
నాలుగో అత్యంత సమానతా దేశంగా ఆవిర్భవించిన భారత్
వెల్లడించిన ప్రపంచబ్యాంక్ నివేదిక
న్యూఢిల్లీ: 2011–12 కాలం నుంచి చూస్తే 2022–23 నాటికి భారత్‌లో అసమానతలు బాగా తగ్గుముఖం పట్టాయని ప్రపంచబ్యాంక్ కీర్తించింది. అత్యంత పేదరికం స్థాయిలు కూడా బాగా తగ్గిపోయాయని ప్రపంచ బ్యాంక్ నివేదిక పేర్కొంది. నివేదిక ప్రకారం భారత్‌లో 2011–12 కాలంలో 16.2 శాతంగా ఉన్న ‘అత్యంత పేదరికం’.. 2022–23 ఏడాదికల్లా ఏకంగా 2.3 శాతానికి తగ్గిపోయింది.
గత దశాబ్దకాలంలో భారత్‌లో చేపట్టిన పలు రకాల సంక్షేమ, అభివృద్ధి పథకాల కారణంగా ఇంతటి మార్పు సాధ్యమైందని నివేదిక వ్యాఖ్యానించింది. సమానత్వం విషయంలో స్లోవాక్ రిపబ్లిక్(24.1), స్లోవేనియా(24.3), బెలారస్ (24.4)దేశాలు తొలి మూడు స్థానాలను కైవసం చేసుకోవడం విశేషం. గినీ ఇండెక్స్ స్కోర్‌లో చైనా, అమెరికా, బ్రిటన్ కంటే భారత్ మెరుగైన స్థానాన్ని కైవసం చేసుకోవడం విశేషం.
25.5 స్కోర్‌తో భారత్ ప్రపంచంలో నాలుగో అత్యుత్తమ సమానత్వ దేశంగా ఆవిర్భవించిందని ప్రపంచబ్యాంక్ ఒక ప్రకటనలో పేర్కొంది. దేశ ఆదాయం, సంపద, వినియోగం దేశవ్యాప్తంగా అన్ని కుటుంబాలు, వ్యక్తులకు ఎంత సమస్థాయిలో పంపిణీ అవుతోందన్న దానిని పరిగణనలోకి సున్నా నుంచి 100 వరకు గినీ ఇండెక్స్ స్కోర్‌ను ఇస్తారు. ఇండెక్స్ స్కోర్‌గా సున్నా వస్తే ఆ దేశంలో సమానత్వం అత్యున్నత స్థాయిలో ఉందని అర్థం. 98 స్కోర్ వస్తే దేశ సంపద అంతా ఒక్కరిద్దరి చేతుల్లోనే ఉండి మిగతా వాళ్లు కడు పేదరికంలో ఉన్నట్లు అర్థం.
167 దేశాల స్కోర్‌లను ప్రపంచబ్యాంక్ ప్రకటించగా చైనా 35.7, అమెరికా 41.8 స్కోర్ సాధించాయి. 25.5 స్కోర్‌తో భారత్ అసమానత కేటగిరీ(25–30)లో దిగువ స్థాయిలో నిలిచింది. నివేదిక ప్రకారం గత దశాబ్దకాలంలో భారత్‌లో 17.1 కోట్ల మంది భారతీయులు దారిద్యపు కోరల నుంచి బయటపడ్డారు. తక్కువ అసమానతల కేటగిరీలో దాదాపు 30 దేశాలున్నాయి. ఇందులో పటిష్టమైన సంక్షేమ పథకాలను అమలుచేస్తున్న కొన్ని యురోపియన్ దేశాలు సైతం ఉన్నాయి. వీటిలో ఐస్‌ల్యాండ్, నార్వే, ఫిన్లాండ్, బెల్జియంలతోపాటు అభివృద్దిచెందుతున్న దేశం పోలండ్, సంపన్న దేశం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఉన్నాయి.