ఐడియా పేమెంట్స్‌ బ్యాంక్‌ మూసివేత!

Idea Payments Bank Closure - Sakshi

ముంబై: మరో పేమెంట్స్‌ బ్యాంక్‌ మూసివేత ఖరారైంది. ఆదిత్య బిర్లా ఐడియా పేమెంట్స్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌ లిక్విడేషన్‌కు తాజాగా  ఆర్‌బీఐ ఆమోదం తెలిపింది. స్వచ్ఛంద మూసివేత కోసం ఆదిత్య బిర్లా ఐడియా పేమెంట్స్‌ బ్యాంక్‌ దరఖాస్తు చేసిందని, ఈ విషయమై బాంబే హై కోర్ట్‌ ఈ ఏడాది సెపె్టంబర్‌ 18న ఆదేశాలు జారీ చేసిందని ఆర్‌బీఐ పేర్కొంది. ఆదిత్య బిర్లా ఐడియా  పేమెంట్స్‌  బ్యాంక్‌ లిక్విడేటర్‌గా విజయ్‌కుమార్‌ వి అయ్యర్‌ను బాంబై హై కోర్ట్‌ నియమించిందని వివరించింది.

అయ్యర్‌ డెలాయిట్‌ టచ్‌ తొమత్సు ఇండియా ఎల్‌ఎల్‌పీలో సీనియర్‌ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారని తెలిపింది. ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయని, దీంతో ఈ వ్యాపారాన్ని నిర్వహించలేమని, స్వచ్ఛంద మూసివేతను ఈ ఏడాది జూలైలోనే ఆదిత్య బిర్లా ఐడియా పేమెంట్స్‌ బ్యాంక్‌ ప్రకటించింది.  2015 ఆగస్టులో ఆర్‌బీఐ మొత్తం 11 సంస్థలకు పేమెంట్స్‌ బ్యాంకింగ్‌ కార్యకలాపాల లైసెన్స్‌లను ఇచ్చింది. గత ఏడాది ఫిబ్రవరిలో ఐడియా పేమెంట్స్‌ బ్యాంక్‌ కార్యకలాపాలను ప్రారంభించింది.
 
నాలుగో కంపెనీ...: పేమెంట్స్‌ బ్యాంకింగ్‌ రంగం నుంచి వైదొలగిన నాలుగో కంపెనీగా ఆదిత్య బిర్లా ఐడియా పేమెంట్స్‌ బ్యాంక్‌ నిలిచింది. గతంలో  దిలిప్‌ సంఘ్వి, ఐడీఎఫ్‌సీ బ్యాంక్, టెలినార్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్ల కన్సార్షియంతో పాటు టెక్‌ మహీంద్రా, చోళమండలం ఇన్వెస్ట్‌మెంట్‌లు ఈ రంగం నుంచి వైదొలిగాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top