యాపిల్‌ ఐఫోన్‌ 11 వచ్చేసింది..

iPhone 11 Pro And 11 Pro Max launched with triple cameras - Sakshi

ప్రారంభ ధర 699 డాలర్లు

యాపిల్‌ టీవీ పేరుతో వీడియో స్ట్రీమింగ్‌ సర్వీస్‌ ప్రారంభం

ఆర్కేడ్‌ పేరుతో వీడియో గేమింగ్‌ సర్వీస్‌  కూడా..

కాలిఫోర్నియా: ప్రపంచమంతా ఉత్కంఠతో  ఎదురు చూస్తోన్న కొత్త ఐఫోన్‌లను యాపిల్‌ విడుదల చేసింది. ఐఫోన్‌ 11, 11 ప్రో, 11 ప్రో మ్యాక్స్‌ అధునాతన స్మార్ట్‌ఫోన్‌లను యాపిల్‌ హెడ్‌క్వార్టర్స్‌ క్యుపర్టినోలోని స్టీవ్‌ జాబ్స్‌ ఆడిటోరియమ్‌లో జరిగిన ప్రత్యేక ఈవెంట్‌లో  ఆవిష్కరించారు. ఐఫోన్‌ 11 ఆరు రంగుల్లో లభ్యం కానున్నది. కొత్తగా గ్రీన్, పర్పుల్‌ రెడ్, యెల్లో రంగుల్లో లభించనున్నది.  స్పెషల్‌ ఆడియో, డాల్బీ అట్మోస్‌ ఫీచర్, ఇరువైపులా 12 మెగాపిక్సెల్‌ అల్ట్రా వైడ్‌ యాంగిల్‌ కెమెరా, 6.1 లిక్విడ్‌ రెటినా డిస్‌ప్లే, స్లో మోషన్‌ సెల్ఫీలు, ఏ13 బయోనిక్‌ చిప్‌ వంటి ప్రత్యేకతలున్నాయి. ఐఫోన్‌ 11 ధర 699 డాలర్ల నుంచి మొదలవుతుంది.

యాపిల్‌ ఐ వాచ్‌ 5..
మరోపక్క,  ఐవాచ్‌ సిరీస్‌ 5ను తీసుకొచ్చింది. మామూలు వాచ్‌లాగానే ఎప్పుడు డిస్‌ప్లే కంటికి కనిపించేలా ఐ వాచ్‌ సిరీస్‌ 5ను ఆవిష్కరించింది. ఈ వాచ్‌ల్లో కంపాస్‌ను కూడా అమర్చింది. ధర 399 నుంచి  499 డాలర్లు. ఏడో జనరేషన్‌ ఐప్యాడ్‌లను కూడా యాపిల్‌ ప్రవేశపెట్టింది.  ధరలు 329 డాలర్ల నుంచి ప్రారంభమవుతాయి. వీటి అమ్మకాలు ఈ నెల 30 నుంచి మొదలవుతాయి. కొత్తగా వీడియో స్ట్రీమింగ్‌ సర్వీస్‌–యాపిల్‌ టీవీ, వీడియో గేమింగ్‌ సర్వీస్‌–ఆర్కేడ్‌లను అందుబాటులోకి తెచ్చింది.

యాపిల్‌ టీవీ...
నెట్‌ఫ్లిక్స్‌ తరహా స్ట్రీమింగ్‌ వీడియో సర్వీస్, ఆపిల్‌ టీవీని యాపిల్‌ కంపెనీ అందుబాటులోకి తెచ్చింది. ఆపిల్‌ టీవీ ద్వారా ఓఫ్రా విన్‌ఫ్రే, జెన్నిఫర్‌ అనిస్టిన్‌ తదితర స్టార్స్‌ నటించిన ఒరిజినల్‌ ప్రోగ్రామ్స్‌ను ప్రసారం చేస్తుంది. వంద దేశాల్లో ఈ సర్వీస్‌ నవంబర్‌ 1 నుంచి లభించనున్నది. నెలకు సబ్‌స్క్రిప్షన్‌ 4.99 డాలర్లు. కొత్త ఐఫోన్‌లు, ఐపాడ్‌లు కొన్నవాళ్లకు ఏడాది పాటు ఈ సర్వీస్‌ను ఉచితంగా అందిస్తారు.  

యాపిల్‌ ఆర్కేడ్‌
యాపిల్‌ కంపెనీ వీడియో గేమింగ్‌ సర్వీస్‌–ఆర్కేడ్‌ను అందుబాటులోకి తెచ్చింది. ధర 4.99 డాలర్లు ఇది ఈ నెల 19 నుంచి అందుబాటులోకి వస్తుంది. కొత్తగా వంద గేమ్స్‌ను అందిస్తోంది. మన అన్నపూర్ణ స్టూడియోస్‌ సంస్థ కూడా కొన్ని గేమ్స్‌ను అందిస్తుండటం విశేషం.  

సర్వీసులపై దృష్టి...
ఐఫోన్‌ల అమ్మకాలు పడిపోవడంతో ఇప్పుడు యాపిల్‌ కంపెనీ సర్వీసులపై దృష్టి పెట్టిందని నిపుణులంటున్నారు. గత ఏడాది వరుసగా మూడు క్వార్టర్ల పాటు ఐఫోన్‌ల అమ్మకాలు పడిపోయాయి. గతంలో కొత్తది రాగానే పాత ఫోన్‌ను పక్కనపెట్టి, కొత్త ఫోన్‌ కోసం పరుగులు పెట్టేవాళ్లు. ఇప్పుడు సీన్‌ మారింది. కనీసం ఐఫోన్‌ యూజర్లలో చాలా మంది మూడేళ్లు దాటిన తర్వాతనే కొత్త ఐఫోన్‌ను కొనుగోలు చేస్తున్నారని నిపుణులంటున్నారు. డివైస్‌ల అమ్మకాలు పడిపోతుండటంతో ఆపిల్‌ మ్యూజిక్, ఐక్లౌడ్, యాపిల్‌ టీవీ వంటి సర్వీసులపై యాపిల్‌ కంపెనీ దృష్టిని ఎక్కువగా పెడుతోంది. 

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top