స్పీడు తగ్గిన పారిశ్రామికోత్పత్తి

Speed down of industrial production - Sakshi

సెప్టెంబర్‌లో 3.8% వృద్ధికే పరిమితం

న్యూఢిల్లీ: దేశ పారిశ్రామిక రంగ ఉత్పత్తి (ఐఐపీ) సెప్టెంబర్‌ నెలలో కాస్తంత నిదానించింది. ఈ ఏడాది ఆగస్ట్‌లో 4.5 శాతంగా ఉన్న ఐఐపీ వృద్ధి మరుసటి నెల సెప్టెంబర్‌లో మాత్రం 3.8 శాతం వద్దే ఆగిపోయింది. గతేడాది సెప్టెంబర్‌ మాసంనాటి వృద్ధి 5 శాతంతో పోల్చుకున్నా తగ్గినట్టుగానే తెలుస్తోంది.

ఈ మేరకు తాజా వివరాలను కేంద్ర గణాంక విభాగం శుక్రవారం విడుదల చేసింది. వీటిని గమనిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ నుంచి సెప్టెంబర్‌ వరకు ఐఐపీ 2.5 శాతం వృద్ధి చెందగా, అంతకుముందు ఏడాది ఇదే కాలంలో ఉన్న 5.8 శాతంతో పోల్చుకుంటే సగానికి పైగా తగ్గినట్టు తెలుస్తోంది.

విభాగాల వారీగా...
ఐఐపీలో 77.63 శాతం వాటా కలిగిన తయారీ రంగం వృద్ధి సెప్టెంబర్‌లో 3.4 శాతానికే పరిమితమైంది. అంతకుముందు ఏడాది ఇదే నెలలో ఇది 5.8 శాతంగా ఉండడం గమనార్హం. ఏప్రిల్‌–సెప్టెంబర్‌ ఆరు నెలల కాలంలో 1.9 శాతమే వృద్ధి సాధించింది. అంతకుముందు ఏడాది ఇదే సమయంలో ఇది 6.1 శాతంగా ఉంది.
కన్జ్యూమర్‌ డ్యూరబుల్స్‌ (ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్, హోమ్‌అప్లియెన్సెస్‌ తదితర) ఉత్పత్తి 4.8 శాతం మేర వృద్ధి చెందింది. అంతకుముందు ఏడాది ఇదే నెలలో ఇది 10.3 శాతం. ఏప్రిల్‌ నుంచి సెప్టెంబర్‌ వరకు 1.5 శాతంగా ఉండగా, అంతకుముందు ఏడాది ఇదే కాలంలో 6.9 శాతం వృద్ధితో పోలిస్తే భారీగా తగ్గినట్టు తెలుస్తోంది. కన్జ్యూమర్‌ నాన్‌ డ్యురబుల్స్‌ విభాగం మాత్రం గరిష్ట స్థాయిలో 10 శాతం పెరిగింది.
♦  విద్యుదుత్పత్తి రంగం వృద్ధి సైతం అంతకుముందు ఏడాది ఇదే నెలలో 5.1 శాతంగా ఉండగా, అది తాజాగా 3.4 శాతానికి పడిపోయింది. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top