మళ్లీ గాడిలో పడతాం!

Narendra Modi Addressing Video Conference At CII Annual Conference - Sakshi

ఆర్థిక వ్యవస్థ వృద్ధి బాటలోకి వస్తుంది...

ప్రభుత్వ సంస్కరణలు ఫలితాన్నిస్తాయ్‌

అవసరమైతే మరిన్ని సంస్కరణలు

ప్రధాని మోదీ ఆశాభావం

న్యూఢిల్లీ: భారత్‌ తిరిగి మునుపటి ఆర్థిక వృద్ధి బాటలోకి అడుగుపెడుతుందన్న విశ్వాసాన్ని ప్రధాని నరేంద్ర మోదీ వ్యక్తం చేశారు. రైతులు, చిన్న పరిశ్రమలు, వ్యాపారవేత్తల సాయంతో దీన్ని సాధిస్తామన్న ఆశాభావం వ్యక్తం చేశారు. లాక్‌డౌన్‌ కాలంలో ప్రభుత్వం తీసుకున్న సంస్కరణల చర్యలు దీర్ఘకాలంలో ఆర్థిక వ్యవస్థకు మేలు చేస్తాయన్నారు. భారత్‌ తిరిగి వృద్ధి దిశలోకి వెళ్లేందుకు గాను.. సంకల్పం, సమగ్రత, పెట్టుబడులు, సదుపాయాలు, ఆవిష్కరణలపై దృష్టి సారించాల్సి ఉంటుందన్నారు. ఇటీవల ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఈ ఉద్దేశాలను ప్రతిఫలిస్తాయన్నారు. భారత్‌ క్రెడిట్‌ రేటింగ్‌ను పెట్టుబడుల విషయంలో అతి తక్కువ రేటింగ్‌కు (బీఏఏ3) డౌన్‌గ్రేడ్‌ చేస్తూ మూడీస్‌ ఇన్వెస్టర్‌ సర్వీసెస్‌ నిర్ణయం తీసుకున్న మరుసటి రోజే ప్రధాని ఈ విధంగా స్పందించడం గమనార్హం.

మంగళవారం జరిగిన సీఐఐ వార్షిక సదస్సును ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రధాని మాట్లాడారు. ఇటువంటి పరీక్షా కాలంలో దేశీయ పరిశ్రమలు గ్రామీణ భారతంతో కలసి పనిచేయాలని పిలుపునిచ్చారు. దేశ గతిని మార్చేందుకు అవసరమైతే మరిన్ని నిర్మాణాత్మక సంస్కరణలు చేపడతామని ప్రకటించారు. కీలకమైన రంగాల్లో దేశీయ అవసరాలను స్థానికంగానే తీర్చుకునే లక్ష్యంతో కూడిన స్వయం సమృద్ధ భారత్‌ (ఆత్మ నిర్భర్‌ భారత్‌) ప్రణాళికను ప్రధాని మరోసారి ప్రస్తావించారు. ఈ లక్ష్య సాధనలో పరిశ్రమల వెన్నంటి నిలుస్తామన్నారు. వైరస్‌ బారి నుంచి ప్రజల ప్రాణాలను కాపాడుతూ, మరోవైపు ఆర్థిక వ్యవస్థ స్థిరీకరణ, వృద్ధి వేగవంతానికి చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు.

అవకాశాలను సొంతం చేసుకోవాలి...
‘‘విశ్వసనీయమైన, నమ్మకమైన భాగస్వామి కోసం ప్రపంచం చూస్తోంది. భారత్‌కు తగిన సామర్థ్యం, శక్తి, బలాలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా భారత్‌కు ఏర్పడిన విశ్వసనీయత నుంచి ఈ రోజు అన్ని పరిశ్రమలు లాభపడాలి. మీరు ఓ రెండు అడుగులు ముందుకు వేస్తే మీకు మద్దతుగా ప్రభుత్వం నాలుగు అడుగులు వేస్తుంది. నేను మీకు అండగా ఉంటానని ప్రధానమంత్రిగా హామీ ఇస్తున్నాను’’ అంటూ దేశ వృద్ధిలో పరిశ్రమలు పెద్ద పాత్ర పోషించాలన్న ఆకాంక్షను ప్రధాని తన మాటల ద్వారా వ్యక్తం చేశారు. ‘‘భారత్‌లో బలమైన కంపెనీలు ఏర్పాటు కావాలి. అవి ప్రపంచ శక్తులుగా మారాలి.

తద్వారా ఉపాధికల్పన జరిగి ప్రజాసాధికారతకు దారితీయాలి. స్థానికంగా బలమైన సరఫరా వ్యవస్థలను నెలకొల్పినట్టయితే అది అంతర్జాతీయ సరఫరా వ్యవస్థలను బలోపేతం చేస్తుంది. ప్రపంచం కోసం భారత్‌లో తయారీని చేపట్టాలి’’ అంటూ ప్రధాని తన ఆశయాలను విపులీకరించారు. నిత్యావసరం కాని వస్తు దిగుమతులను కనిష్ట స్థాయికి తగ్గించాలంటూ అందుకు పరిశ్రమలు దేశీయంగానే ఉత్పత్తిని పెంచే చర్యలు చేపట్టాలని కోరారు. ఫర్నిచర్, ఎయిర్‌ కండీషనర్లు, పాదరక్షలు, తోలు పరిశ్రమలను ప్రాధాన్య రంగాలుగా గుర్తించినట్టు ప్రధాని చెప్పారు. మొబైల్‌ ఫోన్లు, రక్షణ పరికరాల దిగుమతులను తగ్గించుకుంటున్నట్టు తెలిపారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top