స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌కు హెచ్‌టీసీ గుడ్‌బై!? | HTC Hangs Up On India Smartphone Operations | Sakshi
Sakshi News home page

స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌కు హెచ్‌టీసీ గుడ్‌బై!?

Jul 19 2018 5:07 PM | Updated on Jul 19 2018 5:18 PM

HTC Hangs Up On India Smartphone Operations - Sakshi

హెచ్‌టీసీ స్మార్ట్‌ఫోన్‌ ఫైల్‌ ఫోటో

కోల్‌కతా : చైనీస్‌ స్మార్ట్‌ఫోన్‌ కంపెనీల తాకిడిని తట్టుకోలేక భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ నుంచి ఓ ప్రముఖ కంపెనీ కనుమరుగు కాబోతుంది. తైవాన్‌కు చెందిన మొబైల్ తయారీ కంపెనీ హెచ్‌టీసీ భారత స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌కు గుడ్‌బై చెప్పబోతున్నట్టు తెలుస్తోంది. హెచ్‌టీసీ టాప్‌ మేనేజ్‌మెంట్‌ కంట్రీ హెడ్‌ సిద్ధిఖీ, సేల్స్ హెడ్ విజయ్ బాలచంద్రన్, ప్రొడక్ట్ హెడ్ ఆర్.నయ్యర్ ముగ్గురూ ఒకేసారి రాజీనామా చేసినట్టు తెలిసింది. వీరితోపాటు కంపెనీ చీఫ్ ఫైనాన్షియర్ అయిన రాజీవ్ దయాల్‌ను కూడా వెళ్లిపొమ్మని కంపెనీ ఆదేశించినట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. అంతేకాక మరో 70 నుంచి 80 మంది ఉద్యోగులకు కూడా కంపెనీ సెటిల్‌మెంట్‌ చేస్తుందని వెల్లడైంది. 

గత మూడు, నాలుగేళ్లుగా నష్టాల్లో ఉన్న కంపెనీని ఇక గట్టెక్కించలేమని నిర్ణయానికి వచ్చిన తర్వాత.. మొత్తం కంపెనీని మూసివేయాలని యాజమాన్యం నిర్ణయించిందట. ఇందులో భాగంగానే ప్రస్తుతానికి సేల్స్ కూడా నిలిపివేస్తుందని తెలిసింది. అయితే భారత స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లోకి ఆన్‌లైన్‌ ఎక్స్‌క్లూజివ్‌ బ్రాండ్‌ ద్వారా రీ-ఎంట్రీ ఇవ్వాలని కూడా కంపెనీ యోచిస్తోందని ఓ ఎగ్జిక్యూటివ్‌ చెప్పారు. కానీ పూర్తిగా అమ్మకాలను నిలిపివేసిన తర్వాతే, ఆన్‌లైన్‌ మార్కెట్లోకి ఎంట్రీ ఇస్తుందని తెలిపారు. అది కూడా తైవాన్ నుంచే ఆపరేట్ చేస్తుందని చెప్పారు.

నాణ్యతకు మారుపేరుగా ఉన్న హెచ్‌టీసీ స్మార్ట్‌ఫోన్ల అమ్మకాలు ఇటీవల కాలంలో భారీగా తగ్గాయి. చైనా స్మార్ట్‌ఫోన్ల నుంచి వస్తున్న పోటీని తట్టుకోలేక హెచ్‌టీసీ అమ్మకాలు భారీగా పడిపోయాయి. చాలా మార్కెట్లలో హెచ్‌టీసీ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంపెనీ తయారీ యూనిట్లను మూసివేస్తూ వస్తోంది. ఇప్పటికే భారీ సంఖ్యలో ఉద్యోగుల తొలగింపు కూడా చేపట్టింది. ఇప్పుడు ఏకంగా భారత్‌లో అమ్మకాలనే బంద్ చేయాలని నిర్ణయించిందని తెలిసింది.

అయితే హెచ్‌టీసీ భారత్‌లో స్మార్ట్‌ఫోన్‌ అమ్మకాలను నిలిపివేయబోతుందని వస్తున్న వార్తలపై హెచ్‌టీసీ అధికార ప్రతినిధి స్పందించారు. భారత్‌లో స్మార్ట్‌ఫోన్‌ అమ్మకాలను కొనసాగిస్తామని చెప్పారు. హెచ్‌టీసీకి భారత్‌ చాలా ముఖ్యమైన మార్కెట్‌ అని అన్నారు. భారత్‌లో పెట్టుబడులు పెట్టడాన్ని కొనసాగిస్తామన్నారు. తాజాగా భారత ఆఫీసులో చేపట్టిన వర్క్‌ఫోర్స్‌ తగ్గించడం లాంటి వాటితో, కంపెనీని మరింత సమర్థవంతంగా తీర్చుదిద్దుతామని, వృద్ధి, ఆవిష్కరణలో ఇదో కొత్త స్టేజ్‌ అని చెప్పారు.  కాగ, గ్లోబల్‌గా హెచ్‌టీసీ విక్రయాలు ఏడాది ఏడాదికి 68 శాతం మేర తగ్గాయి. రెండున్నర ఏళ్లలో ఇదే భారీ పతనం. గ్లోబల్‌గా 1500 మేర వర్కర్లను తీసేయబోతున్నట్టు కంపెనీ ప్రకటన కూడా చేసింది. భారత్‌లో హెచ్‌టీసీకి కేవలం 1 శాతం కంటే తక్కువ మార్కెట్‌ షేరే ఉంది. శాంసంగ్‌,ఆపిల్‌, చైనా వన్‌ప్లస్‌, షావోమిలు భారత మార్కెట్‌లో అగ్రగామిగా ఉన్నాయి. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement