విదేశీ శాఖల్లో కూడా మోదీకి రుణాలు

Nirav Modi firms availed loans from PNB's Hong Kong, Dubai - Sakshi

పీఎన్‌బీ అంతర్గత నివేదికలో వెల్లడి

న్యూఢిల్లీ: వజ్రాభరణాల వ్యాపారి నీరవ్‌ మోదీ రుణ కుంభకోణాన్ని తవ్వినకొద్దీ మరిన్ని కొత్త అంశాలు బయటపడుతున్నాయి. మోదీ సంస్థలు కేవలం బ్రాడీ హౌస్‌ బ్రాంచ్‌ నుంచే కాకుండా తమ దుబాయ్, హాంకాంగ్‌ శాఖల నుంచి కూడా రుణాలు తీసుకున్నట్లు పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ) పేర్కొంది. ఇందుకు సంబంధించిన అంతర్గత విచారణ నివేదికను పీఎన్‌బీ దర్యాప్తు ఏజెన్సీలకు అందజేసింది.

దీని ప్రకారం మోదీ గ్రూప్‌ కంపెనీలైన ఫైర్‌స్టార్‌ డైమండ్‌ లిమిటెడ్‌ హాంకాంగ్, ఫైర్‌స్టార్‌ డైమండ్‌ ఎఫ్‌జెడ్‌ఈ దుబాయ్‌ సంస్థలు పీఎన్‌బీకి చెందిన హాంకాంగ్, దుబాయ్‌ శాఖల నుంచి రుణ సదుపాయాలు పొందాయి. రూ. 14,000 కోట్ల నీరవ్‌ మోదీ  కుంభకోణంపై విచారణ ప్రారంభమైన వెంటనే.. ఈ రెండు సంస్థలకు రుణ సదుపాయాన్ని బ్యాంకు నిలిపివేసింది. అయితే, ఈ రెండు ఖాతాల్లోనూ అవకతవకలేమీ జరిగిన దాఖలాలు లేవని పీఎన్‌బీ తమ నివేదికలో పేర్కొంది.

మోదీ సంస్థలతో బ్యాంకు అధికారులు కుమ్మక్కై మోసపూరిత లెటర్స్‌ ఆఫ్‌ అండర్‌టేకింగ్స్‌ (ఎల్‌వోయూ) ద్వారా ఈ స్కామ్‌కు ఎలా తెరతీసినదీ.. వివరంగా తెలియజేసేలా సుమారు 162 పేజీల నివేదికతో పాటు పలు అంతర్గత ఈ–మెయిల్స్‌ని కూడా ఆధారాలుగా దర్యాప్తు ఏజెన్సీలకు సమర్పించింది. అమెరికా కేంద్రంగా పనిచేసే ఫైర్‌స్టార్‌ డైమండ్‌ స్కామ్‌ బైటపడిన తర్వాత ఫిబ్రవరిలోనే దివాలా పిటీషన్‌ వేసింది. రుణ కుంభకోణంలో సింహభాగం ఈ సంస్థకే చేరినట్లు అనుమానాలున్న నేపథ్యంలో దివాలా ప్రక్రియలో పీఎన్‌బీ కూడా పారీగా చేరింది.

అడ్డంకులు పెడితే రహస్య ఎజెండా ఉన్నట్లే: మాల్యా
బాకీలు తీర్చే దిశగా తన ఆస్తుల అమ్మకానికి ఈడీ, సీబీఐ అభ్యంతరాలు పెడితే.. రుణాల రికవరీకి మించిన రహస్య ఎజెండా మరేదో ఉందని భావించాల్సి వస్తుందని వ్యాపారవేత్త విజయ్‌ మాల్యా వ్యాఖ్యానించారు. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించేందుకు అన్ని ప్రయత్నాలూ చేస్తూనే ఉంటానని, కానీ రాజకీయాలు చేస్తే మాత్రం తాను చేయగలిగేదేమీ లేదన్నారు.

ఈ మేరకు మైక్రోబ్లాగింగ్‌ సైటు ట్వీట్టర్‌లో ట్వీట్‌ చేశారు. న్యాయస్థానం పర్యవేక్షణలో ఆస్తులను విక్రయించి రుణదాతలకు చెల్లించేసేందుకు అనుమతించాలంటూ న్యాయస్థానం అనుమతి కోరినట్లు మాల్యా పేర్కొన్నారు.  కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ రూ. 9,000 కోట్ల పైచిలుకు బ్యాంకులకు ఎగవేసిన మాల్యా.. ఇంగ్లాండ్‌కి పారిపోయిన సంగతి తెలిసిందే.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top