breaking news
Chanda Kothar
-
సెబీ ముందుకు త్వరలో చందా కొచర్..
న్యూఢిల్లీ: వీడియోకాన్ గ్రూప్‌నకు రుణాల వ్యవహారంలో నిబంధనల అతిక్రమణ ఆరోపణలకు సంబంధించి ఐసీఐసీఐ బ్యాంక్ సీఈవో చందా కొచర్, ఆమె భర్త దీపక్ కొచర్లను ప్రశ్నించేందుకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ త్వరలో సమన్లు జారీ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. వారితో పాటు కొందరు బ్యాంకు ఉన్నతాధికారుల్లో, వీడియోకాన్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్స్‌కు కూడా సమన్లు జారీ చేయొచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇది మొత్తం వ్యవస్థపైనే ప్రభావం చూపే కేసు కావడంతో దీనిపై సెబీ, రిజర్వ్ బ్యాంక్, ప్రభుత్వం కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని భావిస్తుండటమే ఇందుకు కారణం. వీడియోకాన్ గ్రూప్‌నకు ఐసీఐసీఐ బ్యాంకు రుణాలివ్వడం, ప్రతిఫలంగా ఆ గ్రూప్ చీఫ్ వేణుగోపాల్ ధూత్.. చందా కొచర్ భర్త దీపక్ కొచర్ సంస్థకు పెట్టుబడులు సమకూర్చారనేది ప్రధాన ఆరోపణ. భర్త వ్యాపార లావాదేవీల గురించి తనకు తెలియదంటూ చందా కొచర్ చెబుతుండగా, ఐసీఐసీఐ బ్యాంక్ బోర్డు బాసటగా నిల్చింది. దీనిపై వివిధ దర్యాప్తు సంస్థలు విచారణ జరుపుతున్నాయి. అటు ఐసీఐసీఐ బ్యాంక్ బోర్డు కూడా స్వతంత్ర ఎంక్వైరీ చేపట్టడంతో అది పూర్తయ్యేదాకా చందా కొచర్ సెలవులో ఉంటారు. ఆరోపణలు రుజువైతే ఐసీఐసీఐ బ్యాంక్‌కు సెబీ నిబంధనల ప్రకారం రూ. 25 కోట్ల దాకా జరిమానా పడొచ్చు. అటు కొచర్ కు కూడా రూ. 10 కోట్ల దాకా జరిమానాతో పాటు ఇతర చర్యలు కూడా ఎదుర్కొనాల్సి రావొచ్చు. -
ఐసీఐసీఐ లాభం 8% డౌన్
క్యూ1లో రూ.2,049 కోట్లు... ►భారీగా పెరిగిన మొండిబకాయిలు... ► రుణ వృద్ధి 3 శాతానికి పరిమితం... ► మొత్తం ఆదాయంలో వృద్ధి అర శాతమే; రూ.16,847 కోట్లు ► నికర వడ్డీ ఆదాయం రూ.5,590 కోట్లు; 8.4 శాతం వృద్ధి న్యూఢిల్లీ: దేశీ ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్‌ను మొండి బకాయిల భూతం వెంటాడుతూనే ఉంది. బ్యాంక్ స్టాండెలోన్ (ఒక్క బ్యాంకింగ్ కార్యకలాపాలకు సంబంధించి) నికర లాభం ఈ ఏడాది ఏప్రిల్–జూన్‌కు సంబంధించిన తొలి త్రైమాసికంలో 8.2 శాతం దిగజారి రూ.2,049 కోట్లుగా నమోదైంది. క్రితం ఏడాది ఇదే కాలంలో బ్యాంకు నికర లాభం రూ.2,232 కోట్లు. కాగా, మొత్తం ఆదాయం రూ.16,760 కోట్ల నుంచి రూ.16,847 కోట్లకు చేరింది. దీన్లో అర శాతం మాత్రమే వృద్ధి కనిపించింది. ప్రధానంగా మొండి