విషపూరిత మద్యం తాగి 17 మంది మృతి | 17 Died For Drinking Spurious Liquor In Assam | Sakshi
Sakshi News home page

విషపూరిత మద్యం తాగి 17 మంది మృతి

Feb 22 2019 3:56 PM | Updated on Feb 22 2019 3:58 PM

17 Died For Drinking Spurious Liquor In Assam - Sakshi

డిస్‌పూర్‌: అస్సాంలో దారుణం చోటుచేసుకుంది. విషపూరిత మద్యం సేవించి 17 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన అసోంలోని గోలాఘాట్‌లో శుక్రవారం చోటుచేసుకుంది. గోలాఘాట్‌లోని సల్మారా టీ ఎస్టేట్‌లో పనిచేస్తున్న కూలీలు గురువారం రాత్రి వేడుక చేసుకున్నారు. దానిలో భాగంగా సంజు ఒరాంగ్‌ అనే కూలి మద్యం తీసుకొచ్చారు. ఆ మద్యం సేవించిన కాసేపటికే ఇద్దరు మహిళలు కుప్పకూలారు. దీంతో వెంటనే వారిని స్థానిక ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. విషపూరిత మద్యం తీసుకోవడం వల్లే వీరు మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. 

శుక్రవారం ఉదయం మరో 13 మంది కూడా అలాగే అపస్మారక స్థితిలో పడిపోవడంతో స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించారు. కొద్దిసేపటికే వారు కూడా ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది పరిస్థితి విషయంగా ఉందని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని వైద్యులు తెలిపారు. దాదాపు 30 మందికి పైగా వేడుకలో పాల్గొని విషపూరిత మద్యం సేవించినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

తేయాకు తోటల్లో పనిచేసే కూలీలు వేడుకలో భాగంగా ఈ కలుషిత మద్యం సేవించడం వల్లనే ఘటన జరిగినట్లు స్థానిక పోలీస్‌ అధికారి పుష్‌రాజ్‌ సింగ్‌ తెలిపారు. కెమికల్స్‌ కలిగిన క్యాన్‌లో మద్యం తీసుకెళ్లడంతోనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా కల్తీ మద్యం కారణంగా ఇటీవల ఉత్తరప్రదేశ్‌లో 97 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. 
 

Advertisement
 
Advertisement
Advertisement