ఆసియాలోనే ‘ఖరీదైన విడాకులు’.. విలువ ఎంతంటే!

World Latest Billionaire From China Emerges From Costly Divorce in Asia - Sakshi

భర్త నుంచి విడాకులు పొంది.. తద్వారా లభించిన భరణంతో ఆసియాలోని సంపన్న మహిళల్లో ముందు వరుసలో నిలిచారు చైనాకు చెందిన యువాన్‌ లిపింగ్‌. ఇక విడిపోతున్న నేపథ్యంలో షెంజన్‌ కాంగ్‌టాయ్ బయోలాజికల్‌ ప్రొడక్ట్స్ కో. చైర్మన్‌ డూ వీమిన్. ఆయన భార్య యువాన్‌కు 163.3 మిలియన్‌ షేర్లు బదలాయించడంతో వీరి విడాకుల వ్యవహారం ఆసియాలోనే అత్యంత ఖరీదైన బ్రేకప్‌గా నిలిచింది. సోమవారం మార్కెట్లు ముగిసేనాటికి యువాన్‌ ఆస్తి 3.2 బిలియన్‌ డాలర్లకు చేరిందని బ్లూమ్‌బర్గ్‌ వెల్లడించింది. కాగా కెనడా పౌరురాలైన యువాన్‌ బీజింగ్‌ యూనివర్సిటీ ఆఫ్‌ ఇంటర్నేషనల్‌ బిజినెస్‌ అండ్‌ ఎకనమిక్స్‌లో ఆర్థికశాస్త్రం నుంచి బ్యాచిలర్‌ పట్టా పొందారు. 

భరణం కింద మిలియన్ల షేర్లు
ఈ క్రమంలో డూ వీమిన్‌ను పెళ్లాడిన ఆమె.. మే 2011 నుంచి ఆగస్టు 2018 వరకు భర్తకు చెందిన షెంజన్‌ కాంగ్‌టాయ్ బయోలాజికల్‌ ప్రొడక్ట్స్ కో. కంపెనీలో డైరెక్టర్‌గా వ్యవహరించారు. ఇటీవలే భర్త నుంచి విడాకులు తీసుకున్న 49 ఏళ్ల యువాన్‌కు భరణం కింద కంపెనీకి చెందిన 163.3 మిలియన్‌ షేర్లు లభించాయి. ఇందుకు సంబంధించిన ఒప్పందం కూడా పూర్తి కావడంతో ఆమె సంపన్న మహిళల జాబితాలో చేరిపోయారు. అయితే షేర్లు తన పేరిట ఉన్నా కంపెనీకి సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకునేందుకు నిర్వహించే ఓటింగ్‌లో పాల్గొనే హక్కును మాత్రం భర్తకే వదిలేశారు. ప్రస్తుతం యువాన్‌.. కాంగ్‌టాయ్ అనుబంధ సంస్థ బీజింగ్‌ మినాహి బయోటెక్నాలజీ కో. సంస్థలో వైస్‌ జనరల్‌ మేనేజర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.

వ‍్యవసాయ కుటుంబంలో జన్మించి..
డూ వీమిన్ ‌(56) విషయానికొస్తే.. చైనాలోని జియాంగ్సీ ప్రావిన్స్‌లోని వ్యవసాయ కుటుంబంలో జన్మించిన ఆయన రసాయన శాస్త్రంలో డిగ్రీ పొందారు. 1987లో క్లినిక్‌లో పనిచేయడం ప్రారంభించి, 1995 నాటికి ఓ ప్రముఖ బయోటెక్‌ కంపెనీలో సేల్స్‌ మేనేజర్‌గా ఎదిగారు. అనంతరం వ్యాక్సిన్ల తయారీ సంస్థ కంగ్‌టాయ్ ప్రారంభించారు. ఈ కంపెనీని అభివృద్ధి చేసుకుంటూ, 2009లో మినాహి అనే మరో సంస్థను సొంతం చేసుకుని ఉభయ సంస్థలకు చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు.

