సెబీ ముందుకు త్వరలో చందా కొచర్‌.. | Sebi may summon ICICI Bank CEO Chanda Kochhar soon | Sakshi
Sakshi News home page

సెబీ ముందుకు త్వరలో చందా కొచర్‌..

Sep 9 2018 11:55 PM | Updated on Sep 10 2018 12:04 AM

Sebi may summon ICICI Bank CEO Chanda Kochhar soon - Sakshi

న్యూఢిల్లీ: వీడియోకాన్‌ గ్రూప్‌నకు రుణాల వ్యవహారంలో నిబంధనల అతిక్రమణ ఆరోపణలకు సంబంధించి ఐసీఐసీఐ బ్యాంక్‌ సీఈవో చందా కొచర్, ఆమె భర్త దీపక్‌ కొచర్‌లను ప్రశ్నించేందుకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ త్వరలో సమన్లు జారీ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. వారితో పాటు కొందరు బ్యాంకు ఉన్నతాధికారుల్లో, వీడియోకాన్‌ గ్రూప్‌ ఎగ్జిక్యూటివ్స్‌కు కూడా సమన్లు జారీ చేయొచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. 

ఇది మొత్తం వ్యవస్థపైనే ప్రభావం చూపే కేసు కావడంతో దీనిపై సెబీ, రిజర్వ్‌ బ్యాంక్, ప్రభుత్వం కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని భావిస్తుండటమే ఇందుకు కారణం. వీడియోకాన్‌ గ్రూప్‌నకు ఐసీఐసీఐ బ్యాంకు రుణాలివ్వడం, ప్రతిఫలంగా ఆ గ్రూప్‌ చీఫ్‌ వేణుగోపాల్‌ ధూత్‌.. చందా కొచర్‌ భర్త దీపక్‌ కొచర్‌ సంస్థకు పెట్టుబడులు సమకూర్చారనేది ప్రధాన ఆరోపణ. భర్త వ్యాపార లావాదేవీల గురించి తనకు తెలియదంటూ చందా కొచర్‌ చెబుతుండగా, ఐసీఐసీఐ బ్యాంక్‌ బోర్డు బాసటగా నిల్చింది.  

దీనిపై వివిధ దర్యాప్తు సంస్థలు విచారణ జరుపుతున్నాయి. అటు ఐసీఐసీఐ బ్యాంక్‌ బోర్డు కూడా స్వతంత్ర ఎంక్వైరీ చేపట్టడంతో అది పూర్తయ్యేదాకా చందా కొచర్‌ సెలవులో ఉంటారు. ఆరోపణలు రుజువైతే ఐసీఐసీఐ బ్యాంక్‌కు సెబీ నిబంధనల ప్రకారం రూ. 25 కోట్ల దాకా జరిమానా పడొచ్చు. అటు కొచర్‌ కు కూడా రూ. 10 కోట్ల దాకా జరిమానాతో పాటు ఇతర చర్యలు కూడా ఎదుర్కొనాల్సి రావొచ్చు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement