
ఏప్రిల్ 5కు ముందే ఆర్బీఐ రేట్ల కోత: బీఓఎఫ్ఏ
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఏప్రిల్ 5 ద్వైమాసిక పాలసీ సమీక్షకు ముందే రెపోరేటు ..
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఏప్రిల్ 5 ద్వైమాసిక పాలసీ సమీక్షకు ముందే రెపోరేటు (బ్యాంకులకు తానిచ్చే స్వల్పకాలిక రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు- ప్రస్తుతం 6.75 శాతం)ను పావుశాతం తగ్గిస్తుందని అంతర్జాతీయ బ్యాంకింగ్ సేవల దిగ్గజం- బ్యాంక్ ఆఫ్ అమెరికా మెరిలించ్ (బీఓఎఫ్‌ఏ-ఎంఎల్) నివేదిక పేర్కొంది. వ్యవస్థలో లిక్విడిటీ (ద్రవ్యలభ్యత)లో పెంపొందించడానికి ఆర్‌బీఐ ఈ నెలలో ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ ద్వారా రూ.20,000 కోట్ల విలువైన ప్రభుత్వ బాండ్లను కొనుగోలు చేసే అవకాశం ఉందని కూడా బీఓఎఫ్‌ఏ-ఎంఎల్ తన తాజా నివేదికలో అంచనావేసింది.
ఇదే జరిగితే డిసెంబర్ నుంచి ఈ తరహా కొనుగోళ్ల విలువ రూ.1,08,500 కోట్లు కానుందని తెలిపింది. ఆయా అంశాలు ప్రస్తుత లిక్విడిటీ కొరతను సూచిస్తున్నట్లు అభిప్రాయపడింది. ఏప్రిల్ 5న పావుశాతం రెపో రేటు కోత ఖాయమని ఇప్పటికే పలు సంస్థలు అంచనా వేస్తున్నాయి. భారత్ 2016-17 బడ్జెట్ ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో అందరి దృష్టీ ఏప్రిల్ 5న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ప్రకటించనున్న ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్షపైకి మళ్లింది. ద్రవ్యలోటు, ద్రవ్యోల్బణం లక్ష్యాలను నెరవేర్చడానికి తగిన పరిస్థితులను బడ్జెట్ సృష్టించడం రేటు కోత అంచనాలకు ప్రధాన కారణంగా విశ్లేషకులు పేర్కొంటున్నారు. హెచ్‌ఎస్‌బీసీ, యూబీఎస్ పరిశోధనా పత్రాలు ఈ మేరకు అంచనా వేశాయి. కాగా ఈ నెలలోనే రేటు కోత ఉంటుందని ప్రముఖ బ్యాంకర్ ఉదయ్ కొటాక్ పేర్కొంటున్నారు.