఎల్‌టీ చదువుతున్న బలంతు ప్రవీణ్‌ పండగకు మూడు రోజుల ముందే ఇంటికి వచ్చాడు. ఇరుకు శ్రీను ఖమ్మంలో డిగ్రీ చదువుతున్నాడు. గుద్దేటి నవీన్‌ ముదిగొండలోనే ఇంటర్‌ సెంకడియర్‌ చదువుతున్నాడు. వీరు వేర్వేరుగా చదువుకుంటున్నా, పండగ, శుభకార్యాలలో, సెలవు దినాలలో కలుసుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో విజయదశమి పండగ రోజు కూడా ముగ్గురు కలుసుకున్నారు. వీరితోపాటు మరో యువకుడు ఉసికల గోపి, మరికొందరు స్నేహితులు కలిసి సరదాగా తమ కాలనీ సమీపంలో క్రికెట్‌ ఆడారు. అనంతరం పక్కనే ఉన్న ఓ వేప చెట్టు కింద ముచ్చటించుకుంటున్నారు. అదే సమయంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం వస్తోంది.  పెద్ద శబ్దంతో పిడుగుపడింది. దీంతో ముగ్గురు యువకులు ప్రవీణ్, శ్రీను, నవీన్‌ అక్కడికక్కడే మృతి చెందారు. మూత్ర విసర్జనకు కొద్ది దూరం వెళ్లిన మరో యువకుడు ఉసికల గోపి స్పృహ తప్పి పడిపోయాడు. సమీపంలో ఉన్న స్నేహితులు గమనించి గ్రామస్తులకు, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. గ్రామస్తులు అక్కడికి చేరుకునే సరికే ముగ్గురు యువకులు విగతజీవులుగా పడి ఉన్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న గోపిని చికిత్స కోసం ఖమ్మం ఆస్పత్రికి తరలించారు.  

మిన్నంటిన రోదనలు  

బలంతు ప్రవీణ్‌ మృతదేహం; గుద్దేటి నవీన్‌ మృతదేహం; ఇరుకు శ్రీను మృతదేహం 

గ్రామంలో ఒకేసారి ముగ్గురు యువకులు, అందులోనూ ప్రాణస్నేహితులు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. యువకుల తల్లిదండ్రులు రోదిస్తున్న తీరును చూపరులను కంటతడి పెట్టించింది. దసరా పండగ పూట గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుల కుటుంబాలు రెక్కాడితే కాని డొక్కాడనవి. మూడూ దళిత కుటుంబాలే. చదువుకుని ప్రయోజకులవుతారని తల్లిదండ్రులు కూలి పనులు చేసుకుంటూ తమ పిల్లలను చదివిస్తున్నారు.  

  • బలంతు ప్రవీణ్‌ తల్లిదండ్రులు బాబు, వెంకటమ్మ నిరుపేదలు. కూలి పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. తమ్ముడు చందు పదో తరగతి చదువుతున్నాడు. డిగ్రీ చదువుతున్న కుమారుడు మృత్యువాత పడడంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగింది.  
  • ఇరుకు శ్రీను తల్లిదండ్రులు ఏసు, అలివేలు. సోదరికి వివాహమయింది. వీరిదీ పేద కుటుంబమే. డిగ్రీ చదువుతున్న కుమారుడు తమకు ఆసరా అవతాడనుకుంటున్న సమయంలో మృతి చెందడంతో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. చేతికొచ్చిన కుమారుడు చనిపోవడంతో ఆ ఇంట్లో రోదనలు మిన్నంటాయి.  
  •  గుద్దేటి నవీన్‌ తల్లిదండ్రులు గాలయ్య, విజయమ్మలు కూడా పేదలే. తమ్ముడు కార్తీక్‌ పదో తరగతి చదువుతున్నాడు. ఇంటర్‌ చదువుతున్న కుమారుడు పండగపూట మృతవాత పడడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు.  

పలువురి పరామర్శ 
మృతదేహాలను సీఎల్‌పీ నేత, మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క, ఖమ్మం జెడ్పీ చైర్మన్‌ లింగాల కమల్‌రాజు, ముదిగొండ సర్పంచ్‌ మందరపు లక్ష్మి, వైస్‌ ఎంపీపీ మంకెన దామోదర్, టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ మండల అధ్యక్షులు మీగడ శ్రీనివాస్‌యాదవ్, కొమ్మినేని రమేష్‌ బాబు, మాజీ జెడ్పీటీసీ మందరపు నాగేశ్వరరా వులు సందర్శించి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు.  

మృతుల కుటుంబాలకు ఆర్థికసాయం 
మృతుల కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థికసాయం అందించింది. ఖమ్మం జిల్లా కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌ ఆదేశాల మేరకు ఇన్‌చార్జి తహసీల్దా ర్‌ కరుణాకర్‌రెడ్డి బుధవారం మృతుల కుటుం బాలకు ఒక్కొక్కరికి రూ. 50 వేల చొప్పున నగదు అందించారు. 

సంఘటనా స్థలాన్ని సందర్శించిన ఏసీపీ 
సంఘటనా స్థలాన్ని బుధవారం ఖమ్మం రూరల్‌ ఏసీపీ రామోజు రమేష్‌ సందర్శించారు. వివరాలను ఎస్‌ఐ మహేష్‌ను అడిగి తెలుసుకున్నారు. ఈయన వెంట ఎస్‌ఐ మహేష్, సిబ్బంది ఉన్నారు.  

అశ్రునయనాలతో అంతిమ వీడ్కోలు  
ఒకేసారి ముగ్గురు యువకులు మృత్యువాత పడడంతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. బంధువులు, కుటుంబ సభ్యులు కన్నీరు, మున్నీరుగా విలపిస్తున్నారు. అప్పటివరకు తమతో క్రికెట్‌ ఆడిన మిత్రులు ఇక లేరనే విషయాన్ని మిగతా స్నేహితులు జీర్ణించుకోలేకపోతున్నారు. అందరితో కలివిడిగా ఉంటారని, ముగ్గురు ఎప్పుడూ కలిసిమెలిసి ఉంటారని గ్రామస్తులు పేర్కొంటున్నారు. తల్లిదండ్రులు, బంధువులతోపాటు గ్రామస్తులందరూ కదిలివచ్చి యువకులకు కన్నీటి వీడ్కోలు పలికారు. విషణ్ణ వదనాలతో అంత్యక్రియలు పూర్తిచేశారు.   

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top