బకాయిలు (ఎన్పీఏలు) భారీగా పెరగడం, రుణ వృద్ధి మందగమనం వంటివి లాభాల్లో కోతకు కారణమయ్యాయి. కాగా, మార్కెట్ విశ్లేషకులు క్యూ1లో ఐసీఐసీఐ స్టాండెలోన్ లాభం రూ.2,005 కోట్లుగా ఉండొచ్చని అంచనా వేశారు. ఎన్పీఏలు పైపైకి... బ్యాంక్ మొత్తం రుణాల్లో స్థూల మొండిబకాయిలు (ఎన్పీఏ) ఈ ఏడాది జూన్ క్వార్టర్లో 7.99 శాతానికి (రూ.43,148 కోట్లు) ఎగబాకాయి. క్రితం ఏడాది ఇదే క్వార్టర్లో స్థూల ఎన్పీఏలు 5.28 శాతం (రూ.27,563 కోట్లు) మాత్రమే. అయితే, సీక్వెన్షియల్‌గా (మార్చి క్వార్టర్లో 7.89 శాతం; రూ.42,552 కోట్లు) పోల్చి చూస్తే ఎన్‌పీఏల్లో పెరుగుదల పెద్దగా లేకపోవడం గమనార్హం. ఇక నికర ఎన్పీఏలు గతేడాది జూన్ క్వార్టర్లో 3.01 శాతం (రూ.15,308 కోట్లు) నుంచి ఈ ఏడాది ఇదే క్వార్టర్లో 4.86 శాతానికి (రూ.25,306 కోట్లు) దూసుకెళ్లాయి. అయితే, మార్చి క్వార్టర్లో నికర ఎన్పీఏలతో (4.89 శాతం, రూ.25,451 కోట్లు) పోలిస్తే... స్వల్పంగా తగ్గడం విశేషం. పెరిగిన కేటాయింపులు.. క్యూ1లో మొండిబకాయిలకు కేటాయింపులు (ప్రొవిజనింగ్) 3.7 శాతం అధికంగా రూ.2,515 కోట్ల నుంచి రూ.2,609 కోట్లకు చేరాయి. సీక్వెన్షియల్ ప్రాతిపదికన చూసినపుడు మార్చి క్వార్టర్లోని రూ.2,898 కోట్ల ప్రొవిజనింగ్‌తో పోలిస్తే క్యూ1లో 10 శాతం తగ్గుముఖం పట్టాయి. స్థూలంగా జూన్ క్వార్టర్లో రూ.4,975 కోట్ల రుణాలు ఎన్పీఏలుగా మారాయి. గడిచిన ఏడు క్వార్టర్లలో ఇదే అతి తక్కువ కావడం గమనార్హం. జేపీ అసోసియేట్స్‌కు చెందిన జేపీ సిమెంట్స్‌ను అల్ట్రాటెక్‌కు విక్రయించడంద్వారా బ్యాంకు రూ.2,775 కోట్ల బకాయిలను రాబట్టుకోగలిగింది. ఇక రూ.1,600 కోట్ల ఎన్పీఏలను క్యూ1లో రైటాఫ్ చేసింది. దీంతో నికరంగా స్థూల ఎన్పీఏలుగా మారిన రుణాలు రూ.2,200 కోట్లుగా లెక్క తేలాయి. ఇక ఆర్బీఐ దివాలా చట్టం ప్రయోగించాల్సిందిగా ఆదేశించిన డర్టీ డజన్ కంపెనీలకు సంబంధించి తమ వాటా రుణాలపై (రూ.6,889 కోట్లు) దివాలా చట్టం చర్యలు తీసుకోనున్నట్లు ఐసీఐసీఐ చీఫ్ చందా కొచర్ పేర్కొన్నారు. ఈ ఎన్‌పీఐలపై రూ.2,828 కోట్లు ఇప్పటికే ప్రొవిజనింగ్ చేశామని.. వచ్చే మూడు క్వార్టర్లలో కూడా మరో రూ.650 కోట్లను అదనంగా కేటాయిస్తామని ఆమె చెప్పారు. కన్సాలిడేటెడ్‌గా చూస్తే... అనుబంధ సంస్థలన్నింటితో కలిపి (కన్సాలిడేటెడ్) చూస్తే.. క్యూ1లో ఐసీఐసీఐ బ్యాంక్ నికర లాభం 3.5 శాతం వృద్ధి చెంది రూ.2,605 కోట్లకు చేరింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.2,516 కోట్లుగా నమోదైంది. ఇక కన్సాలిడేటెడ్‌గా మొత్తం ఆదాయం కూడా రూ.24,484 కోట్ల నుంచి రూ.26,518 కోట్లకు ఎగబాకింది. 