హోమ్‌ థియేటర్‌.. ఎంటర్‌టైన్‌మెంట్‌ అడ్డా!

More popular with online movies and videos - Sakshi

చిన్న పట్టణాలకూ విస్తరించిన ట్రెండ్‌

ఆన్‌లైన్‌ సినిమాలు, వీడియోలతో మరింత ఆదరణ

దేశవ్యాప్తంగా ఏటా 20,000 ఇన్‌స్టలేషన్స్‌

దేశంలో 5వ స్థానంలో హైదరాబాద్‌

విదేశీ దిగ్గజ కంపెనీల పోటాపోటీ..

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: అమెజాన్, హాట్‌స్టార్, జీ, ఈరోస్, సన్‌... ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి కంపెనీ తమకు ప్రత్యేక హక్కులున్న సినిమాలు, ఇతర వీడియో కంటెంట్‌తో ఆన్‌లైన్లోకి వచ్చేశాయ్‌!!. కొన్ని కంపెనీలు కాస్త ముందుకెళ్లి సొంత కంటెంట్‌నూ అభివృద్ధి చేస్తున్నాయి. ఇదంతా ఎందుకంటే.. స్మార్ట్‌ టీవీల సాయంతో ఇంట్లోనే సినిమాలు చూసే జనం పెరుగుతుండటం వల్లే!! కొందరైతే ఇంకాస్త ముందుకెళ్లి... ఇళ్లనే థియేటర్లుగా మార్చేసుకుంటున్నారు. ఇంటిల్లిపాదీ కలిసో... బంధువులతోనో రిలీజైన సినిమాలను సై తం అదే రోజు చూసేస్తున్నారు. వారికిపుడు హోమ్‌ థియేటర్‌ అంటే ఎంటర్‌టైన్‌మెంట్‌ అడ్డా!. ఇపుడీ ట్రెండ్‌ నగరాలను దాటి చిన్న పట్టణాలకూ విస్తరించింది. తక్కువలో తక్కువ రూ.1.5 లక్షలతోనూ హోమ్‌ థియేటర్‌ను ఏర్పాటు చేసుకునే వీలుండటమే చాలామందిని దీనివైపు మొగ్గేలా చేస్తోంది. 

ఎంత పెడితే అంత హిట్‌!! 
హోమ్‌ థియేటర్‌ గురించి చెప్పాలంటే... ఎంత ఖర్చు పెడితే అంత సూపర్‌ హిట్‌. కొందరు దీనికోసం రూ.3.5 కోట్లు కూడా ఖర్చు పెడుతున్నారంటే అతిశయోక్తేమీ కాదు. ఇంకొందరు ఏకంగా 600 అంగుళాల తెరను సైతం ఏర్పాటు చేసుకుంటున్నారు. ఒక్క హైదరాబాద్‌ నగరంలోనే హోమ్‌ థియేటర్‌ కోసం రూ.1 కోటి అంతకన్నా ఎక్కువ ఖర్చు చేసిన వారు 50 మంది వరకూ ఉన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.2013 నుంచీ దేశంలో ఈ రంగం పుంజుకుంటూ వస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఏడాదికి 20,000 వరకూ హోమ్‌ థియేటర్‌ ఇన్‌స్టలేషన్లు జరుగుతున్నాయనేది గణాంకాలు చెబుతున్న మాట.దేశవ్యాప్తంగా చూస్తే ముంబై, ఢిల్లీ వంటి మెట్రోల తరవాత హైదరాబాద్‌ 5వ స్థానంలో నిలుస్తోంది.
 
ఇదీ... హోమ్‌ థియేటర్‌ సిస్టమ్‌ 

సినిమా థియేటర్‌ స్థాయిలో కాకపోయినా సాధారణ టీవీని మించిన పెద్ద తెర హోమ్‌ థియేటర్‌ ప్రత్యేకత. ప్రొజెక్టర్‌ ద్వారా తెరపై పిక్చర్‌ వేసుకుని చూడటమే కాక... గోడనే స్క్రీన్‌గా మార్చుకునే వెసులుబాటు కూడా ఉంది. కాకపోతే దీనికోసం ప్రత్యేక పెయింట్‌ను వాడాలి. ఈ రంగంలో కెనడాకు చెందిన ‘స్క్రీన్‌ గో’ బ్రాండ్‌ అగ్రగామిగా ఉంది. 80 అంగుళాల తెరకు పెయింట్‌ చేయాలంటే రూ.12,000 ఖర్చవుతుంది.అలా కాకుండా ఫ్రంట్‌ ప్రొజెక్షన్‌ స్క్రీన్‌ లేదా అకౌస్టిక్‌ ట్రాన్స్‌పరెంట్‌ స్క్రీన్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు. సౌండ్‌ కోసం స్పీకర్స్, ఏవీ రిసీవర్స్‌/ ప్రాసెసర్స్‌ వాడాలి. అత్యుత్తమ శబ్దం కోసం అకౌస్టిక్‌ ట్రీట్‌మెంట్‌ చేస్తారు. ఇక దీనికి హోమ్‌ ఆటోమేషన్‌ కూడా తోడైతే నాలుగైదు రిమోట్లకు బదులుగా స్మార్ట్‌ఫోన్‌ లేదా ఐప్యాడ్‌తో ఆపరేట్‌ చేసుకునేందుకు వీలవుతుంది. 55 అంగుళాలు, ఆపైన టీవీ ఉంటే సైతం హోమ్‌ థియేటర్‌గా మార్చుకోవచ్చు. 

