ఆర్థిక వృద్ధి.. అంతకు మించి! 

International economic growth is the worst - Sakshi

ఐఎంఎఫ్‌ అంచనాలు మించుతాం 

నీతి ఆయోగ్‌ చైర్మన్‌ అమితాబ్‌ కాంత్‌

ప్రపంచ ఆర్థిక సదస్సులో వెల్లడి

దావోస్‌: అంతర్జాతీయ ఆర్థిక వృద్ధి అంతంతమాత్రంగానే ఉన్నప్పటికీ, భారత్‌ మాత్రం ఈ ఆర్థిక సంవత్సరంలో 7.5 శాతం వృద్ధి సాధిస్తుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌) అంచనా వేసినట్లు నీతి ఆయోగ్‌ సీఈఓ అమితాబ్‌ కాంత్‌ వ్యాఖ్యానించారు. ఇది భారత్‌ సత్తాకు నిదర్శనమంటూ... తాము అంతకు మించిన ఆర్థిక వృద్ధిని సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇక్కడ జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో(డబ్ల్యూఈఎఫ్‌)  మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

పట్టణీకరణే కీలకం... 
భవిష్యత్తులో ఆర్థిక వృద్ధికి పట్టణీకరణ జోరే కీలకమని కాంత్‌ వివరించారు. వంద స్మార్ట్‌ సిటీల అభివృద్ధి జరుగుతోందని, ఇది పట్టణీకరణ జోరును మరింతగా పెంచగలదని పేర్కొన్నారు. ‘‘ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. మౌలిక సదుపాయాల కల్పన వేగవంతమైంది. సంస్కరణలు కొనసాగుతున్నాయి. దీంతో వృద్ధి మరింత జోరందుకుంటుంది. మరోవైపు ద్రవ్యోల్బ ణం, ద్రవ్యలోటు వంటి ఆర్థిక అంశాలు నియంత్రణలోనే ఉన్నాయి’’ అని ఆయన వివరించారు. 

వినియోగదారుడికే అగ్ర పీఠం... 
టెక్నాలజీ కారణంగా సరైన ఉత్పత్తులను, సేవలను వినియోగదారులకు అందించగలమని బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ చీఫ్‌ సంజీవ్‌ బజాజ్‌ తెలిపారు. వినియోగదారుడికే అగ్రపీఠం అనే విధానాన్ని తాము అనుసరిస్తామని చెప్పారు. టెక్నాలజీని సరిగ్గా వినియోగించుకోవడం వల్లే వినియోగదారులకు తక్షణం రుణాలందించగలుగుతున్నామని తెలిపారు.

చేయాల్సింది ఎంతో ఉంది... 
భారత్, చైనాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై మరింత ప్రభావం చూపడం మొదలైందని జర్మనీ చాన్స్‌లర్‌ ఏంజెలా మెర్కెల్‌ చెప్పారు. అంతర్జాతీయ సంస్థలు ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొన్నారు. అమెరికా వంటి దేశాలు తమ స్వప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తున్నాయని.. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ బాగా పాడైందని, దీనిని బాగుకోసం చాలా చేయాల్సింది ఉందన్నారు.

అమెరికా, చైనా, భారత్‌లు ముందుండాలి: జపాన్‌ ప్రధాని షింజో అబె 
ప్రపంచ వాణిజ్య వ్యవస్థపై మళ్లీ విశ్వాసం పెరిగేలా చూడాలని ప్రపంచ దేశాల నాయకులను జపాన్‌ ప్రధాన మంత్రి షింజో అబె కోరారు. ప్రపంచ వాణిజ్య సంస్థకు (డబ్ల్యూటీఓ) కొత్త జవసత్వాలు కల్పించడానికి అమెరికా, చైనా, భారత్‌ కృషి చేయాలని కోరారాయన. పెరిగిపోతున్న వృద్ధ జనాభా సమస్యను ఉమెనామిక్స్‌ (మహిళలకు ఎక్కువ అవకాశాలు కల్పించడం) ద్వారా అధిగమించామని, ఓటమినే ఓడించామని పేర్కొన్నారు. తమ దేశంలో 65 ఏళ్ల వ్యక్తులు కూడా పనిచేయడానికి ముందుకు వస్తారని, వంద మంది కాలేజీ పట్టభద్రులు ఉద్యోగాలు చేయడానికి సిద్ధంగా ఉంటే, 98 మందికి ఉద్యోగాలు లభిస్తాయని వెల్లడించారు.

మిత్రులతో వ్యాపారం వద్దు: జాక్‌ మా 
వ్యాపార వీరులు పోటీ గురించి, ఒత్తిడి గురించి అస్సలు ఆలోచించరని చైనా ఆన్‌లైన్‌ దిగ్గజం ఆలీబాబా వ్యవస్థాపకుడు జాక్‌  మా వ్యాఖ్యానించారు. పిల్లలు సృజనాత్మకంగా, వినూత్నంగా ఆలోచించేలా చూడాలని, యంత్రాల మాదిరిగా వాళ్లు  తయారు కాకూడదని పేర్కొన్నారు. భవిష్యత్తులో యంత్రాలకు చిప్‌లుంటాయని, కానీ మానవులకు హృదయం ఉంటుందని, ఈ దిశలో విద్యావిధానాలు ఉండాలని సూచించారు. పర్యావరణ హితంగా టెక్నాలజీ ఉండాలన్నారు. వ్యాపారం కంటే స్నేహం విలువైనదని, మీ మిత్రులను ఎప్పుడూ వ్యాపారంలో కలుపుకోవద్దని ఆయన సలహా ఇచ్చారు. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top