8.3 శాతం వృద్ధి చెందింది. అనుబంధ సంస్థలో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ (ఐపీఓ ద్వారా స్టాక్ మార్కెట్లో లిస్టయిన సంగతి తెలిసిందే) నికర లాభం నామమాత్ర వృద్ధితో రూ.405 కోట్ల నుంచి రూ.406 కోట్లకు చేరింది. ఇక మరో సబ్సిడరీ ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ సంస్థ నికర లాభం 44 శాతం వృద్ధితో రూ.98 కోట్ల నుంచి రూ.141 కోట్లకు ఎగబాకింది. ఐసీఐసీఐ సెక్యూరిటీస్ నికర లాభం క్యూ1లో 67 శాతం ఎగసి రూ.69 కోట్ల నుంచి రూ.115 కోట్లకు చేరింది. ఇతర ముఖ్యాంశాలివీ... ♦ బ్యాంక్ మొత్తం రుణాలు జూన్ క్వార్టర్లో కేవలం 3 శాతం మాత్రమే వృద్ధి చెంది రూ.4,64,075 కోట్లకు చేరాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో రుణాలు రూ.4,49,427 కోట్లుగా ఉన్నాయి. అయితే, బ్యాంక్ మొత్తం రుణాల్లో 53 శాతం వాటాతో కీలకంగా ఉన్న రిటైల్ రుణాల్లో మాత్రం 19 శాతం వృద్ధి నమోదు కావడం గమనార్హం. ♦ మొత్తం డిపాజిట్లు మాత్రం 15 శాతం వృద్ధితో రూ.4.86 లక్షల కోట్లకు ఎగబాకాయి. ♦ నికర వడ్డీ ఆదాయం క్యూ1లో 8.4 శాతం వృద్ధితో రూ.5,590 కోట్లుగా నమోదైంది. నికర వడ్డీ మార్జిన్ 3.57 శాతం నుంచి 3.27 శాతానికి(సీక్వెన్షియల్‌గా) తగ్గింది. ♦ ఇతర ఆదాయం 1.2 శాతం వృద్ధి చెంది రూ.3,390 కోట్లకు చేరింది. ఇందులో ఫీజుల రూపంలో వచ్చిన ఆదాయం రూ.2,377 కోట్లు. 10 శాతం వృద్ధి నమోదైంది. ♦ ఇక బ్యాంక్ స్టాండెలోన్ నిర్వహణ లాభం 0.6 శాతం తగ్గుదలతో రూ.5,183 కోట్లుగా నమోదైంది. ♦ గురువారం బీఎస్ఈలో ఐసీఐసీఐ బ్యాంక్ షేరు 1.02 శాతం నష్టపోయి రూ.307 వద్ద స్థిరపడింది. మార్కెట్లో ట్రేడింగ్ ముగిసిన తర్వాత ఫలితాలు వెలువడ్డాయి. లాభాలు తగ్గటానికి ప్రధానంగా రెండు కారణాలున్నాయి. ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం విదేశీ సబ్సిడరీల నుంచి వచ్చిన లాభాలపై ఫారిన్ ఎక్సే్ఛంజ్ రాబడులైన రూ.206 కోట్లను బ్యాంక్ ఆదాయాల్లో చూపించుకోవడానికి వీల్లేకపోవడం, అదేవిధంగా ఐసీఐసీఐ ఫ్రుడెన్షియల్ లైఫ్ లిస్టింగ్ నేపథ్యంలో దీని నుంచి లభించే రూ.204 కోట్ల త్రైమాసిక డివిడెండ్‌ను అర్థ సంవత్సరం లెక్కన చూపించుకోవాల్సి రావడం వల్ల లాభాలపై ప్రభావం పడింది. గతేడాదితో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరంలో మొండిబకాయిల సమస్య తగ్గుముఖం పడుతుంది. – చందా కొచర్, ఐసీఐసీఐ బ్యాంక్ చీఫ్