టీసీఎస్‌ @ 100 బిలియన్‌ డాలర్లు!

TCS edges closer to $100 billion market cap after stellar Q4 results - Sakshi

మరో రూ.7,900 కోట్ల దూరంలో

ఈ ఘనతను సాధించనున్న తొలి భారత కంపెనీ

ముంబై: దేశీ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌(టీసీఎస్‌)..  మరో కీలక మైలురాయికి చేరువవుతోంది. భారత్‌ కార్పొరేట్‌ రంగ చరిత్రలో మొట్టమొదటిసారిగా 100 బిలియన్‌ డాలర్ల మార్కెట్‌ విలువ ఘనతను సాధించేందుకు ఉరకలేస్తోంది.  కంపెనీ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక ఫలితాలు అంచనాలను మించాయి. దీంతో శుక్రవారం స్టాక్‌ సూచీలు నష్టపోయినా, టీసీఎస్‌ షేరు మాత్రం రికార్డ్‌ స్థాయిని తాకింది. అంతేకాకుండా కంపెనీ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ వంద బిలయన్‌ డాలర్లకు అత్యంత దరిదాపుల్లోకి వచ్చింది.  

టాటా గ్రూప్‌ కామధేనువు...
టాటా గ్రూప్‌కు కామధేనువు(టాటా గ్రూప్‌ లాభాల్లో 85 శాతం ఈ కంపెనీ నుంచే వస్తోంది),  ఐటీ దిగ్గజం టీసీఎస్‌ షేర్‌ శుక్రవారం జీవిత కాల గరిష్ట స్థాయికి చేరింది. టీసీఎస్‌ ఇంట్రాడేలో 7.2 శాతం లాభంతో రూ. 3,421 వద్ద జీవిత కాల  గరిష్ట స్థాయిని తాకింది.

చివరకు  6.7 శాతం లాభంతో రూ.3,406 వద్ద ముగిసింది. ఇది  ఆల్‌టైమ్‌ హై క్లోజింగ్‌ ధర. సెన్సెక్స్‌లోనూ, నిఫ్టీ సూచీలో కూడా అత్యధికంగా లాభపడిన షేర్‌ ఇదే.  ఒక్క శుక్రవారం రోజే దాదాపు కోటి షేర్లు చేతులు మారాయి. ఎన్‌ఎస్‌ఈలో 92 లక్షలకు పైగా షేర్లు ట్రేడయ్యాయి.  

రూ.7,917 కోట్ల దూరంలో...
టీసీఎస్‌ షేర్‌ భారీగా పెరగడంతో ఈ షేర్‌ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ రూ.41,301 కోట్లు పెరిగి రూ.6,52,083 కోట్లకు పెరిగింది. వంద బిలియన్‌(పదివేల కోట్లు) డాలర్ల మార్కెట్‌ క్యాప్‌కు(దాదాపు రూ.6,60,000 కోట్లు) చేరువైంది. పదివేల కోట్ల డాలర్ల మార్కెట్‌ క్యాప్‌ సాధించనున్న తొలి భారత కంపెనీ ఇదే కానున్నది. ప్రస్తుతం అత్యధిక మార్కెట్‌ క్యాప్‌ ఉన్న భారత కంపెనీ కూడా ఇదే.

వంద బిలియన్‌ డాలర్ల మార్కెట్‌క్యాప్‌ కంపెనీ అన్న ఘనతను సాధించడానికి ఈ షేర్‌ ఇంకా రూ.7,917 కోట్ల మార్కెట్‌  క్యాప్‌సాధిస్తే, చాలు.  టీసీఎస్‌ షేర్‌ రూ.3,447ను తాకితే వంద కోట్ల డాలర్ల కంపెనీగా రికార్డ్‌ సాధిస్తుంది. ఈ ధర కంటే రూ.41 తక్కువ ధరకు శుక్రవారం ఈ షేర్‌ ముగిసింది. ఈ ఏడాది జనవరి 24 నాటికి ఈ కంపెనీ తొలిసారిగా రూ. 6 లక్షల కోట్ల మార్క్‌ను దాటింది.

బీఎస్‌ఈలో 3,000కు పైగా కంపెనీలు చురుకుగా ట్రేడవుతున్నాయి. వీటిల్లో వంద బిలియన్‌ డాలర్ల మార్కెట్‌ క్యాప్‌కు చేరువ అయిన తొలి భారత కంపెనీ ఇదే. టీసీఎస్‌ పోటీ కంపెనీ ఇన్ఫోసిస్‌ మార్కెట్‌ క్యాప్‌తో పోల్చితే టీసీఎస్‌ మార్కెట్‌ క్యాప్‌ రెండున్నర రెట్లు అధికం. ఇక వంద కోట్ల డాలర్ల మార్కెట్‌ క్యాప్‌ కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా 63 మాత్రమే ఉన్నాయి. అమెజాన్, యాపిల్‌ వంటి కంపెనీలు ఈ జాబితాలో ఉన్నాయి.

టాప్‌ 5 కంపెనీలు
కంపెనీ                             మార్కెట్‌ క్యాప్‌ (రూ. కోట్లలో)
1    టీసీఎస్‌                         6,52,083
2    రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌         5,87,830
3    హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌          5,08,884
4    ఐటీసీ                             3,36,778
5    హిందుస్తాన్‌యూనిలివర్‌    3,17,212

14 ఏళ్లలో 23%చక్రగతి వృద్ధి...
2004లో ఐపీఓకు వచ్చినప్పటి నుంచి టీసీఎస్‌ షేర్‌ 14 సంవత్సరాల్లో 23% చొప్పున చక్రగతిన వృద్ధి సాధించింది. కాగా ఈ ఏడాది ఇప్పటిదాకా ఈ షేర్‌ 20% ఎగసింది. కంపెనీ భవిష్యత్తు అంచనాలు పటిష్టంగా ఉన్నాయని, ఐటీ రంగంలో తీవ్రమైన మార్పులు వస్తున్న నేపథ్యంలో టీసీఎస్‌ విజేతగా నిలవగలదని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు.

ఈ షేర్‌ ఫండమెం టల్స్‌ పటిష్టంగా ఉన్నాయని, షేర్‌ పడిపోవడానికి అవకాశాలు తక్కువగా ఉన్నాయని, లార్జ్‌క్యాప్‌ ఐటీ కంపెనీల్లో టీసీఎస్‌కు అగ్రస్థానం ఇవ్వవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ షేర్‌ పతనమైనప్పుడల్లా కొను గోలు చేయవచ్చని వారు సూచిస్తున్నారు.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top