
అయిదేళ్ళ క్రితం మొదలైన ప్రయత్నం ఎట్టకేలకు సాకారమవుతోంది. మొబైల్ టెలిఫోనీలో అయిదో జనరేషన్ (5జి) టెక్నాలజీ వినియోగానికి తొలి అడుగులు పడ్డాయి. ఆరవ ఇండియా మొబైల్ కాంగ్రెస్ ఉత్సవాల్లో శనివారం భారీ హంగామా మధ్య దేశంలో 5జి సేవలను ప్రధాని లాంఛనంగా ప్రారంభించారు. ప్రస్తుత 4జి నెట్‌వర్క్‌ను వాడుకుంటూనే ‘5జి’ని అందించే నాన్–స్టాండ్ ఎలోన్ పద్ధతిలో 8 నగరాల్లో ఎయిర్‌టెల్ సేవలు మొదలయ్యాయి. దీపావళికి కొత్త నెట్‌వర్క్‌తో స్టాండ్ ఎలోన్ విధానంలో నాలుగు మెట్రో నగరాల్లో సేవలివ్వడానికి జియో సిద్ధమవుతోంది. మన సాంకేతిక ప్రస్థానంలో ఇది మరో పెద్ద ముందడుగు. అమెరికా, బ్రిటన్, చైనా, కెనడా, దక్షిణ కొరియాలు ఎప్పుడో ప్రారంభించిన 5జి సేవలు ఇప్పటికైనా మన దగ్గర మొదలవడం సంతోషకరం.
ఆరంభం ఆలస్యమైనప్పటికీ 5జి సేవల్లో అనతికాలంలో భారత్ అగ్రస్థానానికి చేరుతుందనే వార్తలు మరింత సంతోషాన్నిస్తున్నాయి. తర్వాతి ‘6జి’కి సైతం సిద్ధమవుతున్నామన్న మాటలు మారనున్న భవిష్యత్ దృశ్యాన్ని సూచిస్తున్నాయి. ఇటీవల 5జి స్పెక్ట్రమ్ వేలంలో 4.3 లక్షల కోట్ల విలువైన ఎయిర్‌వేవ్స్‌ను అమ్మకానికి పెట్టగా, 1.5 లక్షల కోట్ల మేరకే అమ్ముడయ్యాయి.
రూ. 88 వేల కోట్ల పైగా వేలంలో పెట్టిన రిలయన్స్ జియో వచ్చే ఏడాది డిసెంబర్ కల్లా ప్రతి తాలూకాలో తమ సేవలు అందుబాటులోకి వచ్చేలా ప్రణాళిక వేసింది. వేలంలో జియో తర్వాత అధికంగా డబ్బు పెట్టిన భారతీ ఎయిర్‌టెల్ మాత్రం వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి పట్టణ ప్రాంతాల్లో, 2024 మార్చికి ప్రధాన గ్రామాల్లో సేవలందిస్తామంటోంది. సమస్యల్లో పడి, నిధుల సమీకరణ సాగించలేకున్న వోడాఫోన్ – ఐడియా సమయం చెప్పకున్నా, రేసులో తన ఉనికిని నిలబెట్టుకొనే పనిలో ఉంది.
5జి దిశగా ఆలోచన అయిదేళ్ళ క్రితం 2017లోనే దేశంలో మొదలైంది. విద్యావేత్తలతో పాటు ప్రభుత్వ, పారిశ్రామిక ప్రతినిధులతో ఉన్నత స్థాయి ప్రతినిధుల వేదికను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా మన దేశంలోనూ ‘5జి’కి మార్గం చూపి, అప్పటి 4జి దాకా వివిధ టెలికామ్ నెట్‌వర్క్‌లలో నెలకొన్న విజాతీయతను పోగొట్టడం లక్ష్యంగా ఆ వేదిక పనిచేసింది.
2018లో నిపుణుల బృందం తన నివేదికను సమర్పించింది. 5జి ఉపయోగాలపై పరిశోధన సాగుతుండగానే ప్రభుత్వం పరిశీలనకై టెలికామ్ సంస్థలకు స్పెక్ట్రమ్ కేటాయింపు మొదలుపెట్టింది. 2019లో స్పెక్ట్రమ్ ధరలపై టెలికామ్ శాఖ, ట్రాయ్ సంప్రతింపులు జరిపాయి. ఈ ఏడాది ఆగస్ట్‌లో 5జి స్పెక్ట్రమ్ వేలం జరిగింది. రెండు నెలల్లో ఇప్పుడు 5జి సేవలు మొదలయ్యాయి.
