ఎయిరిండియా ప్రైవేటీకరణ తప్పదు

No choice but to privatise Air India - Sakshi

యూనియన్లకు స్పష్టం చేసిన కేంద్ర మంత్రి హర్‌దీప్‌ సింగ్‌ పురి

ముంబై: దాదాపు రూ. 80,000 కోట్ల పైగా రుణభారం పేరుకుపోయిన ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియాను ప్రైవేటీకరించడం తప్ప మరో మార్గం లేదని పౌర విమానయాన శాఖ మంత్రి హర్‌దీప్‌ సింగ్‌ పురి స్పష్టం చేశారు. ప్రైవేటీకరణ ప్రక్రియకు ఉద్యోగులంతా సహకరించాలని పేర్కొన్నారు. ఎయిరిండియాకు చెందిన కొన్ని యూనియన్ల నేతలతో గురువారం జరిగిన సమావేశంలో ఆయన ఈ విషయాలు స్పష్టం చేశారు. అయితే, ప్రైవేటీకరణ ప్రణాళికలపై యూనియన్లు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ప్రభుత్వం కొంత మద్దతునిస్తే కంపెనీని నిర్వహించుకోగలిగే సామర్థ్యం ఉద్యోగులకు ఉందని పేర్కొన్నాయి.  

ప్రైవేటీకరించినా.. ఉద్యోగ భద్రత వంటి విషయాల్లో ఉద్యోగుల్లో నెలకొన్న ఆందోళనలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మంత్రి చెప్పినట్లు దాదాపు గంటపైగా సాగిన సమావేశం అనంతరం యూనియన్‌ ప్రతినిధి ఒకరు తెలిపారు. ‘ఎయిరిండియా రుణభారం రూ. 80,000 కోట్ల పైగా ఉందని, ఏ నిపుణుడి దగ్గరా దీనికి పరిష్కార మార్గాలు లేవని మంత్రి చెప్పారు. ఈ పరిస్థితుల్లో కంపెనీని ప్రైవేటీకరించడం ఒక్కటే ప్రభుత్వం ముందున్న మార్గమని తెలిపారు‘ అని ప్రతినిధి వివరించారు. మరోవైపు, ప్రైవేటీకరణపై యూనియన్ల ప్రతినిధులతో సుదీర్ఘంగా, ఉపయోగకరమైన విధంగా చర్చలు జరిగాయని మైక్రోబ్లాగింగ్‌ సైటు ట్విట్టర్‌లో మంత్రి పోస్ట్‌ చేశారు. మరో 10 రోజుల్లో మళ్లీ సమావేశం కానున్నట్లు పేర్కొన్నారు.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top