వచ్చే మూడేళ్లూ 7.5 శాతమే

World Bank retains India's growth rate forecast for FY19-20 at 7.5 persant - Sakshi

భారత్‌పై మునుపటి అంచనాలకే ప్రపంచబ్యాంకు ఓటు

2021లో చైనా కంటే భారత్‌ 1.5 శాతం ఎక్కువ వృద్ధి

వాషింగ్టన్‌: భారత వృద్ధి రేటు విషయంలో తన అంచనాలకు కట్టుబడి ఉన్నట్లు ప్రపంచబ్యాంకు స్పష్టంచేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019–20) సహా వచ్చే మూడేళ్లూ భారత జీడీపీ వృద్ధి 7.5 శాతంగా ఉంటుందని అంచనా వేసింది. దీంతో 2019–20 సంవత్సరానికి భారత వృద్ధి రేటు 7.5 శాతంగా ఉండొచ్చన్న గత అంచనాను కొనసాగించినట్టయింది. ఇదే రేటును తదుపరి మూడేళ్లూ కొనసాగించవచ్చని తెలియజేసింది. పెట్టుబడులు, ప్రైవేటు వినియోగం బలంగా ఉండడం వృద్ధి రేటుకు మద్దతుగా నిలుస్తాయని పేర్కొంది. అంతర్జాతీయ ఆర్థిక వృద్ధి అంచనాలను ప్రపంచ బ్యాంకు తాజాగా విడుదల చేసింది.

2018–19 ఆర్థిక సంవత్సరానికి మన దేశ జీడీపీ రేటు 6.8 శాతంగా ఉంటుందన్న అంచనాను కేంద్ర గణాంక శాఖ ఇటీవల పేర్కొనగా, ప్రపంచ బ్యాంకు మాత్రం 7.2 శాతంగా ఉంటుందని తెలిపింది. పొరుగు దేశం చైనా 2018లో 6.6 శాతం వృద్ధి రేటు నమోదు చేయగా, 2019లో 6.2 శాతంగా ఉంటుందని ప్రపంచ బ్యాంకు పేర్కొంది. ఇక 2020లో 6.1 శాతం, 2021లో 6 శాతంగా ఉంటాయని పేర్కొంది. దీంతో భారత్‌ అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా గుర్తింపును కొనసాగించనుంది. 2021 నాటికి భారత వృద్ధి రేటు చైనా 6 శాతం కంటే ఒకటిన్నర శాతం ఎక్కువగా ఉంటుందని ప్రపంచ బ్యాంకు పేర్కొంది.

మానిటరీ పాలసీ అనుకూలం...  
‘‘ఆర్‌బీఐ లక్ష్యానికి దిగువనే ద్రవ్యోల్బణం ఉండడంతో మరింత సర్దుబాటుతో కూడిన మానిటరీ పాలసీ మధ్య... ప్రైవేటు వినియోగం, పెట్టుబడులు అన్నవి రుణాల వృద్ధి బలపడడం వల్ల ప్రయోజనం పొందుతాయి’’ అని ప్రపంచ బ్యాంకు తన తాజా నివేదికలో వివరించింది. పట్టణ ప్రాంత వినియోగానికి రుణాల్లో వృద్ధి పుంజుకోవడం మద్దతుగా ఉంటుందని పేర్కొంది. గ్రామీణ ప్రాంత వినియోగానికి వ్యవసాయ ఉత్పత్తుల ధరలు తక్కువగా ఉండటం ఆటంకంగా విశ్లేషించింది. తయారీ రంగంలో అంతటా బలమైన వృద్ధి ఉన్నట్టు తెలిపింది. సేవల రంగం చల్లబడడానికి ప్రధానంగా వాణిజ్యం, హోటల్, రవాణా, కమ్యూనికేషన్‌ రంగాల కార్యకలాపాలు నిదానించడమేనని పేర్కొంది. జీఎస్టీ ఇంకా పూర్తి స్థాయిలో సర్దుకోవాల్సి ఉందని నివేదిక అభిప్రాయపడింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top