మూడు నెలలు... 52వేల కోట్లు!

Jet Airways and IL&FS, PSBs set aside Rs 50,000 crore provisions - Sakshi

ప్రభుత్వ బ్యాంకుల పుట్టి ముంచుతున్న మొండి బాకీలు

ఒక్క క్యూ4లోనే 52వేల కోట్ల కేటాయింపులు

దీంతో లాభాల స్థానంలో భారీ నష్టాలు

మరికొన్ని క్వార్టర్ల పాటు ఇదే వరస: విశ్లేషకులు  

ముంబయి: ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల మొండి బకాయిలు అంతకంతకూ పేరుకుపోతుండటంతో వాటికి బ్యాంక్‌లు అధికంగా కేటాయింపులు జరపాల్సి వస్తోంది. ఫలితంగా ప్రతి త్రైమాసికానికీ బ్యాంక్‌ల లాభదాయకత అంతకంతకూ క్షీణిస్తోంది. గత ఆర్థిక సంవత్సరం క్యూ3లో ఎన్‌పీఏలకు జరిపిన కేటాయింపులతో పోలిస్తే క్యూ4లో మొండి బకాయిల కేటాయింపులతో పోల్చితే ఇవి రూ.29,625 కోట్లు అధికం. విమానయాన సంస్థ, జెట్‌ ఎయిర్‌వేస్‌ కూలిపోవడం, ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ కంపెనీ కూడా మూతపడటంతో ప్రభుత్వ బ్యాంక్‌ల మొండి బకాయిల సమస్య మరింత తీవ్రంగా మారింది.

గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక కాలానికి 13 ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల మొత్తం కేటాయింపులు రూ.52,739 కోట్లకు చేరటంతో ఈ ప్రభావం బ్యాంక్‌ల లాభదాయకతపై బాగానే పడింది. ఎనిమిది బ్యాంక్‌లకు రూ.15,192 కోట్ల మేర నికర నష్టాలు వచ్చాయి. ఐదు బ్యాంక్‌లకు మాత్రమే నికర లాభాలొచ్చాయి. ఒక్కో బ్యాంక్‌ నష్టాలు నాలుగంకెల్లో (వెయ్యి కోట్లకు పైగా) ఉండగా, లాభాల్లో ఉన్న బ్యాంక్‌ల లాభాలు రెండు, మూడు అంకెల్లో (రూ.95 కోట్లు నుంచి రూ.838 కోట్ల రేంజ్‌) మాత్రమే ఉన్నాయి.  

ఇప్పట్లో కష్టమే....
ఈ మొండి బకాయిల్లో ఎంత మొత్తం బకాయిలు వసూలు అవుతాయో, ఎంత మేర బకాయిలను బ్యాంక్‌లు రద్దు చేస్తాయో, ఎన్ని కోట్ల కేటాయింపులు మళ్లీ వెనక్కి వస్తాయో ఎవరూ జవాబివ్వలేని ప్రశ్నగా మిగిలిపోయింది. కేటాయింపుల పరిమాణం చూస్తే, మొండి బకాయిల బండ ఇప్పట్లో బ్యాంక్‌లను వీడేటట్లు లేదని నిపుణులంటున్నారు.  

కేటాయింపుల వ్యధ...
గత క్యూ3లో రూ.6,006 కోట్లుగా ఉన్న ఎస్‌బీఐ మొండి కేటాయింపులు గత క్యూ4లో నాలుగు రెట్లు పెరిగి రూ.16,502 కోట్లకు చేరాయి. ఐఎల్‌ఎఫ్‌ఎస్‌కు ఇచ్చిన రూ.3,487 కోట్ల రుణాల్లో 1,125 కోట్ల రుణాలను మొండి బకాయిలుగా ఎస్‌బీఐ వర్గీకరించింది. అలాగే జెట్‌ ఎయిర్‌వేస్‌కు చెందిన రూ.1,200 కోట్ల బకాయిలను కూడా మొండి బకాయిలుగా ఈ బ్యాంక్‌ గుర్తించింది. మొండి బకాయిలకు కేటాయింపులు కారణంగా రూ.1,985 కోట్ల నికర నష్టాలు వచ్చాయని ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌ తెలిపింది.

ఈ బ్యాంక్‌ కేటాయింపులు రూ.4,502 కోట్లుగా ఉన్నాయి. రానున్న క్వార్టర్లలో ఈ బ్యాంక్‌ కేటాయింపులు మరింతగా పెరుగుతాయని విశ్లేషకులంటున్నారు. దీంతో మరో రెండు క్వార్టర్ల పాటు ఈ బ్యాంక్‌కు నష్టాలు తప్పవని వారంటున్నారు. దాదాపు ప్రతి బ్యాంక్‌ పరిస్థితి ఇలాగే ఉంది. రెండు బ్యాంక్‌ల కేటాయింపులు మాత్రం గత క్యూ4లో తగ్గాయి. యునైటెడ్‌ బ్యాంక్‌ కేటాయింపులు రూ.1,967 కోట్ల నుంచి రూ.1,688 కోట్లకు, బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర కేటాయింపులు రూ.4,422 కోట్ల నుంచి రూ.415 కోట్లకు తగ్గాయి. ఈ రెండు బ్యాంక్‌లకు గత క్యూ4లో నికర లాభాలు వచ్చాయి.

వడ్డీ ఆదాయం కంటే మొండి బకాయిల కేటాయింపులే అధికం...
మొత్తం 13 ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల్లో ఎనిమిది బ్యాంక్‌ల నికర వడ్డీ ఆదాయం కంటే కూడా మొండి బకాయిల కేటాయింపులే అధికంగా ఉన్నాయి. మొండి బకాయిల ప్రక్షాళన కోసం సదరు ఎనిమిది బ్యాంక్‌లు కనీసం మరో రెండేళ్ల పాటు కేటాయింపులు జరపాల్సి ఉంటుందని నిపుణులంటున్నారు. మొత్తం 13 ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల నికర వడ్డీ ఆదాయం రూ.43,304 కోట్లు. కాగా, మొండి బకాయిలు కేటాయింపులు రూ.52,739 కోట్లకు చేరాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top