నాస్‌డాక్‌కు ఫాంగ్‌ స్టాక్స్‌ దెబ్బ

Nasdaq- S&P down on FAANG stocks weakness  - Sakshi

మార్కెట్లు 2-1 శాతం మధ్య డౌన్‌

తొలుత డోజోన్స్‌ 500 పాయింట్లు అప్‌

ఫైజర్‌ వ్యాక్సిన్‌పై పెరిగిన అంచనాలు

ఫైజర్‌, బయోఎన్‌టెక్‌ షేర్లు జూమ్‌

జర్మన్‌ కంపెనీ బయోఎన్‌టెక్‌తో సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న కోవిడ్‌-19 వ్యాక్సిన్‌ మరింత ముందంజ వేసిన వార్తలతో తొలుత జోరందుకున్న డోజోన్స్‌ చివర్లో అమ్మకాలు పెరిగి నీరసించింది. నేడు బ్యాంకింగ్‌ దిగ్గజాలు క్యూ2(ఏప్రిల్‌-జూన్‌) ఫలితాలు ప్రకటించనున్న నేపథ్యంలో తొలుత 500 పాయింట్లు జంప్‌చేసిన డోజోన్స్‌ లాభాల స్వీకరణ కారణంగా చివరికి 10 పాయింట్ల నామమాత్ర లాభంతో 26,086 వద్ద నిలిచింది. మరోవైపు టెక్నాలజీ దిగ్గజాలు డీలాపడటంతో నాస్‌డాక్‌, ఎస్‌అండ్‌పీకి దెబ్బతగిలింది. వెరసి సోమవారం  నాస్‌డాక్‌ 227 పాయింట్లు(2.15 శాతం) పతనమై 10,391 వద్ద స్థిరపడగా.. ఎస్‌అండ్‌పీ 30 పాయింట్లు(1 శాతం) నీరసించి 3,155 వద్ద ముగిసింది. కోవిడ్-19 కేసులు పెరుగుతండటంతో కాలిఫోర్నియా గవర్నర్‌ తిరిగి లాక్‌డవున్‌ నిబంధనలను కఠినతరం చేసిన వార్తలతో సెంటిమెంటు బలహీనపడినట్లు నిపుణులు పేర్కొన్నారు.

ఫార్మా దన్ను
కరోనా వైరస్‌ కట్టడికి రూపొందిస్తున్న వ్యాక్సిన్‌కు ఫాస్ట్‌ట్రాక్‌ హోదాను ప్రకటించడంతో ఈ నెలాఖరున తదుపరి దశ పరీక్షలను చేపట్టనున్నట్లు ఫైజర్‌, బయోఎన్‌టెక్‌ పేర్కొన్నాయి. దీంతో బయోఎన్‌టెక్‌ షేరు 10 శాతం దూసుకెళ్గగా.. ఫైజర్‌ 4 శాతం జంప్‌చేసింది. చిప్‌ తయారీ కంపెనీ అనలాగ్‌ డివైసెస్‌ మాగ్జిమ్‌ ఇంటిగ్రేటెడ్‌ను కొనుగోలు చేయనున్నట్లు వెల్లడించింది. దీంతో అనలాగ్‌ 6 శాతం పతనంకాగా.. మాగ్జిమ్‌ 8 శాతం ఎగసింది. సాల్టీ స్నాక్స్‌ ఫ్రిటోస్‌, చీటోస్‌ అమ్మకాలు పెరుగుతున్నట్లు పేర్కొనడంతో పెప్సీకో 0.3 శాతం బలపడింది.

నేలచూపులో
ఫాంగ్‌ స్టాక్స్‌లో నెట్‌ఫ్లిక్స్‌ 4.25 శాతం పతనంకాగా.. ఫేస్‌బుక్‌ 2.5 శాతం క్షీణించింది. అల్ఫాబెట్‌ దాదాపు 2 శాతం బలహీనపడింది. ఇక మైక్రోసాఫ్ట్‌ 3 శాతం తిరోగమించింది. కాగా.. తొలుత 16 శాతం దూసుకెళ్లిన ఆటో దిగ్గజం టెస్లా ఇంక్‌ షేరు చివరికి 3 శాతం నష్టంతో ముగిసింది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top