రోజుకు రూ. 2,200 కోట్లు పెరిగింది! | Sakshi
Sakshi News home page

రోజుకు రూ. 2,200 కోట్లు పెరిగింది!

Published Mon, Jan 21 2019 7:05 PM

Oxfam says Wealth of Indian Billionaires Grew by Rs 2,200 crore a day in 2018 - Sakshi

సమాజంలో పేద-ధనిక మధ్య వ్యత్యాసం పెరుగుతూ పోతోందని అంతర్జాతీయ హక్కుల సంస్థ ఆక్స్ఫామ్‌ నివేదించింది.  భారతీయ కోటీశ్వరుల సంపద గత ఏడాది భారీగా పెరిగిందని ఆక్స్‌ఫామ్‌  స్టడీ తేల్చింది. సోమవారం విడుదల  చేసిన ఈ అధ్యయనం ప్రకారం 2018లో భారతీయ కుబేరుల సంపద రోజుకు 2వేల,200 కోట్ల రూపాయల మేర పుంజుకుంది. ప్రపంచవ్యాప్తంగా బిలియనీర్ల సంపద12శాతం పుంజుకుని రోజుకు దాదాపు 2.5 బిలియన్ డాలర్లుగా ఉంది. దేశంలో అత్యంత ధనవంతుల్లో 1 శాతం మంది ఆదాయం 39 శాతం పెరగ్గా, పేదవారి ఆదాయం మాత్రం 3 శాతం మాత్రమే  పెరిగిందని ఆక్స్‌ఫామ్‌ అధ్యయనంలో తేలింది. 

భారత్‌ జనాభాలో 50 శాతం మంది సంపద కేవలం 9 మంది బిలియనీర్ల వద్ద కేంద్రీకృతమై ఉందని పేర్కొంది. గత ఏడాది 26 మంది బిలియనీర్లు మరింత ధనికులై కోట్లకు పడగలెత్తితే.. సుమారు 3.8 బిలియన్ల మంది పేదలు ఇంకా దారిద్యంలోనే మగ్గుతున్నారని  రిపోర్ట్‌ చేసింది.  దీంతో  ప్రస్తుతం భారత్‌లో మొత్తం బిలియనీర్ల సంఖ్య 119కి చేరింది. వీరి మొత్తం ఆదాయం తొలిసారిగా 400 బిలియన్‌ డాలర్లు(రూ.28 లక్షల కోట్లు)కు చేరిందని ఆక్స్‌ ఫామ్‌ తెలిపింది. 2008 తర్వాత ఇదే భారీ పెరుగుదల. 2018-2022 మధ్య భారత్‌ నుంచి  కొత్తగా రోజుకు 70 మంది మిలియనీర్లుగా కొత్తగా ఈ జాబితాలో చేరతారని ఆక్స్‌ఫామ్‌ అంచనా వేసింది. ప్రపంచ ఎకనమిక్‌ ఫోరమ్‌ వార్షిక సమావేశం మరో ఐదు రోజుల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ సంస్థ తన అధ్యయనంలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. 

ప్రపంచంలో సగం పేద జనాభా వద్ద సొమ్ము 11 శాతం తగ్గిపోయింది అని ఆక్స్ఫామ్ ఆందోళన వ్యక్తం చేసింది.  దేశంలో  మొత్తం సంపదలో 77.4శాతం కేవలం జనాభాలోని కేవలం 10శాతం మంది చేతుల్లో వుంది. అంతేకాదు 51.53శాతం సంపద  1 శాతం ధనవంతుల వద్ద ఉంది.  60 శాతం మంది జాతీయాదాయంలో 4.8 శాతం సంపదను మాత్రమే కలిగి ఉన్నారు. భారత్‌లో 10 శాతం జనాభా 13.6 కోట్ల మంది ప్రజలు  కడుపేదవారుగా మారిపోతున్నారనీ, 2004 నుంచి అప్పుల్లోనే మగ్గిపోతున్నారు.

వైద్య, ప్రజా ఆరోగ్య, పారిశుద్ధ్యం, నీటి సరఫరా కోసం కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు వెచ్చిస్తున్న  మొత్తం రెవెన్యూ, ఖర్చులు రూ. 2,08,166 కోట్లుగా ఉన్నాయనీ, ఇది  భారతీయ  కుబేరుడు ముఖేష్ అంబానీ రూ. 2.8 లక్షల కోట్ల సంపద కంటే తక్కువని ఆక్స్‌ఫామ్‌ పేర్కొంది. అలాగే ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌  బెజోస్‌ సంపద 112 బిలియన్‌‌ డాలర్లకు చేరుకుంది. 115 మిలియన్‌ జనాభా ఉన్న ఇథోపియా దేశ ఆరోగ్య బడ్జెట్‌ బెజోస్‌ ఆదాయంలో 1 శాతం ఆదాయం సమానమని  ఆక్స్‌ఫామ్‌ స్టడీ వ్యాఖ్యానించింది.

2008లో పలు ప్రపంచదేశాల్లో ఆర్ధిక సంక్షోభం ఏర్పడినా బిలియనీర్ల సంఖ్య రెట్టింపయిందని ఆక్స్‌ఫామ్‌ స్టడీలో తేలింది. ముఖ్యంగా ప్రభుత్వాలు ఆరోగ్య, విద్య వంటి ప్రజా సేవలపై అతి తక్కువ నిధులతో అసమానతలను పెంచుతోంటే...మరోవైపు సూపర్ సంపన్నులు, కార్పొరేట్స్‌ దశాబ్దాల కాలంగా తక్కువ పన్నులు చెల్లిస్తున్నారని ఆక్స్‌ఫామ్‌ అమెరికా శాఖ వైస్ ప్రెసిడెంట్ పాల్ ఓబ్సీన్ తెలిపారు. కోట్లాది పేదలు, బడుగువర్గాలు రోజుకు అయిదున్నర డాలర్లకన్నా తక్కువ సంపాదిస్తూ దుర్భరంగా బతుకులీడుస్తున్నారన్నారు. ఇది పేద మహిళల, బాలికల విషయంలో మరీ అధ్వాన్నంగా ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం మన కళ్ళ ముందున్న ఆర్ధిక వ్యవస్థ చాలా ‘అమానుషం‘ గా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ధనికులు మరింత ధనికులు కావడాన్ని తాము వ్యతిరేకించకపోయినప్పటికీ..అదే సమయంలో పేదల సంపద కూడా పెరగాలి.. ఇందుకు ఆయా దేశాల ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలి అని పాల్ వ్యాఖ్యానించారు. తమ తాజా నివేదికను అన్ని దేశాలకూ పంపుతామని  చెప్పారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement