ప్రమాదంలో 2 వేల ఉద్యోగాలు

OYO may lay off 2000 employees in India by January end report  - Sakshi

సాక్షి, ముంబై: దేశంలో అతిపెద్ద హోటల్‌ బ్రాండ్‌ ఓయో దేశంలో కనీసం 2 వేల మంది ఉద్యోగులను తొలగించే అవకాశం ఉంది. ఖర్చులను తగ్గించుకునే చర్యల్లో భాగంగా ఉద్యోగాల్లో కోత  పెట్టనుంది. ది ఎకనామిక్ టైమ్స్ కథనం ప్రకారం జనవరి చివరినాటికి 2 వేల మందిని తొలగించాలని కంపెనీ యోచిస్తోంది. ముఖ్యంగా అమ్మకాలు, సరఫరా, ఆపరేషన్స్‌ విభాగాల్లో ఉద్యోగులను తగ్గించుకునేందుకు ప్రణాళికలు రచిస్తోంది.

రితేష్ అగర్వాల్ నేతృత్వంలోని హాస్పిటాలిటీ  సంస్థ ఓయో  ప్రతి నెలా తన ఉద్యోగుల పనితీరు సమీక్షిస్తుంది. ఈ ఫలితాలు, గ్రేడ్స్‌ ఆధారంగా కొంతమంది అభ్యర్థులను పనితీరు మెరుగుదలకు సంబంధించిన శిక్షణా కార్యక్రమానికి పంపడం లేదా తొలగించడం చేస్తుంది. అయితే సంస్థ పునరుద్ధరణలో భాగంగా సంతృప్తికరమైన గ్రేడ్స్‌ వచ్చిన ఉద్యోగులను కూడా తీసివేసేందుకు కంపెనీ ప్లాన్‌ చేస్తోందన్న అంచనాలు నెలకొన్నాయి. సాధారణంగా ‘డి’ రేటింగ్ ఉన్న ఉద్యోగులపై వేటు వేసే కంపెనీ, బీ అంతకంటే మెరుగైన రేటింగ్ ఉన్న ఉద్యోగులకు కూడా ఉద్వాసన పలకనుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ ఉద్యోగుల సగటు జీతాలు రూ. 10 నుంచి 12 లక్షల పరిధిలో ఉంటాయని భావిస్తున్నారు. 

కాగా ఐపీవోకు రావాలని ఆలోచిస్తున్న ఓయో ప్రణాళికలకు భారీ నష్టం బ్రేక్‌ వేసింది. మార్చి 2019తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో, ఓయో హోటల్స్ అండ్‌ హోమ్స్ నికర నష్టం రూ.2,384 కోట్లకు చేరింది. గత సంవత్సరంతో పోలిస్తే ఇది ఆరు రెట్లు ఎక్కువ. నిర్వహణ వ్యయాలు, ఉద్యోగుల సంబంధిత ఖర్చులు పెరగడం వల్ల నష్టం పెరిగిందని కంపనీ అంచనా. ఖర్చులు వార్షిక ప్రాతిపదికన ఆరు రెట్లు పెరిగి రూ.1,539 కోట్లకు చేరుకోగా, నిర్వహణ ఖర్చులు ఐదు రెట్లు పెరిగి 6,131 కోట్లకు చేరుకున్నాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top