3.1 బిలియన్‌ డాలర్లకు పడిపోయిన సంపద
ఇక కోవిడ్‌-19 వ్యాప్తి నేపథ్యంలో మహమ్మారిని తరిమికొట్టే వ్యాక్సిన్‌ అభివృద్ధి చేస్తున్నట్లు కాంగ్‌టాయ్ ప్రకటించడంతో ఆ కంపెనీ షేర్లు ఒక్కసారిగా పెరిగాయి. అయితే కంగ్‌టాయ్ చైర్మన్‌ డూ, యువాన్‌ విడాకుల వ్యవహారంతో ఒక్కరోజులోనే 3.1 శాతం మేర షేర్లు పడిపోగా, కంపెనీ మార్కెట్‌ విలువ ప్రస్తుతం 12.9 బిలియన్‌ డాలర్లుగా ఉంది. ఇక 6.5 బిలియన్‌ డాలర్ల సంపదలో 3.2 బిలియన్ డాలర్లు (షేర్ల రూపంలో) భరణంగా భార్యకు బదలాయించడంతో డూ ఆస్తుల విలువ 3.1 డాలర్లకు పడిపోయింది. కాగా అమెజాన్‌ సీఈఓ, ప్రపంచ కుబేరుడు జెఫ్‌ బెజోస్‌ తన భార్య, రచయిత్రి మెకాంజీకి దాదాపు 36.8 బిలియన్‌ డాలర్ల విలువైన అమెజాన్‌ షేర్లు బదలాయించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆమె ఫోర్బ్స్‌ మహిళా సంపన్నుల జాబితాలో మూడో స్థానంలో నిలిచారు.

ప్రపంచ వ్యాప్తంగా భార్యలకు అత్యధిక భరణం చెల్లించిన భర్తలు, ఖరీదైన విడాకులు.

దిమిత్రి రైబోలోలెవ్‌- ఎలీనా రైబోలోలెవ్
బెజోస్‌ కంటే ముందు ఈ జంట విడాకులే అత్యంత ఖరీదైన విడాకులుగా నిలిచాయి. 2014లో వీరు విడిపోయారు. ఈ క్రమంలో బిలియనీర్‌ దిమిత్రి తన భార్య ఎలీనాకు 4.5 బిలియన్‌ డాలర్లు భరణంగా చెల్లించారు.

ఎలిక్‌ వైల్డిస్టీన్‌- జోక్లిన్‌ వైల్డిస్టీన్
ఫ్రెంచ్‌లో జన్మించిన అమెరికన్‌ వ్యాపారవేత్త ఎలిక్‌ 1999లో తన భార్యకు విడాకులు ఇచ్చారు. ఇందులో భాగంగా 3.8 బిలియన్‌ డాలర్లు భరణం రూపంలో చెల్లించారు.

రూపెర్ట్‌ మర్దోక్‌- అన్నా మర్దోక్‌ మన్‌
అమెరికన్‌ మీడియా మెఘల్‌ రూపెర్ట్‌ 31 ఏళ్ల వైవాహిక జీవితానికి స్వస్తి పలుకుతూ 1999లో తన భార్య అన్నా నుంచి విడిపోయారు. ఈ సందర్భంగా ఆమెకు 2.6 బిలియన్‌  డాలర్లు భరణంగా ఇచ్చారు.

బెర్నీ ఎలెస్టోన్‌- స్లావికా ఎలెస్టోన్‌
ప్రపంచంలోనే ఖరీదైన విడాకులు పొందిన ఐదో జంటగా బెర్నీ-స్లావికా జంట నిలిచింది. 2009లో విడిపోయిన ఈ జంట విడాకుల ఖరీదు- 1.2 బిలియన్‌ డాలర్లు.

స్టీవ్‌ వీన్‌- ఎలైన్‌ వీన్‌
కాసినో మొఘల్‌ స్టీవ్‌ వీన్‌ తన భార్య నుంచి విడిపోయే క్రమంలో సుమారు 1 బిలియన్‌ డాలర్ల భరణం చెల్లించారు. ఎంతోమంది మహిళలను లైంగికంగా వేధించారనే ఆరోపణలు స్టీవ్‌ వీన్‌పై రావడంతో ఆయన భార్య విడాకులు కోరినట్లుగా అప్పట్లో వార్తలు ప్రచారమయ్యాయి.

స్టీవెన్‌ స్పీల్‌బర్గ్‌- ఎమీ ఇర్వింగ్‌
ప్రముఖ హాలీవుడ్‌ దర్శకుడు స్టీవెన్‌ స్పీల్‌బర్గ్‌ 1989లో తన భార్య ఎమీ నుంచి విడిపోయారు. ఆ సమయంలో 100 మిలియన్‌ డాలర్లు ఎమీకి భరణంగా చెల్లించారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top