ప్రభుత్వం పన్ను చెల్లింపుదారులకు  సమాధానం ఇచ్చుకోవాలి 

PNB scam accused the government yv reddy - Sakshi

పీఎన్‌బీ స్కామ్‌లో ప్రభుత్వాన్ని తప్పుబట్టిన వైవీరెడ్డి 

కోల్హాపూర్‌: ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ వైవీరెడ్డి ఇటీవలే వెలుగు చూసిన పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు–నీరవ్‌ మోదీ రూ.13,000 కోట్ల స్కామ్‌లో కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుబట్టారు. ప్రభుత్వరంగ బ్యాంకుల యజమానిగా ఈ తరహా స్కామ్‌ల వల్ల  పెరిగిపోతున్న నష్టాలపై పన్ను చెల్లింపుదారులకు సమాధానం ఇవ్వాల్సి ఉందన్నారు. పీఎన్‌బీలో చోటుచేసుకున్నది కచ్చితంగా మోసమేనని, దీనిపై ఎక్కువగా ఆందోళన చెందేది ఎవరు? అని ఆయన ప్రశ్నించారు. బ్యాంకులను సురక్షితంగా ఉంచడం ఎలా అన్న అంశంపై ఇక్కడ జరిగిన చర్చలో పాల్గొని వైవీరెడ్డి మాట్లాడారు. తమ డబ్బులకు సంరక్షకుడిగా ఉండాల్సిన ప్రభుత్వం ఈ తరహా స్కామ్‌లను నియంత్రించడంలో ఎందుకు విఫలమవుతుందని పన్ను కట్టేవారు ప్రశ్నించాలని సూచించారు.

ప్రభుత్వం తాను నియమించిన డైరెక్టర్లు ఏం చేస్తున్నారనే దానిపై... తన సొంత పెట్టుబడుల పర్యవేక్షణ, నియంత్రణ విషయంలో కచ్చితంగా ఆందోళన చెందాల్సిందేనన్నారు. ఆర్‌బీఐ ప్రధాన బాధ్యత ఆర్థిక వ్యవస్థ స్థిరత్వం, డిపాజిట్ల పరిరక్షణ అయినప్పటికీ, బ్యాంకింగ్‌ వ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని కాపాడాల్సిన బాధ్యత విస్మరించరానిదని అభిప్రాయపడ్డారు. మోసాలతో సంబంధం ఉందన్న ఆరోపణలతో పలువురు బ్యాంకర్లపై ఇటీవలే సీబీఐ చేపట్టిన చర్యలు అసాధారణంగా ఉన్నాయని వైవీ రెడ్డి పేర్కొన్నారు. ప్రైవేటు బ్యాంకుల వద్ద డిపాజిట్లు తగినన్ని ఉన్నాయని, అవి బాగున్నంత వరకు అవి కొనసాగుతాయని చెప్పారు. ప్రభుత్వరంగ బ్యాంకుల వద్ద డిపాజిటర్లకు సరిపడా నిధులు లేకపోయినప్పటికీ, ఎక్కువ వాటా ప్రభుత్వానిదే కనుక డిపాజిట్‌దారుల సొమ్ము సురక్షితమేనన్నారు.  ప్రభుత్వరంగ బ్యాంకులకు నిధుల సాయంలో జాప్యం, అనిశ్చితి ఆందోళనలు కలిగించే అంశాలేనని వైవీ రెడ్డి అన్నారు.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top