చిన్న బ్యాంకులకు తగినంత సమయం ఇవ్వాలి | Sakshi
Sakshi News home page

చిన్న బ్యాంకులకు తగినంత సమయం ఇవ్వాలి

Published Thu, Oct 6 2016 11:36 PM

చిన్న బ్యాంకులకు తగినంత సమయం ఇవ్వాలి

మైక్రో ఫైనాన్స్, ఎన్‌బీఎఫ్‌సీలకు అనుకూలంగా ఆర్‌బీఐ ప్యానల్ సూచనలు
ముంబై: చిన్న ఆర్థిక బ్యాంకుల ఏర్పాటుకు అనుమతి పొందిన సూక్ష్మ రుణ సంస్థలు (ఎంఎఫ్‌ఐ), బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల (ఎన్‌బీఎఫ్‌సీ)కు అనుకూలంగా ఆర్‌బీఐ ప్యానల్ గురువారం పలు సూచనలు చేసింది. ఎంఎఫ్‌ఐలు, ఎన్‌బీఎఫ్‌సీ సంస్థలు ప్రస్తుత కార్యాలయాలను బ్యాంకు శాఖలుగా మార్పు చేసేందుకు మూడేళ్ల సమయం ఇవ్వాలని సూచించింది. ఆర్‌బీఐ చిన్న ఆర్థిక బ్యాంకుల ఏర్పాటుకు పది సంస్థలకు ఇటీవలి కాలంలో సూత్రప్రాయ అనుమతులు జారీ చేసింది. వీటిలో ఎనిమిది సూక్ష్మరుణ సంస్థలు కాగా, ఒకటి ఎన్‌బీఎఫ్‌సీ సంస్థ ఉంది. ఈ నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి ఆర్‌బీఐ అంతర్గత కార్యచరణ బృందం(ఐడబ్ల్యూజీ) ఎన్‌బీఎఫ్‌సీ, ఎంఎఫ్‌ఐ సంస్థల అభిప్రాయాలను తీసుకుని ఆర్‌బీఐకి ఓ నివేదిక సమర్పించింది. దీన్ని ఆర్‌బీఐ తన వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.

 ప్యానల్ సిఫారసులు
సూక్ష్మరుణ సంస్థలు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలకు దేశవ్యాప్తంగా భారీ సంఖ్యలో ఉన్న శాఖలను బ్యాంకు శాఖలుగా మార్చేందుకు తగినంత సమయం అవసరమని ఐడబ్ల్యూజీ అభిప్రాయపడింది. రిస్క్‌ను పరిమితం చేసుకునేందుకు వీలుగా వాటి శాఖలన్నింటినీ ఒకే సారి కాకుండా క్రమానుగతంగా చిన్న బ్యాంకు శాఖలుగా మార్చుకునేందుకు అవకాశం ఇవ్వాలి.

ఈ సంస్థలు లెసైన్స్ పొందే నాటికి తమ ప్రస్తుత వ్యాపార కార్యకలాపాలను నిలిపివేయాల్సి ఉంది. అయితే, సూక్ష్మ రుణ సంస్థలు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు తమ ప్రస్తుత కార్యకలాపాలను మూసివేయడానికి లేదా వాటిని బ్యాంకు శాఖలుగా మార్చేందుకు మూడేళ్ల సమయం ఇవ్వాలి. అప్పటి వరకు ప్రస్తుత శాఖలనే బ్యాంకింగ్ ఔట్‌లెట్స్‌గా పరిగణించాలి.

{పస్తుత నిబంధనల ప్రకారం మొత్తం శాఖల్లో 25 శాతం శాఖలను బ్యాంకుల్లేని ప్రాంతాల్లో ఏర్పాటు చేయాల్సి ఉంది. అయితే, దీన్ని కూడా వెంటనే అమలు చేయరాదు. ఎలక్ట్రానిక్ కియోస్క్, ఏటీఎంలు/సీడీఎం/బీఎన్‌ఏలను సైతం బ్యాంకింగ్ ఔట్‌లెట్లుగా ఈ నిబంధనల కింద పరిగణనలోకి తీసుకోవాలి.

Advertisement
 
Advertisement
 
Advertisement