
ముంబై: తగిన ద్రవ్య లభ్యత (లిక్విడిటీ) చర్యల ద్వారా ఆర్థిక వ్యవస్థలో డిమాండ్ పెంపునకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) కీలక నిర్ణయం తసుకుంది. ఓపెన్‌మార్కెట్ ఆపరేషన్స్ (ఓఎంఓ) ద్వారా జనవరి 6న ప్రభుత్వ బాండ్ల కొనుగోలు, అమ్మకం చర్యలను చేపట్టనుంది. రూ.10,000 కోట్ల చొప్పున బాండ్ల కొనుగోలు, అమ్మకానికి చర్యలు తీసుకుంటున్నట్లు ఆర్‌బీఐ ప్రకటన ఒకటి తెలిపింది. అర్హులు తమ బిడ్స్, ఆఫర్లను జనవరి 6 ఉదయం 10.30 నుంచి 12.00 గంటల మధ్య రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్ సిస్టమ్‌పై ఎలక్ట్రానిక్ ఫార్మేట్ రూపంలో సమర్పించవచ్చని గురువారం విడుదలైన ఆర్‌బీఐ ప్రకటన తెలిపింది. బాండ్ల కొనుగోలు ద్వారా బ్యాంకింగ్‌సహా ఫైనాన్స్ సంస్థల్లోకి మరింత నిధులు పంప్ చేయడానికి వీలు కలుగుతుంది. అలాగే బాండ్ల విక్రయ చర్య... వ్యయాలకు సంబంధించి కేంద్రానికి మరిన్ని నిధులు సమకూరడానికి దోహదపడుతుంది. ఇప్పటికే ఈ తరహా ఓఎంఓ చర్యలను రెండుసార్లు ఆర్‌బీఐ చేపట్టింది.