అన్నీ మంచి శకునాలే..!

US-China trade deal and RBI minutes to guide Dalal Street this week  - Sakshi

అమెరికా–చైనా మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందం

బ్రిటన్‌ ఈయూ నుంచి బయటకు వచ్చేందుకు మార్గం సుగమం 

అంతర్జాతీయ అంశాలు మార్కెట్‌ను ప్రభావితం చేస్తాయంటున్న నిపుణులు

12,200 – 12,250 పాయింట్ల స్థాయిలో నిఫ్టీకి ప్రధాన నిరోధం: ఎపిక్‌ రీసెర్చ్‌ అభిప్రాయం

బుధవారం జీఎస్‌టీ కౌన్సిల్‌ సమావేశం, ఆర్‌బీఐ మినిట్స్‌ వెల్లడి

న్యూఢిల్లీ: ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఆందోళనకరంగా మారిన రెండు కీలక అంశాలకు సంబంధించి గతవారంలో ఒకేసారి సానుకూల పరిణామాలు చోటుచేసుకున్నాయి. అమెరికా–చైనా దేశాల మధ్య వాణిజ్య ఒప్పందానికి అంగీకారం కుదరడం, యూరోపియన్‌ యూనియన్‌ నుంచి బ్రిటన్‌ బయటకు వచ్చేందుకు మార్గం సుగమం కావడం వంటి అనుకూల అంశాలతో గత వారాంతాన దేశీ స్టాక్‌ సూచీలు భారీ లాభాలను నమోదు చేశాయి. అమెరికా దిగుమతి చేసుకుంటున్న చైనా ఉత్పత్తుల విషయంలో తొలి దశ వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోనున్నట్లు చైనా శుక్రవారం ప్రకటించింది.

వాణిజ్య, ఆర్థిక అంశాల పరంగా మొదటి దశ ఒప్పందాన్ని కుదుర్చుకోనున్నట్లు ప్రకటించింది. ఈ సానుకూల అంశం నేపథ్యంలో దేశీ మార్కెట్‌ మరింత ముందుకు వెళ్లే అవకాశం కనిపిస్తోందని మోతీలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రిటైల్‌ రీసెర్చ్‌ హెడ్‌ సిద్ధార్థ ఖేమ్కా విశ్లేషించారు. ట్రేడ్‌ డీల్‌ ఒక కొలిక్కి రావడం, బ్రిటన్‌ ఎన్నికల్లో కన్జర్వేటివ్‌ పార్టీ అత్యధిక స్థానాలను గెలుచుకోవడం వంటి మార్కెట్‌ ప్రభావిత అంశాలు బుల్స్‌కు అనుకూలంగా ఉన్నాయని ఎపిక్‌ రీసెర్చ్‌ సీఈఓ ముస్తఫా నదీమ్‌ తెలిపారు. నిఫ్టీకి 12,200 – 12,250 స్థాయిలో ప్రధాన నిరోధం ఎదురుకావచ్చని అంచనా వేశారు. ఇక తాజా పరిణామాలు మార్కెట్‌కు సానుకూలంగా ఉన్నందున ర్యాలీకి ఆస్కారం ఉందని రెలిగేర్‌ బ్రోకింగ్‌ రీసెర్చ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అజిత్‌ మిశ్రా అన్నారు.

జీఎస్‌టీ కౌన్సిల్‌ సమావేశం ఈవారంలోనే..
పరోక్ష పన్నుల విధానంలో ఆదాయాన్ని పెంచేందుకు ఈవారంలోనే వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) కౌన్సిల్‌ సమావేశం కానుంది. బుధవారం జరిగే 38వ సదస్సులో రాష్ట్ర ప్రభుత్వాల నష్టపరిహారం అంశం చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఇదే విధంగా మినహాయింపు అంశాలపై సమీక్ష, రేట్లలో మార్పులు ఉండేందుకు ఆస్కారం ఉందని ప్రభుత్వ ఉన్నత అధికారి ఒకరు మీడియాకు చెప్పారు. వీటికి ప్రభావితం అయ్యే రంగాలపై మార్కెట్‌ వర్గాలు దృష్టిసారించాయి.

ఆర్‌బీఐ మినిట్స్‌ వెల్లడి..: ఈ నెల మొదటి వారంలో జరిగిన ద్రవ్య విధాన కమిటీ సమావేశ మినిట్స్‌ను ఆర్‌బీఐ బుధవారం విడుదల చేయనుంది. ఇక నవంబర్‌ నెల టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం సోమవారం వెల్లడికానుంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top