చిన్న పట్టణాలకూ విస్తరణ..  
హోమ్‌ థియేటర్ల ట్రెండ్‌ ఇపుడు చిన్న పట్టణాలకూ విస్తరించింది. ఏపీలో నరసాపురం, పాలకొల్లు, భీమడోలు, తెలంగాణలో తాండూరు, శంషాబాద్‌ వంటి పలు ప్రాంతాలకూ పాకింది. హైదరాబాదీ కంపెనీలు ఏటా 2,000 హోమ్‌ థియేటర్లను ఇన్‌స్టాల్‌ చేస్తున్నాయి. ఇందులో 30 శాతం హైదరాబాద్‌ వెలుపల ఉంటాయని ఈ రంగంలో ఉన్న ప్రముఖ కంపెనీ వెక్టర్‌ సిస్టమ్స్‌ తెలియజేసింది. ఇక హోమ్‌ థియేటర్‌ ఒకసారి ఇన్‌స్టాల్‌ చేస్తే 8–10 ఏళ్లపాటు మన్నుతుంది. బ్రాండెడ్‌ కంపెనీలు రెండేళ్లు వారంటీ ఇస్తున్నాయి. అకౌస్టిక్స్‌తో అయితే సిస్టమ్‌ ఏర్పాటుకు 4 వారాలు పడుతుంది. అకౌస్టిక్స్‌ లేకుండా అయితే రెండు రోజుల్లో పూర్తి చేయొచ్చు.

కనీసం రూ.1.5 లక్షల నుంచి... 
హోమ్‌ థియేటర్‌ ఏర్పాటుకు కనీసం రూ.1.5 లక్షలు అవుతుంది. ఇక గరిష్ఠం ఎంతన్నది చెప్పలేం. సోనీ, ప్యానాసోనిక్, బార్కో, ఎప్సన్, బెన్‌క్యు వంటి బ్రాండ్ల ప్రొజెక్టర్ల ధర రూ.60 వేల నుంచి రూ.60 లక్షల వరకు ఉంది. రూ.1 లక్ష ఆపైన ప్రొజెక్టర్ల విభాగంలో తమకు 60 శాతం వాటా ఉన్నట్లు సోనీ ఇండియా ప్రతినిధి ‘సాక్షి బిజినెస్‌ బ్యూరో’ ప్రతినిధితో చెప్పారు. స్పీకర్స్‌లో బీఅండ్‌డబ్లు్య, మానిటర్‌ ఆడియో, డాలి, మేయర్, బోస్‌ వంటి బ్రాండ్ల ధర రూ.40 వేల నుంచి రూ.2 కోట్ల వరకు ఉంది. ఏవీ రిసీవర్లు సైతం రూ.25 వేల నుంచి 25 లక్షల దాకా లభిస్తున్నాయి. అకౌస్టిక్స్‌కు చదరపు అడుగుకు రూ.150– 2,500 ఖర్చవుతుంది. సీట్లు రూ.20 వేల నుంచి రూ.6 లక్షల దాకా ఉన్నాయి. ఆటోమేషన్‌ కావాలంటే రూ.1.5 లక్షలవుతుంది.  

ప్రపంచవ్యాప్త కంటెంట్‌తో.. 
హోమ్‌  థియేటర్‌ ఉన్న స్నేహితుడు, బంధువు ఇంట్లో కలుసుకోవడం ఇపుడో ట్రెండ్‌గా మారింది. క్యూబ్‌ సర్వర్‌కు కనెక్ట్‌ అయి రిలీజ్‌ అయిన రోజే ఇంట్లో సినిమా చూస్తున్నారు. అమెజాన్, నెట్‌ఫ్లిక్స్‌ వంటి దిగ్గజాలతో అంతర్జాతీయ కంటెంట్‌ కూడా ఇంటర్నెట్లో లభ్యమవుతోంది. 2000 సంవత్సరంలో ప్రారంభమైన మా కంపెనీ ఇప్పటి వరకు 1,000కిపైగా ఇన్‌స్టలేషన్స్‌ పూర్తి చేసింది. హైదరాబాద్‌లో అకౌస్టికల్‌ సొసైటీ ఆఫ్‌ అమెరికా గుర్తింపు ఉన్న ఏకైక సంస్థ మాదే. ఫైనాన్స్‌ కంపెనీలు గనక వీటికి ఈఎంఐ సదుపాయం కల్పిస్తే ఈ విభాగంలో అనూహ్య వృద్ధి ఉంటుంది.  
– ముడిమెల వెంకట శేషారెడ్డి, ఎండీ, వెక్టర్‌ సిస్టమ్స్‌  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top