ఇరాన్‌ చమురుపై భారత్‌కు షాక్‌

Iran oil: US to end sanctions exemptions for major importers - Sakshi

దిగుమతులను పూర్తిగా ఆపేయాలి: అమెరికా

లేకపోతే ఆంక్షలు తప్పవని హెచ్చరిక  

వాషింగ్టన్‌: ఇరాన్‌ నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్న భారత్, చైనాతో పాటు అయిదు దేశాలకు అమెరికా షాకివ్వనుంది. ఇప్పటిదాకా దిగుమతి ఆంక్షల నుంచి ఇస్తున్న మినహాయింపులను ఎత్తివేయాలని నిర్ణయించింది. మీడియా కథనాల ప్రకారం.. ఇరాన్‌ నుంచి దిగుమతులను పూర్తిగా నిలిపివేయాలని, లేకపోతే ఆంక్షలు ఎదుర్కొనాల్సి వస్తుందని ఆయా దేశాలను హెచ్చరించనుంది. అణ్వస్త్రాల తయారీ చేయొద్దన్న తమ మాటను బేఖాతరు చేసిన ఇరాన్‌పై మరింత ఒత్తిడి తెచ్చేందుకే అమెరికా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అమెరికా రక్షణ మంత్రి మైక్‌ పాంపియో దీనిపై ప్రకటన చేయనున్నట్లు వార్తలు వెలువడ్డాయి. ప్రస్తుతం ఇరాన్‌ నుంచి ముడిచమురు దిగుమతి చేసుకుంటున్న దేశాలకు మే 2 నుంచి ఎలాంటి మినహాయింపులు వర్తింపచేసేది లేదంటూ ఆయన ప్రకటించనున్నారని ఇద్దరు ప్రభుత్వాధికారులను ఉటంకిస్తూ వాషింగ్టన్‌ పోస్ట్‌ పత్రిక పేర్కొంది. ఇరాక్, సౌదీ అరేబియా తర్వాత ఇరాన్‌ నుంచే భారత్‌ అత్యధికంగా చమురు దిగుమతి చేసుకుంటోంది. 2017 ఏప్రిల్‌ – 2018 జనవరి మధ్య కాలంలో భారత్‌కు ఇరాన్‌ 18.4 మిలియన్‌ టన్నుల ముడిచమురు ఎగుమతి చేసింది. ఒకవేళ మినహాయింపులను ఎత్తివేసిన పక్షంలో ముడిచమురు దిగుమతుల్లో లోటును తక్కువ వ్యయాలతో భర్తీ చేసుకునేందుకు భారత్‌ ఇతరత్రా మార్గాలను అన్వేషించాల్సి రానుంది. 

ద్వైపాక్షిక సంబంధాలకు దెబ్బ.. 
అణ్వస్త్రాల తయారీ ఆపేయాలన్న ఆదేశాలను ఉల్లంఘించిన ఇరాన్‌ నుంచి చమురు దిగుమతి చేసుకోరాదంటూ అమెరికా ఆంక్షలు విధించడం తెలిసిందే. అయితే, భారత్, చైనా, జపాన్‌ వంటి 8 దేశాలకు తాత్కాలికంగా 180 రోజుల పాటు మినహాయింపునిచ్చింది. ఇరాన్‌ నుంచి చమురు దిగుమతులను గణనీయంగా తగ్గించుకున్న నేపథ్యంలో ఆ దేశం నుంచి కొంత కొనుగోళ్లు జరపడం కొనసాగించేందుకు అనుమతిస్తోంది. తాజాగా ఈ మినహాయింపులను మొత్తం తొలగించి, దిగుమతులను పూర్తిగా నిలిపివేయించడం ద్వారా ఇరాన్‌పై ఒత్తిడి మరింత పెంచాలన్నది అమెరికా వ్యూహం. ఇరాన్‌ చమురును అత్యధికంగా దిగుమతి చేసుకుంటున్నది భారత్, చైనాలే. ఒకవేళ ఈ దేశాలు గానీ అగ్రరాజ్యం డిమాండ్లను పక్కనపెడితే ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతినడంతో పాటు వాణిజ్యం వంటి ఇతరత్రా అంశాలపైనా ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top