ఇప్పుడున్న 4జి కన్నా పది రెట్లు ఇంటర్నెట్ స్పీడ్ ‘5జి’తో పెరుగుతుంది. ‘4జి’లో 100 ఎంబీపీఎస్ అత్యధిక స్పీడ్ కాగా, ‘5జి’లో ఏకంగా అది 10 జీబీపీఎస్ దాకా వెళుతుంది. అలాగే, డేటా ప్రసారానికి ‘4జి’లో 10 నుంచి 100 మిల్లీసెకన్ల సమయం పడితే, ‘5జి’లో ఆ లేటెన్సీ సమయం 1 మిల్లీ సెకన్ లోపలే ఉంటుంది. కృత్రిమ మేధ (ఏఐ) వినియోగం పెరిగి, విద్య, వైద్యం, వినియోగ వస్తువులు, ఆన్‌లైన్ గేమింగ్, వినోదం – ఇలా అన్ని రంగాల్లో వ్యాపారాలు మారిపో తాయి.
5జి సేవలు కొత్త ఆర్థిక అవకాశాలకు తలుపులు తీసి, మరిన్ని సామాజిక ప్రయోజనాలతో మొత్తం భారత సమాజాన్నే మార్చేస్తాయని అంచనా వేస్తున్నది అందుకే! వచ్చే 2035కల్లా దేశంలో 5జి వల్ల ఏకంగా 45 వేల కోట్ల డాలర్ల మేర సంచిత ఆర్థిక ప్రభావం ఉంటుందని సర్కారు వారి మాట. 5జి వల్ల నిరుపేదలు సాధికారత సాధిస్తారని ప్రధాని ఆశంస.
అది వాస్తవరూపం దాల్చాలంటే, 5జి సేవలతో పల్లెల్లో నిరుపేదలకు సైతం నాణ్యమైన విద్య, వైద్యం అందించాలి. ఉపాధి అవకాశాలు కల్పించాలి. అలా ‘5జి’తో పట్టణ – గ్రామీణ అంతరాలను చెరిపివేయాలి.
అయితే, అనేక సవాళ్ళు లేకపోలేదు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా 5జి సేవలు తొలి ఏళ్ళలో టెలికామ్ కంపెనీలకు కాసుల వర్షం కురిపించలేదు. మన టెలికామ్ సేవల సంస్థలకూ ఆ సంగతి తెలుసు. స్పెక్ట్రమ్ కొనుగోలు కోసం ఇప్పటికే భారీ మొత్తం ఖర్చు పెట్టిన ఈ సంస్థలు 5జి విస్తరణలో ఆర్థిక క్రమశిక్షణతో తెలివిగా అడుగులు వేయాల్సి వస్తుంది.
వినియోగదారులకు అందుబాటులో ఉంటూనే, అతి డిస్కౌంట్లతో సొంత జేబుకు మరీ పెద్ద చిల్లు పడకుండా చూసుకోక తప్పదు. 4జిలో అనేక ఇబ్బందులున్నా ప్రపంచంలో అత్యధికంగా డేటా వినియోగించే మొబైల్ యూజర్లలో భారతీయులూ ఒకరు.
అదే సమయంలో సగటున నెలకు ఒక యూజర్‌తో టెలికామ్ సంస్థలకు వచ్చే ఆదాయం బాగా తక్కువుండే దేశాల్లో భారత్ ఒకటి. వ్యాపారం నిలబడాలంటే ఇది ఇబ్బందే గనక, 4జి లాగా 5జి సేవలనూ టెలికామ్ సంస్థలు చౌకగా ఇస్తాయని చెప్పలేం. అయితే, కాస్తంత ఖరీదైనా సరే తాము ‘5జి’కి మారిపోతామంటూ ఇటీవలి సర్వేలో నూటికి 90 మంది ఉత్సాహం చూపారు.
ధరల నిర్ణయంతో పాటు సైబర్ భద్రత, సాంకేతికతను పెంచుకోవడం, ఫైబర్‌నెట్ విస్తరణ తదితర సవాళ్ళను టెలికామ్ సంస్థలు ఎలా ఎదుర్కొంటాయో చూడాలి. అలాగే, 4జి సేవల్లో, నెట్ స్పీడ్‌లో సవాలక్ష సమస్యలు వేధిస్తున్న సువిశాల దేశంలో ‘5జి’లో ఇచ్చినమాట నిలబెట్టుకోవడమూ సులభమేమీ కాదు. బేసిక్ ఫోన్ల స్థానాన్ని స్మార్ట్‌ఫోన్లు ఆక్రమించినట్టు, పాత టెక్నాలజీలను పూర్తిగా మార్చడానికి పదేళ్ళపైనే పట్టవచ్చు.
అయితేనేం 5జి ఫోన్ల అమ్మక హంగామా అప్పుడే మొదలైంది. అంతటా 5జి ఉత్సాహం నెలకొంది. ఆరేళ్ళలో అనూహ్యంగా మొబైల్ వీడియోను సర్వాంతర్యామిని చేసిన 4జి లాగానే, డిజిటల్ ఇండియాలో సరికొత్త స్వప్నాన్వేషణకు బి రెడీ!