ఇండస్‌ఇండ్‌- రామ్‌కో సిస్టమ్స్‌.. దూకుడు

IndusInd bank- Ramco systems jumps - Sakshi

ఇండస్‌ఇండ్‌- ప్రమోటర్ల వాటా పెంపు 

వారం రోజుల్లో షేరు 30 శాతం జూమ్‌

రామ్‌కో- విజయ్‌ కేడియా వాటా కొనుగోలు

రెండు రోజుల్లోనే షేరు 44 శాతం హైజంప్‌

కోవిడ్‌-19 ప్రభావంతో ఈ ఏడాది అమెరికా జీడీపీ 6.5 శాతం క్షీణించనున్నట్లు ఫెడ్‌ వేసిన అంచనాలతో ప్రపంచవ్యాప్తంగా సెంటిమెంటు బలహీనపడింది. దీంతో దేశీయంగానూ అమ్మకాలదే పైచేయిగా నిలుస్తోంది. ప్రస్తుతం సెన్సెక్స్‌ 340 పాయింట్లు పతనమై 33,907ను తాకింది. తద్వారా 34,000 పాయింట్ల మార్క్‌ దిగువకు చేరింది. నిఫ్టీ 90 పాయింట్లు క్షీణించి 10,026 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలోనూ సానుకూల వార్తల కారణంగా ప్రయివేట్‌ రంగ దిగ్గజం ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఐటీ సేవల కంపెనీ రామ్‌కో సిస్టమ్స్‌ కౌంటర్లు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. వెరసి నష్టాల మార్కెట్లోనూ భారీ లాభాలతో కళకళలాడుతున్నాయి. వివరాలు చూద్దాం..

ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ 
సెకండరీ మార్కెట్‌ ద్వారా అదనపు వాటాను కొనుగోలు చేయనున్నట్లు ప్రమోటర్లు పేర్కొనడంతో ప్రయివేట్‌ రంగ సంస్థ ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ కౌంటర్‌ జోరు చూపుతోంది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో 5.3 శాతం జంప్‌చేసి రూ. 526 వద్ద ట్రేడవుతోంది. తొలుత 8 శాతం ఎగసి గరిష్టంగా రూ. 541కు చేరింది. వెరసి వరుసగా ఐదో రోజు లాభాలతో కదులుతోంది. గత వారం రోజుల్లో ఈ షేరు 30 శాతం దూసుకెళ్లడం విశేషం! అయితే గతేడాది ఆగస్ట్‌లో నమోదైన చరిత్రాత్మక గరిష్టం రూ. 2038తో పోలిస్తే ఇప్పటికీ 73 శాతం పతనంలో ఉన్నట్లు నిపుణులు పేర్కొన్నారు. ఇక మార్చి 24న రూ. 236 వద్ద 52 వారాల కనిష్టాన్ని తాకింది. ఈ స్థాయి నుంచి చూస్తే రెట్టింపునకుపైగా ఎగసింది. కాగా.. ప్రస్తుతం ఇండస్‌ఇండ్‌లో ప్రమోటర్లకు 14.68 శాతం వాటా ఉంది. ఈ వాటాను 26 శాతానికి పెంచుకునేందుకు అనుమతించమంటూ ఏప్రిల్‌లోనే ప్రమోటర్లు ఆర్‌బీఐకు దరఖాస్తు చేసుకున్న విషయం విదితమే.

రామ్‌కో సిస్టమ్స్‌
సుప్రసిద్ధ ఇన్వెస్టర్‌ విజయ్‌ కిషన్‌లాల్‌ కేడియా ఈ నెల 10న రామ్‌కో సిస్టమ్స్‌ ఈక్విటీలో 1.1 శాతం వాటాకు సమానమైన దాదాపు 3.4 లక్షల షేర్లను కొనుగోలు చేసినట్లు ఎన్‌ఎస్‌ఈ డేటా వెల్లడించింది. ఐటీ కన్సల్టింగ్‌ కంపెనీ రామ్‌కో సిస్టమ్స్‌లో వాటాను ఓపెన్‌ మార్కెట్‌ ద్వారా షేరుకి రూ. 87.82 ధరలో సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. కేడియా సెక్యూరిటీస్‌ ద్వారా విజయ్‌ కేడియా రెప్రో ఇండియా, ఎవరెస్ట్‌ ఇండస్ట్రీస్‌, సుదర్శన్‌ కెమికల్స్‌, సెరా శానిటరీ తదితర స్మాల్‌ క్యాప్‌ కంపెనీలలో ఇన్వెస్ట్‌ చేసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో గత రెండు రోజులుగా రామ్‌కో సిస్టమ్స్‌ కౌంటర్‌కు డిమాండ్‌ పెరిగింది. వెరసి వరుసగా రెండో రోజు 20 శాతం అప్పర్‌ సర్క్యూట్‌ను తాకింది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో రూ. 18.4 ఎగసి రూ. 110 వద్ద ఫ్రీజయ్యింది. ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈలో కలిపి ఇప్పటివరకూ 7 లక్షల షేర్లకుపైగా చేతులు మారినట్లు నిపుణులు వెల్లడించారు. మంగళవారం ఈ షేరు రూ. 77 సమీపంలో ముగిసింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top