ఫ్యూచర్స్‌ ఎక్స్‌పైరీ.. ర్యాలీకి కారణం!

Rally in bank stocks purely a function of F&O expiry - Sakshi

రజత్‌ శర్మ

మేనెల డెరివేటివ్స్‌ సీరిస్‌ ముగింపు కారణంగానే బుధవారం, గురువారం సూచీల్లో మంచి ర్యాలీ వచ్చిందని అనలిస్టు రజత్‌ శర్మ అభిప్రాయపడ్డారు. మార్కెట్లు ఇప్పట్లో భారీగా పడవని భావించిన ఇన్వెస్టర్లు షార్ట్‌కవరింగ్‌కు దిగారని, అందుకే ర్యాలీ వచ్చిందని చెప్పారు. కేవలం షార్ట్‌కవరింగ్‌ మినహాయించి ఇంత ర్యాలీ జరిపేందుకు ఫండమెంటల్స్‌ ఏమీ సానుకూల మార్పులు రాలేదని గుర్తు చేశారు. నిజానికి బ్యాంకుల ఫలితాలు చూస్తే పెద్దగా బాగాలేవని అర్ధం అవుతుందని, ప్రొవిజన్లు పెరిగాయని చెప్పారు. అందువల్ల వీటిపై పెద్దగా ఆసక్తి లేదని, తాజా ర్యాలీ చూసి వెంటనే బ్యాంకు షేర్ల వెంట పడాల్సిన అవసరం లేదని తెలిపారు. మార్కెట్లు వాస్తవిక ధృక్పధాన్ని ప్రతిబింబించడంలేదని చెప్పారు. ఇప్పటికీ నిఫ్టీ పీఈ అధికంగానే ఉందని, అందువల్ల జూన్‌ సీరిస్‌లో కూడా ఇన్వెస్టర్లు షార్ట్స్‌కే ఎక్కువ మొగ్గు చూపుతారని అంచనా వేశారు. దీంతో వచ్చే ఎక్స్‌పైరీ సమయంలో కూడా ఇదే తరహా ర్యాలీ ఉండొచ్చన్నారు.

లాక్‌డౌన్‌ ముగిసే సమయాన్ని బట్టి ఎకానమీపై ప్రభావాన్ని అంచనా వేయవచ్చని శర్మ చెప్పారు. అయితే ఏడాది చివరకల్లా కార్పొరేట్‌ ఎర్నింగ్స్‌ రికవరీ చూపుతాయని తాను భావించడంలేదన్నారు. ఇలాంటి అంచనాలతోనే మార్కెట్లో వాస్తవికతకు అవకాశం లేకుండా పోతోందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పోర్టుఫోలియోలో స్వల్పమొత్తాలనే ఈక్విటీకి కేటాయించడం మేలని సూచించారు. మిగిలిన మొత్తాన్ని రాబడి తక్కువవచ్చినా సరే అసెట్స్‌ లేదా బాండ్స్‌లో ఉంచడం మంచిదన్నారు. దీనివల్ల మార్కెట్లో అనూహ్య పతనాలు వచ్చినా పెద్దగా నష్టం ఉండదని చెప్పారు. లాక్‌డౌన్‌ ఎత్తివేసాక ఏమి జరుగుతుందో ఎవరూ చెప్పలేమని అన్నారు. అందువల్ల అప్రమత్తతే కీలకమని సూచించారు. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top