ఏపీలో సెరామిక్స్‌ క్లస్టర్‌!

Ceramics cluster in AP

నవంబరులో తుది నిర్ణయం

మోర్బి సెరామిక్స్‌ అసోసియేషన్‌

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో సెరామిక్స్‌ క్లస్టర్‌ను ఏర్పాటు చేసేందుకు మోర్బి సెరామిక్స్‌ అసోసియేషన్‌ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఏపీ ప్రభుత్వంతో మూడుసార్లు చర్చలు జరిగాయని అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ నీలేష్‌ జట్‌పరియా శుక్రవారమిక్కడ మీడియాకు తెలిపారు. ప్రభుత్వ అధికారుల బృందం సైతం గుజరాత్‌లోని మోర్బి క్లస్టర్‌ను పరిశీలించిందని చెప్పారు. ‘ఆంధ్రప్రదేశ్‌లో క్లస్టర్‌ ఏర్పాటు కావాలంటే కనీసం 30 కంపెనీలైనా ముందుకు రావాలి.

రాజస్తాన్‌లో ఇటువంటి కేంద్రాన్ని నెలకొల్పాలని గతంలో భావించాం. ఎక్కువ కంపెనీలు ఆసక్తి చూపకపోవడంతో మా ప్రయత్నం విఫలమైంది. సెరామిక్‌ తయారీ కంపెనీలన్నీ దాదాపుగా మోర్బిలో కేంద్రీకృతమయ్యాయి. ఈ కంపెనీలు దక్షిణాదిలో విస్తరణకు అవకాశం ఉంది. నవంబరులో జరిగే వైబ్రాంట్‌ సెరామిక్స్‌ ఎక్స్‌పో వేదికగా ఏపీ క్లస్టర్‌పై తుది నిర్ణయం వెలువడుతుంది’ అని వెల్లడించారు.

ప్రపంచంలో భారీగా..
గుజరాత్‌లోని గాంధీనగర్‌లో నవంబరు 16 నుంచి 19 వరకు వైబ్రాంట్‌ సెరామిక్స్‌–2017 ఎక్స్‌పో, సమ్మిట్‌ను జరుగనుంది. చైనా కంటే చౌక, ఇటలీ కంటే మెరుగ్గా అన్న నినాదంతో ప్రపంచంలో తొలిసారిగా 50,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో 400 బ్రాండ్ల ఉత్పత్తులు, సేవలను ప్రదర్శించనున్నాయి. ఎక్స్‌పో ద్వారా ఈ ఏడాది రూ.5,000 కోట్ల వ్యాపారం అంచనా వేస్తున్నట్టు వైబ్రాంట్‌ సెరామిక్స్‌ ఎక్స్‌పో సీఈవో సందీప్‌ పటేల్‌ వెల్లడించారు. గతేడాది ఎక్స్‌పోలో రూ.1,300 కోట్ల వ్యాపారం నమోదైందని చెప్పారు.

Read latest Corporate News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top