కరోనాపై ఆర్‌బీఐ ‘వార్‌’..!! | RBI set up war-room in just one day amid coronavirus | Sakshi
Sakshi News home page

కరోనాపై ఆర్‌బీఐ ‘వార్‌’..!!

Mar 23 2020 6:21 AM | Updated on Mar 23 2020 6:21 AM

RBI set up war-room in just one day amid coronavirus - Sakshi

ముంబై: కరోనా వైరస్‌ మహమ్మారి కారణంగా ఆర్థిక వ్యవస్థ దెబ్బతినకుండా రిజర్వ్‌ బ్యాంక్‌ యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంది. మార్చి 19 నుంచే వ్యాపార విపత్తు ప్రణాళిక (బీసీపీ)ని అమల్లోకి తెచ్చింది. ఇందులో భాగంగా ముంబైలోని ఒక రహస్య ప్రదేశంలో ప్రత్యేకంగా వార్‌ రూమ్‌ ఏర్పాటు చేసింది. కేవలం 24 గంటల వ్యవధిలో వార్‌ రూమ్‌ అందుబాటులోకి తెచ్చినట్లు ఆర్‌బీఐ అధికారి ఒకరు తెలిపారు. రిజర్వ్‌ బ్యాంక్‌కు చెందిన 90 మంది కీలక సిబ్బందితో పాటు ఇతరత్రా విభాగాలకు చెందిన 60 మంది ముఖ్యమైన ఉద్యోగులు, ఫెసిలిటీ స్టాఫ్‌ 70 మంది ఇందులో విధులు నిర్వర్తిస్తుంటారని పేర్కొన్నారు. ఈ వార్‌ రూమ్‌ .. ప్రత్యేకంగా డెట్‌ నిర్వహణ, రిజర్వుల నిర్వహణ, ద్రవ్యపరమైన కార్యకలా పాలు పర్యవేక్షిస్తుందని అధికారి తెలిపారు. బీసీపీ కింద నగదు బదిలీ లావాదేవీ సేవలైన రియల్‌ టైమ్‌ గ్రాస్‌ సెటిల్మెంట్‌ (ఆర్‌టీజీఎస్‌), నేషనల్‌ ఎలక్ట్రానిక్‌ ఫండ్స్‌ ట్రాన్స్‌ఫర్‌ (నెఫ్ట్‌), స్ట్రక్చర్డ్‌ ఫైనాన్షియల్‌ మెసేజింగ్‌ సిస్టమ్‌ (ఎస్‌ఎఫ్‌ఎంఎస్‌) మొదలైనవి పర్యవేక్షిస్తారు. అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సేవలకు సంబంధించిన ఈ–కుబేర్, ఇంటర్‌బ్యాంక్‌ లావాదేవీల్లాంటివి కూడా వీటిలో ఉంటాయని వివరించారు.  

ప్రపంచంలోనే తొలిసారి..
‘ఒక కేంద్రీయ బ్యాంకు ఇలాంటి బీసీపీని అమలు చేయడం ప్రపంచంలో ఇదే మొదటిసారి. చరిత్రలో కూడా ఇదే తొలిసారి. ఎందుకంటే రెండో ప్రపంచ యుద్ధ సమయంలో కూడా ఇలాంటివి ఏర్పాటు కాలేదు‘ అని అధికారి వివరించారు. ‘సాధారణంగా సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్‌ సమస్యలు, అగ్నిప్రమాదాలు, ప్రకృతి విపత్తులు మొదలైన వాటికి మాత్రమే బీసీపీ లాంటిది ఉంటుంది. కానీ కరోనా వైరస్‌ మహమ్మారితో యుద్ధంలో ఆర్‌బీఐ ప్రకటించిన బీసీపీ లాంటిది మరెక్కడా లేదు‘ అని చెప్పారు. దేశవ్యాప్తంగా 31 ఆర్‌బీఐ ప్రాంతీయ కార్యాలయాలు, ప్రధాన కార్యాలయంలో 14,000 మంది పైగా సిబ్బంది ఉన్నారు. అత్యంత కీలక కార్యకలాపాలను 1,500 మంది దాకా సిబ్బంది నిర్వహిస్తుంటారు. ప్రధాన కార్యాలయంలో 2,000 దాకా సిబ్బంది ఉండగా.. గత వారం రోజులుకాగా కేవలం 10% మందే విధులకు హాజరవుతున్నారు.  

ఇలా ఏర్పాటు చేశారు..
వార్‌ రూమ్‌ ఏర్పాటు చేసిన తీరుతెన్నులను అధికారి వివరించారు. 150 మంది ఆర్‌బీఐ సిబ్బంది, 60 మంది సర్వీస్‌ ప్రొవైడర్లు, 70 శాతం మంది ఫెసిలిటీ స్టాఫ్‌ (మెయింటెనెన్స్, సెక్యూరిటీ, కిచెన్, ఫ్రంట్‌ డెస్క్, అడ్మినిస్ట్రేషన్‌ వంటి విభాగాల వారు)కి సరిపడే ఒక భవంతిని ఆర్‌బీఐ తీసుకుంది. ఈ సిబ్బంది అందరూ నిరంతరం ఆ భవంతిలోనే ఉంటారు. తీవ్ర విపత్తు పరిస్థితులైతే తప్ప బైటికి రావడానికి ఉండదు. వారందరికీ అవసరమైన వాటిని అత్యంత పరిశుభ్రత ప్రమాణాలను పాటిస్తూ, సరఫరా చేసేందుకు ప్రత్యేక సిబ్బంది ఉంటారు. రెండు బ్యాచ్‌ల కింద వార్‌ రూమ్‌ ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తారు.  

నోట్లను ముట్టుకుంటే చేతులు కడుక్కోండి: ఐబీఏ
కరోనా మహమ్మారి నేపథ్యంలో కరెన్సీ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలంటూ ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోసియేషన్‌(ఐబీఏ) ప్రజలకు విజ్ఞప్తి చేసింది. నోట్లను లెక్కపెట్టిన తర్వాత, ముట్టుకున్న తర్వాత తప్పనిసరిగా చేతులు కడుక్కోవాలంటూ సూచించింది. సాధ్యమైనంత వరకూ బ్యాంకు శాఖలకు వెళ్లకుండా ఆన్‌లైన్, మొబైల్‌ బ్యాంకింగ్‌ను వినియోగించాలని కోరింది. ఇందుకు ‘కరోనా సే డరో న, డిజిటల్‌ కరో నా‘ (కరోనాతో భయం వద్దు.. డిజిటల్‌ సర్వీసులు ఉపయోగించుకోండి) అనే ప్రచార కార్యక్రమాన్ని ఆవిష్కరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement