ప్రైవేటు కంపెనీలకూ ఇక కాగ్ ఆడిట్ | Supreme Court allows CAG to audit private telecom firms | Sakshi
Sakshi News home page

ప్రైవేటు కంపెనీలకూ ఇక కాగ్ ఆడిట్

Apr 18 2014 1:17 AM | Updated on Sep 22 2018 8:48 PM

ప్రైవేటు కంపెనీలకూ ఇక కాగ్ ఆడిట్ - Sakshi

ప్రైవేటు కంపెనీలకూ ఇక కాగ్ ఆడిట్

ఆదాయ పంపిణీ ప్రాతిపదికన సహజ వనరులను వినియోగించుకుంటున్న ప్రైవేటు కంపెనీలు కాగ్ పరిధిలోకి వస్తాయని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.

న్యూఢిల్లీ: ఆదాయ పంపిణీ ప్రాతిపదికన సహజ వనరులను వినియోగించుకుంటున్న ప్రైవేటు కంపెనీలు కాగ్ పరిధిలోకి వస్తాయని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. టెలికం కంపెనీల (టెల్కోలు) ఖాతాల ఆడిట్‌కు కాగ్‌ను ఆనుమతిస్తున్నట్లు తెలిపింది. తమపై కాగ్ ఆడిట్లు నిర్వహించరాదంటూ టెల్కోలు దాఖలు చేసిన అప్పీలును జస్టిస్ కె.ఎస్.రాధాకృష్ణన్ సారథ్యంలోని ధర్మాసనం గురువారం కొట్టివేసింది. ‘ఆదాయ పంపిణీ ప్రాతిపదికన ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న ప్రైవేటు కంపెనీల అకౌంట్లపై కాగ్ తనిఖీ తప్పనిసరి. అక్రమ పద్ధతుల్లో ప్రభుత్వానికి నష్టం చేకూర్చకుండా చూడడానికి ఇది అవసరం.

స్పెక్ట్రమ్ వంటి జాతి సంపదను వినియోగించుకునే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలతో పాటు ప్రైవేటు కంపెనీలు కూడా దేశ ప్రజలకు, పార్లమెంటుకు జవాబుదారీగా ఉండాలి..’ అని కోర్టు వ్యాఖ్యానించింది. ‘భారత ప్రభుత్వం తన వనరులను ఏ విధంగా వినియోగించుకుంది, లెసైన్సు ఫీజు, స్పెక్ట్రమ్ చార్జీలు మొత్తం వసూలయ్యాయా, లెసైన్సు ఒప్పందం ప్రకారం ఆడిట్‌ను కేంద్రం సరిగ్గా నిర్వహించిందా అనే అంశాలను కాగ్ పరిశీలించగలదు. జాతి ప్రయోజనాలను పరిరక్షించడం ప్రభుత్వ బాధ్యత. సహజ వనరులను దేశ ప్రయోజనాల దృష్ట్యానే వినియోగించాలి తప్ప ప్రైవేటు రంగ ప్రయోజనాల కోసం ఉపయోగించరాదు.

 ప్రభుత్వం కూడా సహజ వనరులను పౌరుల కోసం కాపాడాలి తప్ప వాణిజ్య అవసరాలకు వినియోగించకూడదు. ప్రజా ప్రయోజనాలపై ప్రతికూల ప్రభావం చూపే వనరులను ప్రభుత్వం ప్రైవేటు రంగానికి బదిలీ చేయజాలదు...’ అని కూడా సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. టెలికం కంపెనీల అకౌంట్లను కాగ్ ఆడిట్ చేయవచ్చంటూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ భారతీయ యూనిఫైడ్ టెలికం సర్వీస్ ప్రొవైడర్ల సంఘం (ఏయూటీఎస్‌పీ), సెల్యులర్ ఆపరేటర్ల సంఘం (సీఓఏఐ), ఇతర అసోసియేషన్లు దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీం కోర్టు డిస్మిస్ చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement