
స్నాప్‌డీల్ చేతికి గోజావాస్?
ఆన్‌లైన్ షాపింగ్ దిగ్గజం స్నాప్‌డీల్.. సరుకు రవాణా(లాజిస్టిక్స్) సంస్థ గోజావాస్‌ను చేజిక్కించుకునే ప్రయత్నాల్లో ఉంది.
డీల్ విలువ రూ.200 కోట్లు!
న్యూఢిల్లీ: ఆన్‌లైన్ షాపింగ్ దిగ్గజం స్నాప్‌డీల్.. సరుకు రవాణా(లాజిస్టిక్స్) సంస్థ గోజావాస్‌ను చేజిక్కించుకునే ప్రయత్నాల్లో ఉంది. ఈ డీల్ విలువ రూ.150-200 కోట్లుగా ఉండొచ్చని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. డెలివరీ కార్యకలాపాలను మరింత పటిష్టం చేసుకునేందుకు వీలుగా స్నాప్‌డీల్ ఈ కొనుగోలుపై దృష్టిపెడుతోంది. రానున్న రెండు వారాల్లో డీల్‌ను ప్రకటించే అవకాశం ఉందని ఆయా వర్గాల సమాచారం.
ఈ-కామర్స్ సంస్థ జబాంగ్‌కు చెందిన లాజిస్టిక్స్ విభాగమే గోజావాస్. జబాంగ్‌తోపాటు హెల్త్‌కార్ట్, యెప్‌మీ, లెన్స్‌కార్ట్ వంటి ఆన్‌లైన్ సంస్థలకు కూడా గోజావాస్ సేవలందిస్తోంది. సొంత డెలివరీ సంస్థ లేని కారణంగా స్నాప్‌డీల్ థర్డ్‌పార్టీ లాజిస్టిక్స్ కంపెనీలపై ఆధారపడుతోంది. కాగా, ఈ వార్తలపై స్నాప్‌డీల్ ప్రతినిధి స్పందిస్తూ.. ఊహాగానాలపై తాము వ్యాఖ్యానించబోమని పేర్కొన్నారు. గతేడాది సుమారు బిలియన్ డాలర్ల నిధులను సమీకరించిన(జపాన్ సాఫ్ట్‌బ్యాంక్ 62.7 కోట్ల డాలర్ల పెట్టుబడి సహా) స్నాప్‌డీల్... మొబైల్ టెక్నాలజీ, సరఫరా నెట్‌వర్క్ విభాగాల్లో కంపెనీల కొనుగోళ్లకు సిద్ధంగా ఉంది.