
న్యూఢిల్లీ : వాట్సాప్ ఇటీవల కొత్త కొత్త ఫీచర్లతో వినియోగదారులను అలరిస్తున్న సంగతి తెలిసిందే. వాట్సాప్ ప్రవేశపెట్టే కొత్త ఫీచర్లకు అనూహ్య స్పందన కూడా వస్తోంది. తాజాగా మరో సరికొత్త ఫీచర్‌ను తన యూజర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. అదే లైవ్ లొకేషన్ షేరింగ్ ఫీచర్. ఈ ఫీచర్ ద్వారా మహిళలు, పిల్లలు ఎక్కడికైనా ప్రయాణించేటప్పుడు తమ కుటుంబసభ్యులు, స్నేహితులతో కనెక్ట్ అయ్యేలా ఉండొచ్చు. ఈ ఫీచర్‌తో యూజర్లు ఎక్కడ ఉన్నారో వారి స్నేహితులకు, కుటుంబసభ్యులకు ఈజీగా తెలిసిపోతుంది. ఈ కొత్త ఫీచర్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ స్మార్ట్‌ఫోన్లలోకి అందుబాటులోకి వచ్చింది. చాట్ బాక్స్ ప్రక్కన పేపర్ క్లిప్ గుర్తును క్లిక్ చేయడంతో కొత్త ఫీచర్‌ను యాక్సెస్ చేయవచ్చని వాట్సాప్ తెలిపింది.
కుటుంబ సభ్యులు లేదా స్నేహితులతో రియల్ టైమ్‌లో లొకేషన్‌ను షేర్ చేయవచ్చు. ఏ సమయంలోనైనా ఈ షేరింగ్ ఆపివేయవచ్చు. అప్పుడు లైవ్ లొకేషన్ టైమర్ కూడా ఆగిపోతుంది. 15 నిమిషాలు నాన్‌స్టాప్‌గా లైవ్‌లో ఉండవచ్చని, ఇలా గరిష్టంగా ఎనిమిది గంటల పాటు లైవ్‌ను ఎంచుకోవచ్చని కంపెనీ తెలిపింది. అలాగే గ్రూపులకు సంబంధించి లైవ్‌లొకేషన్‌ను సెలక్ట్ చేసుకున్న గ్రూపు మెంబర్స్ లొకేషన్స్ ఒకే మ్యాప్‌లో కనిపిస్తాయి. ఎంతసేపు లైవ్‌లో ఉండాలనేది యూజరే నిర్ణయించుకోవచ్చు. వాట్సాప్‌లో అందిస్తున్న ఈ లైవ్ లొకేషన్ ఫీచర్ ద్వారా మహిళలు తమ రియల్-టైమ్ లొకేషన్ లేదా జర్నీని ఇతరులతో పంచుకోవడానికి చాలా నమ్మకంగా భావిస్తారని బ్రేక్‌థ్రో సీఈవో సోహిని భట్టాచార్య తెలిపారు. ఏదైనా ప్రమాదాలు, వరదలు పరిస్థితుల్లో ఈ ఫీచర్ ఎక్కువగా ఉపయోగపడుతుందన్నారు.